మళ్లీ చెప్తున్నా.. క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే సీరియస్ యాక్షన్: డీజీపీ శివధర్ రెడ్డి

మళ్లీ చెప్తున్నా.. క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే సీరియస్ యాక్షన్: డీజీపీ శివధర్ రెడ్డి

హైదరాబాద్‌: సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న వ్యక్తిత్వ హననం(క్యారెక్టర్ అసాసినేషన్)పై డీజీపీ శివధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గతంలోనే తమ విధానాన్ని వెల్లడించినట్లు గుర్తు చేశారు. డీజీపీగా బాధ్యతలు చేపట్టిన అక్టోబర్ ఒకటో తేదీన జరిగిన విలేకరుల సమావేశంలో.. సోషల్ మీడియా వినియోగంపై మార్గనిర్దేశం చేస్తూ, చట్ట పరిమితులను దాటి వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని  స్పష్టం చేశానని పేర్కొన్నారు.

సోషల్ మీడియా పేరుతో ఎవరైనా వ్యక్తిత్వ హననం చేయడం, ఇతరుల శీలానికి భంగం కలిగించడం, క్యారెక్టర్ అసాసినేషన్‌కు పాల్పడడం వంటి చర్యలకు పాల్పడితే తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తమ విధానంగా తెలియజేశానన్నారు. అలాగే ఇతర వ్యక్తుల గురించి, వారి కుటుంబ సభ్యుల గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేయడం, అసత్య ఆరోపణలు చేయడం, ఫేక్ న్యూస్‌ను సర్కులేట్ చేసి వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకోవడం అనుమతించబోమని మరో మారుస్పష్టం చేశారు.

చట్టానికి లోబడి,   నిర్మాణాత్మక విమర్శలు, అభిప్రాయాలు వ్యక్తం చేసుకోవడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని డిజిపి అన్నారు .అయితే ఆ పరిమితులను దాటి, సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేస్తూ అబద్ధాలు ప్రచారం చేస్తే మాత్రం సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని  హెచ్చరించారు