కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం: మంత్రి వివేక్

 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం: మంత్రి వివేక్

సంగారెడ్డి: మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలు తీసుకొస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జ్ హోదాలో బుధవారం (జూలై 16) సంగారెడ్డిలో పర్యటించిన మంత్రి వివేక్.. ఇందిరా మహిళా శక్తి సంబరాలు వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని, మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఇందిరమ్మ ప్రభుత్వం మంచి అవకాశమన్నారు.

మహిళలు వ్యాపారాలపై ఫోకస్ చేయాలని సూచించారు. కాంగ్రెస్ ఇందిరమ్మ ప్రభుత్వంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని హామీ ఇచ్చారు. మహిళలను ప్రోత్సహించడంలో భాగంగా మహిళలకే ఎలక్ట్రిక్ బస్సులు కేటాయిస్తామన్నారు. మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్ర ఖజానాని ఖాళీ చేశారని.. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో భారీగా అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. 

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ అనేక హామీలు ఇచ్చారు. రైతులు, మహిళలను కోటీశ్వరులు చేస్తానని చెప్పారు. కానీ ఏ ఒక్క హామీ నేరవేర్చలేదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబ సభ్యులు మాత్రం వందల కోట్ల రూపాయలు సంపాదించి కోటీశ్వరులు అయ్యారని ఎద్దేవా చేశారు. 

ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా ప్రతి పేదవాడు సన్నబియ్యం తినాలనే సంకల్పంతో రేషన్ ద్వారా సన్నబియ్యం అందిస్తున్నామని చెప్పారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం ప్రభుత్వానికి ఆర్థికంగా భారం అయితున్నా.. మహిళలు ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఆపకుండా వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నామని తెలిపారు. కార్మికులకి కనీస వేతనం ఇచ్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. 

ఇదే కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తామని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలను పట్టించుకోలేదని.. కానీ గ్రామీణ మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యమన్నారు. దేశంలో పేదరిక నిర్ములన కోసం ఇందిరాగాంధీ ఎంతో కృషి చేశారని కొనియాడారు. దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి మహిళలు కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు.