బలపడిన అల్పపీడనం.. మరో రెండు రోజులు వర్షాలు

బలపడిన అల్పపీడనం.. మరో రెండు రోజులు వర్షాలు

ఉత్తర అండమాన్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. దీని ప్రభావంతో తెలంగాణలో మరో రెండు రోజులు. ఏపీలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తూర్పు బంగాళాఖాతంను ఆనుకుని ఉత్తర అండమాన్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది 24 గంటల్లో మరింత బలపడి తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. బంగాళాఖాతంలో ప్రస్తుతం కొనసాగుతున్న వాయుగుండం తీవ్రవాయుగుండంగా మారి పశ్చిమ, వాయువ్యదిశగా ప్రయాణించి సోమవారం మధ్యాహ్నం  ఉత్తరాంధ్రలో తీరందాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

మరోవైపు ఉత్తర అండమాన్ పరిసరప్రాంతాల్లో ఈనెల 14న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా పరిసరాల్లో ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇప్పటికే ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసాయి. రానున్న నాలుగు రోజులు ఏపీలో భారీ నుంచి  అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తాతీరంలో గంటకు 45 నుంచి 65 కి.మీ. వేగంతో గాలులు వీయనున్నాయి. మత్స్యకారులు సోమవారం వరకు సముద్రంలో వేటకు వెళ్లరాదని విపత్తులశాఖ హెచ్చరించింది. తీవ్ర వాయుగుండం కోస్తా జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపనుందని, ముఖ్యంగా ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలపై ఎక్కువ తీవ్రత ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు కోస్తా, రాయలసీమ జిల్లాలకు విశాఖ తుపాన్ హెచ్చరిక కేంద్రం రెడ్, ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

తీవ్ర అల్పపీడన ప్రభావంతో..తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది హైదరాబాద్ వాతావరణ శాఖ. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంటోంది. ఇవాళా, రేపు ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే చాన్స్  ఉందని చెప్తోంది వాతావరణ శాఖ.

హైదరాబాద్ లో ఉదయం నుంచే వర్షం

ఉదయం నుంచే హైదరాబాద్ లోని పలుచోట్ల వర్షం కురుస్తోంది. ఉదయం 7గంటల నుంచి 9 గంటల వరకు సిటీలోని కొన్ని చోట్ల భారీ వర్షం కురుసింది. మరికొన్ని చోట్లు గంట గంటకూ వర్షం పడుతూ పోతోంది. మెహదీపట్నం, ఆసిఫ్ నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మణికొండ, హిమాయత్ నగర్, సైఫాబాద్, నాంపల్లి, అబిడ్స్ లో వర్షం కురిసింది. శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, మియపూర్, చందానగర్, జగద్గిరిగుట్ట, బాలానగర్ లోనూ మోస్తరు వర్షం పడింది. కూకట్ పల్లి , కె.పి.హెచ్.బి. పరిసర ప్రాంతాలలో వర్షం పడింది. దీంతో.. వాహనదారులు ఇబ్బంది పడ్డారు. కుత్భుల్లాపూర్ లో 1.9 సెంటీమీటర్లు, గాజులరామారంలో 1.8 సెంటీమీటర్ల వర్షం పడిందని వాతావరణ శాఖ చెప్పింది.

అటు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. రోడ్లపైకి వచ్చి చేరిన వర్షపు నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్  జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటోంది వాతావరణ శాఖ.