తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక సూచన

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక సూచన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతూ ఉండగా.. ఇంకొన్ని ప్రాంతాల్లో ఎండలు దంచికొడుతూ ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం బుధవారం ( జూన్ 28)సాయంత్రానికి బలహీనపడి అల్పపీడనంగా మారింది. దీంతో నైరుతి రుతుపవనాలు బలహీనపడ్డాయి. ఈ ప్రభావంతో రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగింది. అనేకచోట్ల పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. రానున్న రెండు రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గురువారం (జూన్ 29)పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, శ్రీసత్యసాయి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసాయి.  మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. ఈ ఏడాది జూన్ ప్రారంభంలో ప్రవేశించాల్సిన రుతుపవనాలు ఆలస్యం కావడంతో జూన్ మొదటి వారంలో కూడా ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఇక రుతుపవనాలు వచ్చినా కూడా పెద్దగా ప్రభావం చూపకపోవడంతో రైతులలో కాస్త టెన్షన్ మొదలైంది.


తెలంగాణలో రాబోయే రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ చెబుతోంది. రాగల రెండు రోజుల్లో (జూన్ 29 నుంచి) తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు. అల్పపీడనంతో పాటూ నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండటంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గురువారం (జూన్ 29) ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో వర్షాలు కురిసాయి. ఇంకా  ఆదిలాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, వికారాబాద్‌, మెదక్‌ జిల్లాల్లో  శుక్ర, శని వారాల్లో (జూన్ 30, జులై 1) అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.