రాబోయే ఐదు రోజులు.. హైదరాబాద్ లో ఈ ప్రాంతాల్లో వర్షాలు

రాబోయే ఐదు రోజులు.. హైదరాబాద్ లో ఈ ప్రాంతాల్లో వర్షాలు

రాష్ట్రంలో మరో 5 రోజులు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ లోని చార్మినార్, ఖైరతాబాద్, కూకట్ పల్లి, ఎల్బీనగర్ సికింద్రాబాద్, శేరిలింగంపల్లి ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. ఏప్రిల్ 26, ఏప్రిల్ 27 తేదీల్లో వడగండ్ల వాన పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. హైదరాబాద్ లోని మరి కొన్ని ప్రాంతాలలోనూ ఈదురుగాలులతో కూడిన వర్షం పడనుందని పేర్కొంది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని సూచించింది. ద్రోణి ఎఫెక్ట్ ఏప్రిల్ 27వతేదీన మరింతగా ఉంటుందని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో పాటు వాడగండ్ల పడుతాయని వాతావరణ శాఖ అధికారిని శ్రావణి తెలిపారు. ఏప్రిల్ 26వ తేదీన మధ్యాహ్నం నుండి వాతావరణంలో మార్పులు కనిపిస్తాయని పేర్కొన్నారు. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, హనుమకొండ, జనగాం, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్​మల్కాజిగిరి, వికారాబాద్​లో రాళ్లవాన పడొచ్చని హెచ్చరించారు. ఏప్రిల్ 28, 29వ తేదీల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు.