జర్మనీ, జపాన్లను దాటేస్తాం.. నీతి ఆయోగ్​ సీఈఓ సుబ్రమణ్యం

జర్మనీ, జపాన్లను దాటేస్తాం.. నీతి ఆయోగ్​ సీఈఓ సుబ్రమణ్యం

న్యూఢిల్లీ:  భారత ఆర్థిక వ్యవస్థ రాబోయే 3 సంవత్సరాలలో జర్మనీ,  జపాన్‌‌‌‌లను దాటేస్తుందని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ ​సుబ్రమణ్యం అన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్, వచ్చే ఏడాదికి నాలుగో స్థానానికి,  ఆ తర్వాత సంవత్సరం మూడో స్థానానికి చేరుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తాజా ఐఎంఎఫ్ డేటా ప్రకారం, ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ 4.3 ట్రిలియన్ డాలర్ల వద్ద ఉంది.  

రాబోయే మూడు సంవత్సరాలలో భారత్ జర్మనీ,  జపాన్‌‌‌‌ల ఆర్థిక వ్యవస్థలను దాటేస్తుందని, 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే రెండవ అతిపెద్దదిగా (30 ట్రిలియన్ డాలర్లు) అవతరించే అవకాశం ఉందని సుబ్రమణ్యం వివరించారు. భారతీయ కంపెనీలు, న్యాయ సంస్థలు,  అకౌంటింగ్ సంస్థలు కూడా ప్రపంచ నాయకులుగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. మధ్య ఆదాయ దేశాలు ఎదుర్కొనే సమస్యలు తక్కువ ఆదాయ దేశాల సమస్యల కంటే చాలా భిన్నంగా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.