
గాజా సిటీ: గాజా సిటీ మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. దౌత్యపరమైన కారణాల వల్ల గాజాలో కరువును నివారించడం అవసరమని తాము గుర్తించినట్లు, ఈ నేపథ్యంలో అక్కడికి ఆహారాన్ని తరలిస్తామని చెప్పారు. ‘‘హమాస్‌పై మా పోరాటం తీవ్ర స్థాయిలో జరుగుతున్నది. ఈ యుద్ధంలో మేం పురోగతి సాధించాం. ఈ ప్రాంతం మొత్తాన్ని మా ఆధీనంలోకి తీసుకుంటాం. ఈ అవకాశాన్ని వదులుకోబోం” అని టెలిగ్రామ్ చానల్‌లో నెతన్యాహు ఓ వీడియో పోస్ట్ చేశారు.
గాజా ప్రజలు ఆకలితో ఉండడాన్ని ఇజ్రాయెల్ ప్రజలు కూడా సహించరని అన్నారు. ఒకవైపు దోహాలో చర్చలు జరుగుతుండగా హమాస్ బహిష్కరణ అంశాన్ని ఇజ్రాయెల్ తెరపైకి తెచ్చింది. బందీలను విడుదల చేయడం, హమాస్ టెర్రరిస్టులను బహిష్కరించడం, ఆయుధాలను అప్పగించడం వంటి డిమాండ్లను ఇజ్రాయెల్ ప్రస్తావించగా, ఇందుకు హమాస్ అంగీకరించలేదని తెలుస్తోంది.