ఒక్క రోజే 13 లక్షల కోట్ల సంపద మాయం

ఒక్క రోజే 13 లక్షల కోట్ల సంపద మాయం
  • మార్కెట్​ పై  ‘వార్​’
  • గత రెండేళ్లలో ఎన్నడూ లేనంత నష్టం
  • రూ.13.44 లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు
  • సెన్సెక్స్​ 2,702 పాయింట్లు డౌన్​
  • 4.78 శాతం నష్టపోయిన నిఫ్టీ
  • భారీగా పెరిగిన బంగారం, క్రూడ్​ ధరలు
  • తగ్గిన రూపాయి మారకం విలువ 

ముంబై: ఉక్రెయిన్​పై రష్యా యుద్ధం మొదలెట్టడంతో గ్లోబల్​ మార్కెట్లతో పాటే మన మార్కెట్లూ కుదేలయ్యాయి. గత రెండేళ్లలో ఎప్పుడూ లేనంతగా ఒకే రోజు సెన్సెక్స్​, నిఫ్టీలు ఏకంగా 5 శాతం పతనమయ్యాయి.మార్చి 23, 2020 నాడు మన మార్కెట్లు  భారీగా పతనమైన విషయం తెలిసిందే.  వెల్లువెత్తిన అమ్మకాలతో  గురువారం నాడు రూ. 13.44 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరయిపోయింది. ఇంత భారీగా మన స్టాక్​ మార్కెట్​ క్రాష్​ కావడం చరిత్రలో ఇది నాలుగోసారి. బుధవారం రాత్రి యూఎస్​ మార్కెట్లు, గురువారం ఉదయం ఆసియన్​ మార్కెట్లు పడటంతో  ఓపెనింగ్​లోనే భారీగా పడిన సెన్సెక్స్​, నిఫ్టీలు ఆ తర్వాత కొద్దిగా కోలుకున్నా, యూరోపియన్​ మార్కెట్లూ పతనం కావడంతో సాయంత్రానికి భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్​ 2,702.15 పాయింట్లు (4.72 శాతం) తగ్గి 54,529.91 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ కూడా 815.30 పాయింట్లు (4.78 శాతం) పతనమై 16,247.95 పాయింట్ల వద్ద క్లోజైంది. ఒక దశలో సెన్సెక్స్​2850 పాయింట్ల మేర పతనమై, తర్వాత కొద్దిగా కోలుకుంది. రష్యా–ఉక్రెయిన్​ దేశాల మధ్య యుద్ధ వాతావరణంతో వరసగా ఏడు రోజులూ మన స్టాక్​ మార్కెట్లు నష్టాలతోనే క్లోజయ్యాయి.

ఘోరంగా తగ్గిన మార్కెట్​ క్యాప్​ 
బీఎస్​ఈలోని లిస్టెడ్​ కంపెనీల మార్కెట్​ విలువ గురువారం పతనంతో బాగా తగ్గిపోయింది. ఈ మార్కెట్​ విలువ రూ. 13.44 లక్షల కోట్లు తగ్గి రూ. 2,42,24,179.79 కోట్లకు చేరింది. బుధవారం ముగింపులో ఈ మార్కెట్​ విలువ రూ. 2,55,68,668.33 కోట్లు. ఎఫ్ఐఐలు భారీగా అమ్ముతుండటం కూడా మార్కెట్​ సెంటిమెంట్​ను దెబ్బ తీసిందని ట్రేడర్లు చెబుతున్నారు. బుధవారం నాడు రూ. 3,417.16 కోట్ల మేర ఎఫ్​ఐఐలు అమ్మకాలు సాగించారు. మరోవైపు బ్రెంట్​ క్రూడ్​ ఏడేళ్ల గరిష్టానికి చేరడమూ మార్కెట్​ను పడేసింది. ఈ గ్లోబల్​ ఆయిల్​ బెంచ్​ మార్క్​ గురువారం వంద డాలర్ల మార్కును దాటేసింది. గురువారం ట్రేడింగ్​లో బారెల్​  క్రూడ్​ రేటు  104.51 డాలర్లను తాకింది. నిఫ్టీలో ఒక్క షేరు కూడా లాభంతో క్లోజవలేదంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధమవుతుంది. అన్ని రంగాల ఇండెక్స్​లూ నష్టాలతోనే ముగిశాయి. గురువారం రోజు ఎఫ్​అండ్​ఓ (డెరివేటివ్స్​) క్లోజింగ్​ కూడా. చాలా సెక్టార్లు 5 నుంచి 8 శాతం పతనాన్ని చూశాయి. 18,604 పాయింట్ల హైని చూసిన నిఫ్టీ అక్కడి నుంచి 13 శాతం పతనమైంది. రష్యా–ఉక్రెయిన్​ల మధ్య యుద్ధం మరి కొన్ని రోజులు మార్కెట్​పై ఎఫెక్ట్​ చూపిస్తుందనే భయాలు ట్రేడర్లలో కనిపిస్తున్నాయి. మన మార్కెట్లు కూడా మరింత పడతాయనే ఆందోళన వారు వ్యక్తం చేస్తున్నారు. కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఏ దశలోనూ మార్కెట్​ కోలుకోవడానికి ఛాన్స్​ దొరకలేదు. 

రూపాయి పతనం
రష్యా యుద్ధం ప్రకటించడంతో డాలర్​తో  మన రూపాయి విలువా పతనమైంది. గురువారం ట్రేడింగ్​లో 99 పైసలు బలహీనమై రూ. 75.60 వద్ద ముగిసింది. విదేశీ ఫండ్స్​ బయటకు వెళ్తుండటంతోపాటు, దేశీయ స్టాక్​ మార్కెట్లో అమ్మకాలు, క్రూడ్​ రేట్ల పెరుగుదల వంటి అంశాలన్నీ ఫారెక్స్​ మార్కెట్లో ఇన్వెస్టర్​ సెంటిమెంట్​ను దెబ్బ తీసినట్లు ట్రేడర్లు చెప్పారు. రూ. 75.02 వద్ద మొదలయిన రూపాయి, ఒక దశలో రూ. 75.75 కి పడిపోయింది. చివర్లో కొద్దిగా కోలుకుని రూ. 75.60 వద్ద క్లోజయింది. ఆసియా కరెన్సీలలో ఎక్కువగా పతనమైంది మన రూపాయేనని ట్రేడర్లు పేర్కొన్నారు.  ఆసియా స్టాక్‌ మార్కెట్లు మొత్తం 2 నుంచి 3శాతం వరకు నష్టపోయాయి.దాదాపు ఏడేళ్ల తర్వాత బ్యారెల్​ చమురు ధర 100 డాలర్లను దాటింది.  ఉక్రెయిన్‌ సరిహద్దుల వద్ద రష్యా దళాల మోహరింపులు మొదలైన నాటి నుంచి చమురు ధరలు వేగంగా పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయిల్‌ ఎగుమతి దేశాల్లో ఒకటైన రష్యాపై ఇతర దేశాలు మరిన్ని ఆంక్షలు విధిస్తే ఆయిల్‌ ధరలు మరింత పెరుగుతాయని ఎనలిస్టులు చెబుతున్నారు. 

గ్లోబల్​ మార్కెట్ల తరహాలోనే మన మార్కెట్లూ రియాక్టయ్యాయి. యుద్ధ భయంతోపాటు, క్రూడ్​ రేటు కూడా ఈ మహాపతనానికి కారణమయ్యాయి. సెన్సెక్స్​, నిఫ్టీలు 5 శాతం పడ్డాయి. రష్యా మార్కెట్లైతే ఏకంగా 30 శాతం పతనమయ్యాయి. యుద్ధ భయం గత వారం రోజులుగా ఉన్నప్పటికీ, అది మొదలవడం మార్కెట్లను బలమైన దెబ్బతీసింది.
‑ సిద్ధార్థ ఖెమ్కా, హెడ్​ రిసెర్చ్​, మోతీలాల్​ ఓస్వాల్