ఏపీకి చల్లని కబురు.. నైరుతి రుతుపవనాలు వచ్చేశాయోచ్

ఏపీకి చల్లని కబురు.. నైరుతి రుతుపవనాలు వచ్చేశాయోచ్

భానుడి భగభగలతో, తీవ్రమైన వడగాలులతో కొన్నిరోజులుగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు ఏపీలోకి  ప్రవేశించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

నైరుతి రుతుపవనాల ప్రభావంతో రేపు, ఎల్లుండి ( జూన్ 21,22) ఆంధ్రప్రదేశ్ లో  అక్కడక్కడ భారీవర్షాలు, మిగిలినచోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి డా.బిఆర్ అంబేద్కర్ తెలిపారు .రేపు ( జూన్ 21)  మన్యం, అనకాపల్లి, అల్లూరి , కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.  విజయనగరం,విశాఖ, తిరుపతి,చిత్తూరు, అన్నమయ్య,YSR,సత్యసాయి,అనంతపురం,కర్నూలు,నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయి. 

నైరుతి రుతు పవనాలు విస్తరించే అవకాశం ఉండటంతో  ... నైరుతి బంగాళాఖాతంలో  ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దీని  ప్రభావంతో రెండు రోజులపాటు ( జూన్ 21,22)  దక్షిణ కోస్తా, రాయలసీమలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 25 నాటికి వాయువ్య బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడి ఒడిశా మీదుగా పయనించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.