- ప్రతి విద్యుత్ ఉత్పత్తి కేంద్రంపై ఏకకాలంలో దాడులు చేస్తం..
- ఆ దేశాన్ని అంధకారంలోకి నెట్టేస్తం
- ‘ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ’ సక్సెస్.. ఇరాన్ కీలక నాయకత్వం ఖతం
- ఆ దేశ నౌకాదళం, ఎయిర్‌ఫోర్స్ తుడిచిపెట్టుకుపోయాయి..
- ‘ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్’ ద్వారా అణు కేంద్రాలు నేలమట్టం
- మా లక్ష్యం నెరవేరగానే యుద్ధాన్ని ముగిస్తామని కామెంట్
- నీకు మా గురించి తెలియదంటూ ట్రంప్‌కు ఇరాన్ కౌంటర్
- అమెరికా అవమాన భారంతో తలదించుకొని లొంగిపోయే వరకు ఈ పోరాటం ఆగదని వార్నింగ్
- ఇరాన్లో అతిపెద్ద బ్రిడ్జిని పేల్చేసిన అమెరికా
వాషింగ్టన్:
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు, ఇరాన్ ప్రతిసవాళ్లతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింతగా కమ్ముకున్నాయి. ఇరాన్‌పై రాబోయే రోజుల్లో భీకరంగా దాడిచేస్తామని ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వగా.. అమెరికా మెడలు వంచేదాకా తమ పోరాటం ఆగబోదని ఇరాన్ సైన్యం ధీటైన సమాధానం ఇచ్చింది. దీంతో ఈ ఘర్షణ ఎటు దారితీస్తుందోనని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. వైట్‌హౌస్ నుంచి జాతిని ఉద్దేశించి ట్రంప్ ప్రసంగిస్తూ.. ఇరాన్‌పై అమెరికా–--ఇజ్రాయెల్ సంయుక్తంగా జరుపుతున్న యుద్ధంలో తాము విజయం సాధించామని ప్రకటించారు.
వచ్చే రెండు నుంచి మూడు వారాల పాటు ఇరాన్‌పై దాడులు మరింత తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇరాన్ త్వరగా తమతో ఒప్పందానికి రావాలని, లేకుంటే మరింత భీకరంగా అటాక్స్ చేస్తామన్నారు. ఆ దేశాన్ని రాతియుగానికి తీసుకెళ్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ సైనిక శక్తిని నామరూపాలు లేకుండా చేశామని, త్వరలోనే ఈ యుద్ధాన్ని ముగిస్తామని అన్నారు. ‘‘మేం వారిని తిరిగి శిలా యుగంలోకి తీసుకెళ్తాం. వారు ఉండాల్సింది అక్కడే. ఒకవేళ ఇరాన్ చర్చలకు రాకపోతే.. ఆ దేశంలోని ప్రతి విద్యుత్ ఉత్పత్తి కేంద్రంపై దాడులు చేసి, దేశాన్ని అంధకారంలోకి నెట్టేస్తాం” అని హెచ్చరించారు.
- అణుకేంద్రాలను ధ్వంసం చేసినం..
‘ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్’ ద్వారా ఇప్పటికే ఇరాన్ అణు కేంద్రాలను బాంబులతో నేలమట్టం చేసిందని ట్రంప్ గుర్తు చేశారు. అమెరికా, ప్రపంచ భద్రత కోసమే ఈ యుద్ధం అవసరమైందని, అరాచక పాలన చేసేవారి చేతుల్లో అణ్వాయుధాలు ఉండకూడదని అన్నారు. ప్రపంచ చమురు ధరల పెరుగుదలకు ఇరాన్ జరిపిన ఉగ్ర దాడులే కారణమని ఆరోపించారు. హార్మూజ్ ను సురక్షితంగా ఉంచే బాధ్యతను ఆ ప్రాంత చమురుపై ఆధారపడే ఇతర దేశాలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు అని, ఎలాంటి ఒడిదుడుకులనైనా తట్టుకోగలమని ధీమా వ్యక్తం చేశారు.
- అమెరికా సరెండర్ అయ్యేదాకా వెనక్కి తగ్గం: ఇరాన్
ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ సైన్యం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ‘‘నీకు మా గురించి ఏమీ తెలియదు.. యుద్ధ క్షేత్రంలో అమెరికా అవమాన భారంతో తలదించుకొని, లొంగిపోయే వరకు ఈ పోరాటం ఆగదు”అని వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ సైన్యం, ఐఆర్‌జీసీ కార్యకలాపాలను పర్యవేక్షించే అత్యున్నత విభాగం ‘ఖాతిమ్ అల్-అన్బియా’ సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ ఈ మేరకు ఘాటైన ప్రకటనను విడుదల చేసింది. ట్రంప్ ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే ఇరాన్ ప్రతినిధి ఇబ్రహీం జోల్ఫాగరీ సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. ‘‘మా సైనిక శక్తి, సామర్థ్యాలపై మీకున్న సమాచారం అరకొర మాత్రమే. మా వ్యూహాత్మక రహస్యాల గురించి నీకేమీ తెలియదు” అని ట్రంప్‌ను ఎద్దేవా చేశారు.
- క్షిపణి కేంద్రాలు భద్రం
ఇరాన్ క్షిపణి తయారీ కేంద్రాలను అమెరికా దళాలు ధ్వంసం చేశాయన్నది పచ్చి అబద్ధమని జోల్ఫాగరీ కొట్టిపారేశారు. కీలకమైన లాంగ్ రేంజ్ డ్రోన్లు, క్షిపణి ఉత్పత్తి కేంద్రాలు, ఆధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇంకా భద్రంగా ఉన్నాయని, అవి నిరంతరాయంగా పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు. కాగా, 250 ఏండ్ల చరిత్ర కలిగిన దేశం, 6 వేల ఏండ్ల సుదీర్ఘ నాగరికత కలిగిన దేశాన్ని బెదిరించడం కేవలం అమెరికా ‘హాలీవుడ్ భ్రమ’ మాత్రమేనని ఐఆర్‌జీసీ ఏరోస్పేస్ ఫోర్స్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ సయ్యద్ మాజిద్ మూసవి ఎద్దేవా చేశారు. ఇరాన్‌ను రాతియుగంలోకి పంపడం పక్కన పెడితే, అమెరికా తన సైనికులను స్వయంగా సమాధుల్లోకి పంపుతున్నదని ‘ఎక్స్’ వేదికగా ఎద్దేవా చేశారు.
- ఇరాన్లో సాధించాల్సింది ఇంకేముంది?: అల్బనీస్
ఇరాన్‌పై యుద్ధంలో ప్రాథమిక లక్ష్యాలు ఇప్పటికే నెరవేరాయని, అక్కడ సాధించాల్సింది ఇంకేముందో స్పష్టత లేదని ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథొనీ అల్బనీస్ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా, -ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్ వైమానిక దళం, నావికా దళం, సైనిక పారిశ్రామిక కేంద్రాలు ఇప్పటికే దెబ్బతిన్నాయని, అసలు లక్ష్యాలు సాకారమయ్యాయని తెలిపారు. యుద్ధం కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు.
- భారతీయ మిత్రులు సేఫ్
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నా హార్మూజ్ గుండా రాకపోకలపై భారత్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇరాన్ పేర్కొంది. “మన భారతీయ మిత్రులు సేఫ్ హ్యాండ్స్ లో ఉన్నారు. ఆందోళన అవసరం లేదు” అని ఇండియాలోని ఇరాన్ ఎంబసీ వెల్లడించింది. హార్మూజ్ నుంచి పరిమితంగానే నౌకలను అనుమతిస్తున్నామని, కానీ భారత్, చైనా, రష్యా, ఇరాక్, పాకిస్తాన్ లాంటి తమ మిత్ర దేశాల నౌకల రాకపోకలకు మాత్రం అనుమతులు ఇస్తున్నట్టు వెల్లడించింది.
- యుద్ధంతో అమెరికా ప్రజలకు ఒరిగిందేమిటి?: పెజెష్కియాన్
పశ్చిమాసియాలో కొనసాగుతున్న భీకర పోరు నేపథ్యంలో అమెరికా ప్రజలనుద్దేశించి ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఒక సంచలన బహిరంగ లేఖ రాశారు. ఈ యుద్ధం నిజంగా అమెరికా ప్రయోజనాల కోసమేనా? అని ఆయన ప్రశ్నించారు. ఈ పోరాటం వల్ల అమెరికా పౌరులకు దక్కేదేమీ లేదని, కేవలం ఇజ్రాయెల్ ప్రయోజనాల కోసమే ఈ యుద్ధంలోకి దిగిందని ఆరోపించారు. ‘‘ఇరాన్ ఇంధన, పారిశ్రామిక మౌలిక సదుపాయాలపై అమెరికా–-ఇజ్రాయెల్ దాడులు చేయడం అంటే నేరుగా ఇరాన్ ప్రజలను దెబ్బతీయడమే. ఇది ముమ్మాటికీ యుద్ధ నేరం” అని మండిపడ్డారు. ఈ యుద్ధం వల్ల అస్థిరత పెరగడమే తప్ప, అమెరికా ప్రజలకు ఎలాంటి మేలు జరగదని స్పష్టం చేశారు. ‘‘ఇజ్రాయెల్ చేతిలో అమెరికా ప్రభుత్వం కీలుబొమ్మగా మారిందా? ఇజ్రాయెల్ కోసం అమెరికా యుద్ధ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నదా?”అని ఆయన నిలదీశారు. ఇరాన్ నుంచి ఎలాంటి ముప్పు లేకపోయినా అమెరికా యుద్ధానికి దిగిందని పేర్కొన్నారు.
- ఇరాన్ లో అతిపెద్ద బ్రిడ్జి పేల్చివేత..
ఇరాన్ లోని కరాజ్ సిటీలో నిర్మాణంలో ఉన్న అతిపెద్ద బ్రిడ్జిని గురువారం అమెరికా పేల్చివేసింది. బ్రిడ్జి కూలిపోతున్న వీడియోను ట్రంప్ ఈ మేరకు షేర్ చేశారు. ఇలాంటివే మరిన్ని దాడులు ఉంటాయని హెచ్చరించారు. కాగా, ఇరాన్ కూడా గురువారం ఇజ్రాయెల్‌తో పాటు గ ల్ఫ్ దేశాలపై క్షిపణులను ప్రయోగించింది. మరోవైపు ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఇరాన్ మాజీ విదేశాంగ మంత్రి కమల్ ఖరాజీ తీవ్రంగా గాయపడగా, ఆయన భార్య చనిపోయారు.
