వచ్చే ఏడేండ్లలో రాష్ట్రానికి 23 లక్షల కోట్ల ఆదాయం: కేసీఆర్

 వచ్చే ఏడేండ్లలో రాష్ట్రానికి 23 లక్షల కోట్ల ఆదాయం: కేసీఆర్
  • సంపద పెంచుతం..అందరికీ పంచుతం
  • దళితులకు ఇచ్చే రూ.1.70 లక్షల కోట్లు.. 
  • 10 లక్షల కోట్లు సంపాదిస్తయ్​
  • దళిత బంధు లెక్కనే అన్ని కులాలకు స్కీం
  • ఏటా 2 లక్షల దళిత ఫ్యామిలీలకు ఇస్తం.. అది పూర్తయిన తర్వాత గిరిజన, బీసీ, ఈబీసీ బంధు కూడా వస్తది
  • దళితులకంటే గిరిజనుల దగ్గర్నే ఎక్కువ భూమి ఉంది
  • టీఆర్​ఎస్​లో చేరిన మోత్కుపల్లి నర్సింహులు
  • అమరుల కుటుంబాలకు న్యాయం చేయాలని నినాదాలు
  • వేదికపై ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. రమణకు  దక్కని చోటు
  • టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసి కొన్ని నెలల కింద టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరిన ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. రమణకు వేదికపై చోటు దక్కలేదు. టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేతలతో కలిసి ఆయన వేదిక పక్కన సమావేశం ముగిసే దాకా నిల్చున్నారు. 

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్ర సంపద పెంచి, పేదలందరికీ పంచుతామని సీఎం కేసీఆర్‌ అన్నారు. రాబోయే ఏడేండ్లలో రాష్ట్ర ఖజానాకు రూ. 23 లక్షల కోట్ల ఆదాయం  వస్తుందన్నారు. దళితుల కోసం చేద్దామనే నియ్యతి ఉంటే రూ. 1.70 లక్షల కోట్లు ఖర్చు పెట్టడం ఓ లెక్కనా అని ప్రశ్నించారు. ప్రతి నియోజకవర్గంలోని వంద దళిత కుటుంబాలకు ఈ ఏడాది దళిత బంధు సాయం అందజేస్తామన్నారు. తర్వాత వెసులుబాటును బట్టి ఏటా రెండు, మూడు లక్షల కుటుంబాలకు సాయం అంద జేస్తామని చెప్పారు. దళిత బంధు పూర్తి స్థాయిలో అందిన తర్వాత గిరిజన బంధు, బీసీ బంధు, ఈబీసీ బంధు అన్నీ వస్తాయన్నారు. సోమవారం మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. 
ఈ సందర్భంగా కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ, ‘‘దళితుల కోసం రూ. 1.70 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలంటే దమ్ము, ధైర్యం కావాలె.. వచ్చే టర్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ మేమే గెలుస్తం. డౌట్లు వద్దు.. ప్రతి దళిత కుటుంబానికి సాయం చేసి తీరుతం. దళితులకు ఇచ్చే రూ.1.70 లక్షల కోట్లు రూ. 10 లక్షల కోట్లు సంపాదిస్తది.. దీన్ని స్పిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎకానమీ అంటరు. డబ్బు ఉంటే మనోళ్లు ఆగుతరా.. ఒక్క అంగి కొనేటోడు రెండు అంగీలు కొంటడు.. ఇట్లా ఈ డబ్బంతా మార్కెట్లకే వస్తది” అని చెప్పారు. హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పైలెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టుగా తీసుకొని అక్కడ దళిత కుటుంబాలకు దళిత బంధు సాయం చేస్తున్నామని తెలిపారు. వాసాలమర్రిలో అందరికీ ఇచ్చామన్నారు. తుంగతుర్తి సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌లోని తిరుమలగిరికి  డబ్బులు రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నామని చెప్పారు. 
దళిత బ్రిగేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూపొందిస్తం..
తెలంగాణ వచ్చిన నాడు విపత్కర పరిస్థితి ఉండేదని, మంచినీళ్ల బాధలు.. ఎవుసం నీళ్ల బాధలు.. రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఉండేవని కేసీఆర్​ అన్నారు. ‘‘ప్రతీప శక్తులు ఉంటయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఆగం కావొద్దు. వందశాతం మనం విజయం సాధిస్తం.. బాపనోళ్లు, రెడ్లు, వెలమలు ఇట్ల పేదలందరికీ సాయం చేస్తం.. గది బంగారు తెలంగాణ అంటే.. ఇట్లా జరుగుతది.. ఇది సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయితే దేశానికే ఒక తొవ్వ చూపినోళ్లమైతం’’ అని కేసీఆర్​ అన్నారు.  ‘‘యాదవులకు గొర్రెలు ఇస్తున్నప్పుడు తమకూ ఏదన్న చేయాలని కోరారు తప్ప దళితులు అడ్డం పడలేదు.. పిచ్చిపిచ్చి ఏశాలు ఎయ్యలేదు. రాష్ట్రంలో దళిత కులమే అతి పెద్దది.  75 లక్షల జనాభా ఉన్న దళితుల దగ్గర 13 లక్షల ఎకరాల భూమి మాత్రమే ఉన్నది. 9 శాతం జనాభా ఉన్న గిరిజనుల దగ్గర 22 లక్షల ఎకరాల భూమి ఉన్నది. దళితుల కోసం అంబేద్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంతో తండ్లాడిన్రు. తెలంగాణ రాష్ట్రం తేవడం ఎంతటి యజ్ఞమో.. దళితబంధు సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడం అంతటి యజ్ఞమే” అని కేసీఆర్​ చెప్పారు. ఆరునూరైనా దళిత బంధు స్కీంను ముందుకు తీసుకెళ్తామన్నారు. రెండు, మూడేండ్లు ఆగితే అంతా బాగు చేసుకుంటామని చెప్పారు. ‘‘బంతిల కూసున్నోళ్లకు అందరికీ అందుతది.. ఒక వైపు నుంచి మొదలు పెడితే ఇంకో వైపు చేరే సరికి ఆలస్యమైతది.. ఓట్ల కోసమే చేస్తున్నం అంటరు.. మంచిపని చేసినా ఓట్ల కోసమేనా.. దళిత సమాజం ఉద్ధరణ కోసం ఈ పథకం తెస్తున్నం.. రాజకీయాలతో పనిలేకుండా అందరికీ ఇస్తం.. తరతరాల దోపిడీకి గురైన వారిని ఆదుకోవడం సామాజిక బాధ్యతగా గుర్తించి ప్రారంభిస్తున్నం.. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో దళితబంధు కమిటీలుంటయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. దీనితో దళిత బ్రిగేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూపొందిస్తం.. దళిత రక్షణనిధి లెక్కనే బీసీ, గిరిజన రక్షణ నిధి కూడా వస్తది..’’ అని సీఎం వివరించారు. ‘‘గొర్రెలు దిగుమతి చేసుకునుడు కాదు ఎగుమతి చేసే స్థాయికి రాష్ట్రం ఎదగాలని రూ. 11 వేల కోట్లతో గొర్రెలు పంపిణీ చేసినం. ఇప్పుడు వాటిని ‘కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గొర్రెలు’ అంటున్నరు. గీత కార్మికుల కోసం కల్లు డిపోలు ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసినం” అని పేర్కొన్నారు. 
రాజకీయాలు లంగ కథ
రాజకీయాల్లో ఒకసారి ఓడుతామని, ఒకసారి గెలుస్తామని, ప్రజలకు ఏం చేసినమనేదే గుర్తుంటుందని కేసీఆర్​ అన్నారు. ‘‘రాజకీయాలు లంగకథ.. ఏడిసెటోడు.. తుడిసెటోడు ఉంటడు. తెలంగాణ తెచ్చినంక నేను పక్కకు జరుగుతనని చెప్పిన.. అందరూ వద్దన్నరు.. అందుకే బాధ్యత ఎత్తుకున్న.. ఇంతదాకా తెచ్చిన. రాజకీయాలు మిగతా పార్టీలకు ఒక గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇది ఒక యజ్ఞం.. పట్టుబట్టి పనిచేయాలే.. ఏం చేసినమో చదువుతా పోతే చాంతాడంత లిస్టు అయితది’’ అని పేర్కొన్నారు.
నర్సింహులు మంచి మిత్రుడు
మోత్కుపల్లి నర్సింహులు తనకు అత్యంత సన్నిహిత మిత్రుడని కేసీఆర్​ అన్నారు. ఆయన విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మంత్రిగా ఉన్నప్పుడు లారీల కొద్ది ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫార్మర్లు కాలిపోయేవని, ఆయన ముందు మంత్రి అయ్యారని, తర్వాత తాను మంత్రి అయ్యానని చెప్పారు. రాజకీయాలు మోత్కుపల్లికి, తనకు కొత్త కాదన్నారు. యాదాద్రి నర్సింహస్వామి పేరు.. మన నర్సన్న పేరు ఒక్కటేనని కేసీఆర్​  పేర్కొన్నారు.  ఆయన సేవలను రాష్ట్ర స్థాయిలో వినియోగించుకుంటామని చెప్పారు. ఆలేరు, భువనగిరిలో మంచి ఎమ్మెల్యేలున్నారని, మంచి ఎంపీ కూడా ఉంటే మీరు ఓడించారని బూర నర్సయ్యను ఉద్దేశించి ఆయన అన్నారు. సమావేశంలో మంత్రులు మహమూద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అలీ, జగదీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి, శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎంపీ లింగయ్య యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.
అమరుల కుటుంబాలను ఆదుకోవాలని నినాదాలు
సూర్యాపేట జిల్లాకు చెందిన యువకుడు అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయాలని, ఆదుకోవాలని సభ వేదిక వద్ద నినాదాలు చేశారు. సభ ముగిసిన తర్వాత సీఎం ఆ యువకుడ్ని పిలిపించి మాట్లాడారు. సమస్య పరిష్కరించే బాధ్యత మంత్రి జగదీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డికి అప్పగించారు. ప్రభుత్వ పథకాలు లీడర్ల దగ్గరి వాళ్లకే ఇస్తున్నారని మరికొందరు నినాదాలు చేశారు.