పాల్వంచలో వెపన్స్, గంజాయి పట్టివేత

పాల్వంచలో వెపన్స్, గంజాయి పట్టివేత
  • ఎక్సైజ్ పోలీసుల అదుపులో ముగ్గురు అంతరాష్ట్ర నిందితులు 
  • ఒకరు పారిపోగా.. రెండు కార్లు స్వాధీనం 

పాల్వంచ,వెలుగు: భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలం జగన్నాథపురం వద్ద ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ గురువారం వాహనాల తనిఖీల్లో భారీగా గంజాయి, మారణాయుధాలను పట్టుకోవడం సంచలనం రేపింది. ఖమ్మం ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జి. జనార్దన్ రెడ్డి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. 

 కేరళలోని ఎర్నాకులం వెలుకొండం నావల్ ఆర్మ్ మెంట్ డిపోకు చెందిన వీఎస్ బిలాల్, తమిళనాడులోని తిరుచ్చి జిల్లా తొరియూర్ కు చెందిన శ్యాంసుందర్,  తి రయూర్, విశ్వంబల్ సముద్రంకు చెందిన కాశీ నందన్ సంతోష్​, తిరుచ్చికి చెందిన జేమ్స్ ముఠాగా ఏర్పడి మారణాయుధాలు, గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారు. 

వీరు ఒడిశా నుంచి 53 లక్షల విలువైన 106 కిలోల గంజాయి, ఒక పిస్తోల్,4 రివాల్వర్లు, 40 బుల్లెట్లు, 12 ఖాళీ మ్యాగజైన్లను తీసుకుని భద్రాచలం, ఖమ్మం మీదుగా  చెన్నై, తిరుచ్చికి తరలిస్తున్నారు. ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ కమిషనర్ హరికిరణ్, డైరెక్టర్ షానవాజ్ ఖాసిం ఆదేశాలతో ఎన్ ఫోర్స మెంట్  అసిస్టెంట్ కమిషనర్లు జి. గణేశ్, ఎస్. రమేష్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టగా నిందితులు పట్టుబడ్డారు. 

వీరిలో జేమ్స్ అనే నిందితుడు పారిపోగా మిగతా ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించిన అనంతరం కోర్టులో హాజరు పరిచారు.  నిందితుల వద్ద ఐచర్ వ్యాను, కారు,35,500 నగదు, మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టు కున్న ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులను డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి అభినందించారు. కేసును పాల్వంచ పోలీసులకు బదిలీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.