మరో నాలుగు రోజులు వర్షాలు

మరో నాలుగు రోజులు వర్షాలు

హైదరాబాద్, వెలుగు: మరో నాలుగు రోజులు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధ, గురువారాల్లో వడగండ్ల వాన పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. మంగళవారం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, హనుమకొండ, జనగాం, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్​మల్కాజిగిరి, వికారాబాద్​లో రాళ్లవాన పడొచ్చని హెచ్చరించింది. శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

జిల్లాల్లో భారీ వర్షం.. 

పలు జిల్లాల్లో మంగళవారం భారీ వర్షం కురిసింది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా సిరికొండలో 6 సెంటీమీటర్ల వర్షం పడింది. కామారెడ్డిలోని లింగంపేట, సిరిసిల్లలోని వీర్నపల్లిల్లో 5.6, సిద్దిపేటలోని మిరుదొడ్డిలో 5.3, మెదక్​లోని చేగుంటలో 4.9, కొత్తగూడెంలోని దుమ్ముగూడెంలో 4.7, ఆసిఫాబాద్​లోని​ సిర్పూర్​లో 4.7, నిజామబాద్​లోని​ కోటగిరిలో 4.5, వికారాబాద్​లోని బంట్వారంలో 4.4, జగిత్యాలలోని మల్లాపూర్​లో 3.6, ఖమ్మంలోని బోనకల్​లో 3.6 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. కాగా, వర్ష ప్రభావంతో టెంపరేచర్లు పడిపోయాయి. సూర్యాపేట జిల్లా రాయినిగూడెంలో 40.7 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండలోని నిడమనూరులో 40.6, మహబూబాబాద్​లోని మరిపెడలో 40.4, నాగర్​కర్నూల్​లోని కొల్లాపూర్​లో 39.9, ఖమ్మంలోని తిమ్మారావుపేటలో 39.8, భద్రాద్రి కొత్తగూడెంలోని జూలూరుపాడులో 39.7 డిగ్రీల టెంపరేచర్లు రికార్డయ్యాయి.