లక్నో: ఉత్తరప్రదేశ్‌లో 2027లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తామని సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్అఖిలేశ్ యాదవ్ ప్రతిజ్ఞ చేశారు. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ఆదర్శాలను కాపాడేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఈమేరకు శుక్రవారం సర్దార్ వల్లభాయ్ పటేల్150వ జయంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో అఖిలేశ్ మీడియాతో మాట్లాడారు. యూపీ ప్రభుత్వం మండీలను ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు.
‘‘యూపీలో అత్యంత విలువైన భూములలో నిర్మించిన మండీలను ప్రభుత్వం ఇప్పుడు ప్రైవేటు వ్యక్తుల పరం చేయడానికి ప్రయత్నిస్తోంది. రైతులకు లాభం చేకూర్చాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఏ కోశానా లేదు. అందుకే రైతులు నష్టపోతారని తెలిసీ మండీలను అమ్మాలని ప్రయత్నిస్తోంది” అని విమర్శించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చెరుకు ధరను క్వింటాల్‌కు రూ.30 పెంచడాన్నీ ఆయన ఎద్దేవా చేశారు. ఇంతకాలం తర్వాత అంత తక్కువ మొత్తం పెంచడం.. పైపెచ్చు దీనికి భారీ ప్రచారం చేసుకోవడాన్ని ఆయన విమర్శించారు.
