బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. గత కొన్నాళ్లుగా సాగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ.. కృతి సోదరి నుపుర్ సనన్ తన ప్రేమ ప్రయాణాన్ని పెళ్లి పీటల వరకు తీసుకెళ్లింది. ప్రముఖ సింగర్ స్టెబిన్ బెన్ ప్రేమలో ఉన్న ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ గా తన ఎంగేజ్‌మెంట్ వార్తను అధికారికంగా ప్రకటింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సముద్ర సాక్షిగా రొమాంటిక్ ప్రపోజల్
ఒక అందమైన యాచ్ (Yacht) మీద, చుట్టూ నీలి సముద్రం.. మధ్యలో "విల్ యూ మ్యారీ మీ?" అనే ప్లకార్డుల సాక్షిగా స్టెబిన్ బెన్ మోకాళ్లపై నిలబడి ప్రపోజ్ చేయగా, నుపుర్ ఎంతో మురిసిపోతూ 'యస్' చెప్పేసింది. అయోమయంతో నిండిన ఈ ప్రపంచంలో, నేను చెప్పిన అత్యంత సులువైన 'యస్' ఇదే అంటూ నుపుర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. తన నిశ్చితార్థపు ఉంగరాన్ని చూపిస్తూ ఆమె ఇచ్చిన ఫోజులు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
టాలీవుడ్ ఎంట్రీ టూ ఎంట్రప్రెన్యూర్
నుపుర్ సనన్ కేవలం కృతి సనన్ సోదరిగానే కాకుండా, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నించింది. మాస్ మహారాజా రవితేజ నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' (2023) సినిమాతో నుపుర్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. బి ప్రాక్ పాడిన 'ఫిలాల్' వంటి సూపర్ హిట్ మ్యూజిక్ వీడియోలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె నటిగా మాత్రమే కాకుండా ఒక ఎంట్రప్రెన్యూర్ గా కూడా రాణిస్తోంది.
ఎవరీ స్టెబిన్ బెన్?
స్టెబిన్ బెన్ భారతీయ సంగీత ప్రపంచంలో ఒక సెన్సేషన్. తన సోల్‌ఫుల్ వాయిస్‌తో లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్నాడు. 'తోడా తోడా ప్యార్', 'రులా కే గయా ఇష్క్', 'సాహిబా' వంటి ఎన్నో చార్ట్‌బస్టర్ సాంగ్స్ ఆయన ఖాతాలో ఉన్నాయి. కవర్ సాంగ్స్ ద్వారా కెరీర్ ప్రారంభించి, నేడు బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ ప్లేబ్యాక్ సింగర్లలో ఒకరిగా ఎదిగాడు. ముఖ్యంగా రొమాంటిక్ సాంగ్స్‌కు ఇతను పెట్టింది పేరు.
పెళ్లి ఎప్పుడు? ఎక్కడ?
గత ఏడాది (2024) చివరలో వీరిద్దరి డేటింగ్ వార్తలు గుప్పుమన్నాయి. 2025 అంతా స్టెబిన్ తాము కేవలం 'బెస్ట్ ఫ్రెండ్స్' మాత్రమేనని బుకాయించినప్పటికీ.. చివరకు ప్రేమ గెలిచింది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, వీరి వివాహం జనవరి 11న ఉదయపూర్‌లో అంగరంగ వైభవంగా జరగనుంది. రాజస్థానీ రాయల్ స్టైల్‌లో జరగబోయే ఈ వేడుకకు సినీ, సంగీత ప్రపంచం నుంచి ప్రముఖులు హాజరుకానున్నారు. మొత్తానికి అక్క కంటే ముందే చెల్లెలు పెళ్లి పీటలు ఎక్కుతుండటంతో సనన్ కుటుంబంతో పాటు అభిమానులు కూడా ఫుల్ ఖుషీలో ఉన్నారు.
