రూ. కోటి పరిహారం ఇవ్వకుంటే సమ్మెకు దిగుతాం

రూ. కోటి పరిహారం ఇవ్వకుంటే సమ్మెకు దిగుతాం
  • ఎక్స్‌గ్రేషియా కోసం సీఎం వద్దకు
  • స్పందించకుంటే సమ్మె చేయాలని కార్మిక  సంఘాల నిర్ణయం

మందమర్రి, వెలుగు: సింగరేణి బొగ్గు గని ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం చెల్లించాలనే డిమాండ్​తో సీఎం కేసీఆర్​ను కలవాలని కార్మిక సంఘాలు బుధవారం రాత్రి నిర్ణయించాయి. టీబీజీకేఎస్, ఏఐటీయూసీ, బీఎంఎస్, హెచ్ఎంఎస్, సీఐటీయూ, ఐఎన్టీయూసీ, ఇప్టూ, టీఎన్టీయూసీ  సంఘాల లీడర్లు సమావేశమై చర్చించారు. టీబీజీకేఎస్​నాయకత్వంలో ప్రజాప్రతినిధుల ద్వారా సీఎంను కలవాలని, ఆయన నుంచి సానుకూల స్పందన రాకుంటే సమ్మె చేయాలని సంఘాలన్నీ నిర్ణయించాయి. ఈ నెల 17న సింగరేణి యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇవ్వాలని తీర్మానం చేశారు.

సింగరేణిలో బుధవారం ఘోరం జరిగింది. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్​ఏరియాలోని ఎస్సార్పీ 3 బొగ్గు గనిలో పై కప్పు కూలి నలుగురు కార్మికులు చనిపోయారు. గనిలో సీమ్ జంక్షన్​ నుంచి 15 మీటర్ల దూరంలోని వర్క్ ప్లేస్ దగ్గర భారీ పై కప్పు (బొగ్గు బండ) బుధవారం ఒక్కసారిగా కూలింది. దాంతో టింబర్ ​మెన్ ​బేర లచ్చయ్య(61), వి.కృష్ణారెడ్డి(58), బదిలీ వర్కర్లు గడ్డం సత్యనర్సింహరాజు(32), రెంక చంద్రశేఖర్​(32)  అక్కడికక్కడే మరణించారు. పై కప్పు వారం రోజుల నుంచే ప్రమాదకరంగా మారిందని చెబుతున్నారు. దాన్ని సరి చేసేందుకు ఉదయం షిఫ్టులో నలుగురు కార్మికులు లోపలికి వెళ్లారు. పై కప్పు కూలకుండా రోప్, దాట్లు, ఐరన్​ మెష్​ బిగించే పనులు చేపట్టారు. వారు డ్యూటీకెక్కిన మూడు గంటల్లోనే ప్రమాదం జరిగింది.