జీతాలు పెంచకుంటే సమ్మె చేస్తం

జీతాలు పెంచకుంటే సమ్మె చేస్తం

బల్దియా ఔట్​సోర్సింగ్ డ్రైవర్ల ఆందోళన

హైదరాబాద్,వెలుగు: వేతనాలు పెంచాలని గురువారం బల్దియా హెడ్​ఆఫీసు ముందు జీహెచ్​ఎంసీ ఔట్​సోర్సింగ్ ​ట్రాన్స్ పోర్ట్​కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో డ్రైవర్లు ఆందోళన చేశారు. వేతనాల పెంపుపై కమిషనర్​ని కలిసేందుకు వస్తే అపాయింట్​మెంట్ కూడా ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. అధికారులు, చెత్తను తరలించే వాహనాలను నడిపే తమను ఎందుకు పట్టించుకోవడంలేదోనని ఆగ్రహం వ్యక్తం చేశారు. శానిటేషన్​ కార్మికులకు వేతనాలు పెంచి, తమను వదిలేశారని వాపోయారు. ఐదేళ్లలో వారికి మూడుసార్లు వేతనాలు పెంచితే తమకు ఒక్కసారి కూడా పెంచలేదన్నారు. ప్రస్తుతం వర్కర్ల కంటే డ్రైవర్లకు జీతాలు తక్కువగా ఉన్నాయన్నారు. ఏళ్లుగా పనిచేస్తున్న తమకు రూ.13వేలు మాత్రమే చేతికి అందుతున్నాయన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ముందుండి పోరాడిన తమకు ప్రభుత్వం అన్యాయం చేస్తుందన్నారు. ట్రాన్స్​పోర్ట్​ విభాగంలో పనిచేస్తున్న 3 వేల మంది కార్మికులకు కూడా వేతనాలు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్​  చేశారు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. జీతాలు పెంచకపోతే త్వరలో సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.

బల్దియా కార్మికులను పట్టించుకుంటలేరు

బీజేపీ మజ్దూర్ మోర్చా హైదరాబాద్ చైర్మన్ గోపాల్

జీహెచ్ఎంసీ కార్మికులను అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీజేపీ మజ్దూర్ మోర్చా హైదరాబాద్ చైర్మన్ ఉదరి గోపాల్ అన్నారు. ‘జీహెచ్​ఎంసీ కార్మికుల శ్రమదోపిడీ’ అనే పాంప్లెంట్ ను గురువారం ఆయన రిలీజ్ చేశారు. గోపాల్​ మాట్లాడుతూ.. జీహెచ్​ఎంసీకి ఆదాయాన్ని తీసుకొచ్చేది ఉద్యోగులేనన్నారు. కోటి జనాభా ఉన్న నగరంలో కనీసం లక్షమంది బల్దియా ఉద్యోగులు ఉండాలని, కానీ 33వేల మంది మాత్రమే పని చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా అధికారులు,పాలకులు కార్మికులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

For More News..

సింగరేణిపై గ్రేటర్ ఎలక్షన్ ఎఫెక్ట్

డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మరింత దూరం

మేడిగడ్డ బ్యారేజీ పై ఇంటర్​స్టేట్​ రాస్తా బంద్​.. పెరిగిన 50 కి.మీ. దూరం