ఎన్నికల ముంగట స్కీమ్​లు పెడ్తం.. తప్పేంది?

ఎన్నికల ముంగట స్కీమ్​లు పెడ్తం.. తప్పేంది?
  • ఎన్నికల ముంగట స్కీమ్​లు పెడ్తం.. తప్పేంది?
  • మాది సన్యాసుల మఠం కాదు.. రాజకీయ పార్టీ
  • ఇంకా లెఫ్ట్​ పార్టీలతో పొత్తేంటి?..
  • మజ్లిస్​తో స్నేహం కొనసాగుతది
  • కొన్ని పేపర్లు మా మీద విషం చిమ్ముతున్నయ్​..
  • ఆ విలేకర్లకు జాగలు ఇయ్యం
  • పోటీ చేయడం, చేయకపోవడం..  మైనంపల్లి ఇష్టమని కామెంట్​

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో 95 నుంచి 105 సీట్లు గెలిచి మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని బీఆర్ఎస్​చీఫ్, సీఎం కేసీఆర్​ అన్నారు. రాష్ట్ర ప్రగతిని కొనసాగించాలనే అజెండాతోనే ఎన్నికలకు వెళ్తున్నామని చెప్పారు. ‘‘ఇతర పార్టీలకు ఎన్నికలు పొలిటికల్‌‌‌‌ గేమ్‌‌‌‌, బీఆర్ఎస్​కు మాత్రం పవిత్ర యజ్ఞం” అని ఆయన పేర్కొన్నారు. అక్టోబర్‌‌‌‌ 16న వరంగల్‌‌‌‌లో నిర్వహించే సింహగర్జన వేదికగా ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు.

మజ్లిస్‌‌‌‌తో తమ స్నేహం కొనసాగుతుందని, రాష్ట్రంలోని 17ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. సోమవారం తెలంగాణ భవన్​లో బీఆర్ఎస్​అభ్యర్థుల ప్రకటన సందర్భంగా కేసీఆర్​ మీడియాతో మాట్లాడారు. ‘‘తెలంగాణ కొత్త రాష్ట్రమైనా, వనరులు తక్కువగా ఉన్నా అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ వజ్రంలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకున్నం. అభివృద్ధికి కొలమానంగా చూసే తలసరి ఆదాయం, తలసరి విద్యుత్‌‌‌‌ వినియోగంలో అగ్రస్థానంలో ఉన్నం. ఈ ప్రగతిని కొనసాగించాలనే అజెండాతో ఎన్నికలకు వెళ్తున్నం” అని తెలిపారు. 

మాది మఠం కాదు.. రాజకీయ పార్టీ

ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అనేక హామీలను తమ ప్రభుత్వం అమలు చేసిందని కేసీఆర్​ అన్నారు.  ఎన్నికల ముంగిట రుణమాఫీ సహా వివిధ హామీలు అమలుచేయడంలో తప్పేమిటని, తమది మఠం కాదని, రాజకీయ పార్టీ  అని పేర్కొన్నారు. ‘‘అక్టోబర్​16న వరంగల్​లో బీఆర్ఎస్​ భారీ ర్యాలీ చేయనుంది. ఆరోజు అక్కడే మేనిఫెస్టో విడుదల చేస్తం. మాకు రాజకీయ వ్యూహం ఉంటుంది. మేనిఫెస్టోలో చెప్పని పథకాలు కల్యాణ లక్ష్మీ, మిషన్​ భగీరథ, కేసీఆర్​ కిట్​వంటివి ఇచ్చినం. మాది సన్యాసుల మఠం కాదు కదా.. రాజకీయ పార్టీ. ఎన్నికల ముంగట పథకాలు ప్రవేశపెడ్తం.. దానిలో ఏం ఉంది” అని ప్రశ్నించారు.

శ్రావణమాసం.. మంచి ముహూర్తమని, వేద పండితులు నిర్ణయించిన ముహూర్తం 2:38 గంటలకే.. అభ్యర్థులను ప్రకటిస్తున్నం” అని తెలిపారు. భూపాల‌‌‌‌ప‌‌‌‌ల్లిలో వెంక‌‌‌‌ట‌‌‌‌ర‌‌‌‌మ‌‌‌‌ణారెడ్డికి మాజీ స్పీక‌‌‌‌ర్ మ‌‌‌‌ధుసూద‌‌‌‌నాచారి మ‌‌‌‌ద్దతు ఇస్తున్నారని, తాండూరులో ప‌‌‌‌ట్నం మ‌‌‌‌హేంద‌‌‌‌ర్ రెడ్డి కూడా రోహిత్ రెడ్డికి మద్దతు ఇస్తున్నారని అన్నారు. ఇలా ఉన్నంత‌‌‌‌లో అన్ని స‌‌‌‌ర్దుబాటు చేసుకుని, ఈ లిస్ట్ విడుద‌‌‌‌ల చేస్తున్నామని చెప్పారు.  పార్టీ టికెట్​రానంత మాత్రాన చిన్నబుచ్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. అనవసర హడావుడి చేసి భవిష్యత్​నాశనం చేసుకోవద్దని చెప్పారు.  బీఆర్ఎస్​సముద్రం లాంటిదని, పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరికి అవకాశాలుంటాయన్నారు. టికెట్​రానివాళ్లు కూడా పార్టీలోనే కొనసాగాలని సూచించారు. ‘‘రాజకీయ జీవితం అంటే ఎమ్మెల్యేగా పని చేయడమే కాదు.. ఎమ్మెల్సీ, రాజ్యసభ ఇలా అనేక అవకాశాలుంటాయి.. చాలా మంది జిల్లా పరిషత్​చైర్మన్లు అయ్యే అవకాశం కూడా ఉంటుంది.. గతంలో అలా చేశాం కూడా..” అని అన్నారు. 

పోటీ చేయడం, చేయకపోవడం మైనంపల్లి ఇష్టం

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని సహించబోమని కేసీఆర్​ చెప్పారు. ‘‘యాంటి పార్టీగా ఎవరు పోయినా, వాళ్లు ఎంతవాళ్లయినా సరే పార్టీ నుంచి బయటకు పంపుతం.  క్రమశిక్షణ చర్యలు చిన్నచిన్నగా ఉండవు. వందశాతం చర్యలు తీసుకుంటం. పార్టీ నుంచి పీకి అవతల పడేస్తం” అని హెచ్చరించారు. ఎవరు చేసుకున్న ఖర్మకు వారే బాధ్యులన్నారు. హరీశ్​రావుపై మల్కాజ్​గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తీవ్ర వ్యాఖ్యలు చేయడంపైనా కేసీఆర్​ స్పందించారు.

ఎమ్మెల్యే మైనంపల్లికి టికెట్​ఇచ్చినం.. పోటీ చేయడం, చేయకపోవడం ఆయన ఇష్టానికే వదిలేస్తున్నం.. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలా.. వద్దా అన్నది ఆయనే నిర్ణయించుకోవాలి..” అని తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ ​క్రమశిక్షణతో కూడిన పార్టీ అని, ఎవరైనా వ్యవహారశైలి పార్టీకి ఇబ్బందికరంగా ఉంటే మార్చేస్తామన్నారు. పెండింగ్​లో ఉన్న 4 స్థానాల్లో అభ్యర్థులపై 4 రోజుల్లోనే నిర్ణయం తీసుకుంటామన్నారు.

కాంగ్రెస్​ను ప్రజలు నమ్మరు

కాంగ్రెస్​కు గత అసెంబ్లీ ఎన్నికల్లో పట్టిన గతే మళ్లీ పడుతుందని కేసీఆర్​ అన్నారు. ఆ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు. ‘‘మేం ఎన్నికల కోసం ఆపద మొక్కులు మొక్కే వాళ్లం కామని 2014 ఎన్నికలప్పుడే చెప్పినం. ఎవలు ఏందో ప్రజలకు తెలుసు.. పోయిన ఎలక్షన్​లో ఇదే కాంగ్రెస్​పార్టీ 2 లక్షల వరకు ఒక్కసారే రుణమాఫీ చేస్తామని చెప్పింది.. ప్రజలకు కూడా తెలిసి ఉండాలె.. ప్రభుత్వం వద్దకు డబ్బు వస్తూ పోతూ ఉంటుంది.. ప్రభుత్వం దగ్గర బీరువాల్లో డబ్బు ఉండదు. ఒక్కటేసారి రుణమాఫీ చేస్తమని చెప్పలేదు.. ఒక లక్ష మాత్రమే ఇస్తమని చెప్పినం. విడతల వారిగా ఇస్తమని చెప్పినం. మమ్మల్ని ప్రజలు నమ్మిన్రు..

ఇప్పుడు కూడా అదే జరుగుతది” అని కేసీఆర్​ అన్నారు.  ‘‘50 ఏండ్లు అవకాశం ఇచ్చిన తర్వాత మళ్లీ ఒక్క చాన్స్​ఏంది? అధికారంలో ఉన్నప్పుడు రూ.200 పింఛన్​ముఖాన కొట్టినోళ్లు.. ఇప్పుడు మళ్లీ వచ్చి రూ.4 వేల పింఛన్​ఇస్తనంటే ఎవరైనా నమ్ముతరా.. మాకు చెప్పరాద రూ.5 వేలు ఇస్తమని. ప్రజలకు ఎవరేంటో తెలుసు.. మాకు విజయాన్ని అందించి.. కాంగ్రెస్​ను తోల్కబోయి బొంద పెట్టిన్రు.. కాంగ్రెస్​ను నమ్మి మొన్న కర్నాటకలో గెలిపిస్తే ఏం చేసిండ్రో చూసిండ్రు” అని వ్యాఖ్యానించారు. 

ఆ విలేకర్లకు జాగలియ్యం

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ కేసీఆర్​ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండ్ల స్థలాలు ఇచ్చే అంశం లాస్ట్​దశలో ఉందని, ఇచ్చే ప్రయత్నం చేస్తామని అంటూనే.. ‘‘కొన్ని పేపర్లు మామీద విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నయ్​.. ఆ విలేకర్లకు మాత్రం ఇవ్వం.. న్యూట్రల్​గా ఉండే మిగతా అందరికీ ఇస్తం.. రోజూ ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రగతి మీద విషం చిమ్ముతున్నరో ఆ విలేకర్లకు మాత్రం ఇయ్యం.. ఇట్​ఈజ్​ఏ అవర్​డెసిషన్.. గవర్నమెంట్ ​డెసిషన్​.. పొద్దున లేస్తే మాకు వ్యతిరేక వార్తలు.. మాకు అంటే రాష్ట్రానికి, రాష్ట్ర ప్రగతికి విఘాతం కలిగించే శక్తులకు ఎందుకిస్తం.. పాలు పోసి పామును పెంచలేం కదా..” అని కామెంట్స్​ చేశారు.

మీడియా సంస్థల నిర్ణయం మేరకు జర్నలిస్టులు పని చేస్తారు కదా అని ప్రశ్నించగా.. ‘‘జర్నలిస్టులకు కూడా ఉండాలి కదా ఐడియా.. కీలుబొమ్మలాగ ఉన్నోడు జర్నలిస్టు ఐతడా.. సోయి ఉండాలే కదా.. ఆమాత్రం జ్ఞానం విజ్ఞానం ఉండాలే కదా.. ఇండియాలో మాతో పోల్చుకోవడానికి కూడా భయపడే రాష్ట్రాలున్నయ్​. అలాంటిది ఇక్కడ జీతాలు పడుతలేవని రాస్తరా? ఒక్కటే దెబ్బలో మొన్న 20 వేల కోట్లు రుణమాఫీ చేసినం ..

ఆ పేపర్​తలకాయ ఎక్కడ పెట్టుకోవాలె.. అదో పేపరా.. దానికో వ్యాల్యూ ఉందా.. ఏమనుకోవాలే.. అర్థముండాలె.. ద బెస్ట్​ స్టేట్​ఇన్​ఇండియా, ద బెస్ట్ ​గ్రోత్ ​ఇన్ ​ఇండియా అని ఆర్బీఐ రిపోర్టు ఇచ్చింది.. నీతి ఆయోగ్ ​రిపోర్టు ఇచ్చింది.. పార్లమెంట్​లో కేంద్ర మంత్రులు లిఖిత పూర్వక సమాధానమిచ్చిన్రు... అయినా కూడా మేం ఒకటే రొడ్డ కొట్టుడు కొడుతం.. మా ఇష్టం ఉన్నట్టు రాస్తమంటే అదేం పేపర్​.. దిక్కు మాలిన పేపర్​.. జర్నలిజం ఇదా.. నేను గతంలనే చెప్పిన, ఉద్యమం జరిగినప్పుడే చెప్పిన.. కొన్ని కుల పత్రికలున్నయ్​.. కొన్ని గుల పత్రికలున్నయ్​.. న్యూస్​పేపర్లు, చానళ్లు ఉంటే పర్లేదు.. వ్యూస్​పేపర్లు, వ్యూస్​ చానెళ్లు ఉంటే ఎట్లా..” అని కేసీఆర్​ వ్యాఖ్యానించారు.

లెఫ్ట్​ పార్టీలతో  ఇంకా పొత్తేంటి?

బీఆర్ఎస్​ఎమ్మెల్యే అభ్యర్థులనే ప్రకటించామని.. ఇంకా లెఫ్ట్​పార్టీలతో పొత్తేంటని కేసీఆర్​ ప్రశ్నించారు. ‘‘ఎమ్మెల్యే ఎన్నికలో ఎలాగో గెలుస్తం. 17 పార్లమెంటు స్థానాలు గెలవడమే లక్ష్యం. బీఆర్ఎస్​, మజ్లిస్​ పార్టీలు 2014 నుంచి స్నేహ భావంతో ఉంటున్నయ్​. కలిసే పోటీ చేస్తం. హైదరాబాద్​, రంగారెడ్డి జిల్లాల్లో 29కి 29 అసెంబ్లీ సీట్లు క్లీన్​స్వీప్​ చేస్తం. కాంగ్రెస్, బీజేపీ అవినీతి ఆరోపణలు చేస్తే.. దెయ్యాలు వేదం వల్లించినట్లు ఉంది. ఇప్పుడు ప్రకటించిన అభ్యర్థులను తెలంగాణ ప్రజలు గెలిపించాలి” అని అన్నారు.  ప్రకాశ్ ​జవదేకర్​కు కాళేశ్వరం తలతోక తెలవదని, ఆయన మాటలపై స్పందించాల్సిన అవసరం లేదని కేసీఆర్​ దుయ్యబట్టారు.