పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వచ్చే యువతకు రుణాలు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వచ్చే యువతకు రుణాలు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని ఎండపల్లిలో ఇండస్ట్రియల్ పార్క్ పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. ఈ  సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడారు. రాష్ట్రంలోని యువత పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వస్తే రుణాలు ఇప్పిస్తాని.. అందుకు తగ్గ వసతులు కల్పిస్తామన్నారు.  స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రతి ఏడాది 20వేల కోట్ల వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఈ డబ్బులు ఎక్కడ పెట్టుబడి పెట్టాలనే ఆలోచన వారికి ఉండదని.. అందుకే ప్రభుత్వమే పరిశ్రమలు, వ్యాపారానికి సంబంధించిన ప్రాజెక్టు రిపోర్టు, బ్యాంకు రుణాలు, మార్కెటింగ్ వసతులు కల్పించి పారిశ్రామిక రంగంలో వారిని ప్రోత్సహిస్తామని తెలిపారు. ఇలాంటి బృహత్తర కార్యక్రమానికి మధిర నియోజకవర్గంలో పునాది పడిందన్నారు.

ఎప్పుడూ వ్యవసాయం అని ఒకే రంగంపై  ఆధారపడితే క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఇబ్బందులు పడతామని... వ్యవసాయంతో పాటు పరిశ్రమలు, సేవా రంగాలను అభివృద్ధి చేసుకొని సమగ్ర అభివృద్ధి సాధిస్తే సమాజానికి మేలు జరుగుతుందన్నారు.  గ్రామాల్లో బాగా చదువుకున్న వారు ఉన్నారని.. అందరికీ ఉద్యోగాలు రావని..  గ్రామాల్లో ఉన్నవారు పరిశ్రమల వైపు మళ్ళితే ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఇదే దేశ భవిష్యత్తుకు మంచిదని తెలిపారు. 

గ్రామాల్లో వ్యాపారం చేసేవారు సమాజంలో మారిన పరిస్థితులకు అనుగుణంగా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. గ్రామాల్లో వ్యాపారం చేసేవారు మరింత ముందుకు వెళ్లేందుకు బ్యాంకుల నుంచి సకాలంలో రుణాలు ఇప్పించి వ్యాపారులను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. మధిరలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయడం దశాబ్దాల కల అన్నారు. 55 ఎకరాల్లో నిర్మించనున్న ఇండస్ట్రియల్ పార్కుకు 44 కోట్ల నిధులు కేటాయించామని తెలిపారు.  మధిర ఇండస్ట్రియల్ పార్కు పనులకు వెంటనే టెండర్లు పిలిచి వేగంగా పనులు ప్రారంభిస్తామని తెలిపారు. నిరుద్యోగ యువత పరిశ్రమల వైపు వచ్చేందుకు విస్తృతంగా ప్రచారం కల్పించాలని అధికారులను ఆదేశించారు. మధిర ఇండస్ట్రియల్ పార్కును అనుసంధానించేందుకు రెండు వైపులా రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేశామన్నారు. 

మధిరలో శంకుస్థాపన చేసుకున్న ఇండస్ట్రియల్ పార్క్ రాష్ట్రానికి రోల్ మోడల్ గా ఉండాలని ఆకాంక్షించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి యువత ఈ పారిశ్రామిక ప్రాంతాన్ని సందర్శించేలా తీర్చిదిద్దాలని ఆశాభావం వ్యక్తం చేశారు.  ఇండస్ట్రియల్ పార్కులో తక్కువ ధరలకే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఫ్లాట్లు కేటాయిస్తామని.. ప్లాట్ల కేటాయింపులో  ఎస్సీ, ఎస్టీ, బీసీలతోపాటు మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. 

సమాజంలో ఉన్న అన్ని వర్గాలను ప్రోత్సహించాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి మధిర సమీపంలో ఉందని.. విజయవాడ-నాగపూర్, దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవేలు మధిర నియోజకవర్గం మీదుగా వెళుతున్నాయని.. ఇవి అభివృద్ధికి మూల స్తంభాలుగా పనిచేస్తాయని తెలిపారు.  మధిర పట్టణం విస్తరణకు కావలసిన బైపాస్ రోడ్లు నిర్మిస్తామని..  చదువుల కోసం, ఉపాధి కోసం మధుర నుంచి ఖమ్మం, హైదరాబాద్, అమెరికాలో స్థిరపడుతున్నారు ఇక్కడ సమగ్ర అభివృద్ధిని అందిస్తే వారంతా ఇక్కడే స్థిరపడతారని పేర్కొన్నారు. ఇండస్ట్రియల్ పార్క్ వద్ద ప్రత్యేకంగా ఒక ఉద్యోగిని నియమించి పరిశ్రమలు స్థాపించేందుకు వచ్చే వారి నుంచి దరఖాస్తులు తీసుకోవడం.. సమాచారం అందించడం వంటి బాధ్యతలు అప్పగిస్తామన్నారు.