
- తొలికార్డు ఐటీడీఏ పీవో రాహుల్ కు అందించి అభిమానం చాటుకున్న ఆదివాసీ యువకుడు
- కోయ భాష దినోత్సవ శుభాకాంక్షలు అదే భాషలో తెలిపిన ఐటీడీఏ పీవో
భద్రాచలం,వెలుగు : ఆదివాసీ యువకుడు తన పెండ్లి కార్డును కోయభాషలో ముద్రించి ఐటీడీఏ పీవో బి.రాహుల్కు సోమవారం తొలి కార్డు అందించి అభిమానం చాటుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ గ్రామానికి చెందిన ఆదివాసీ యువకుడు కన్నరాజుకు భద్రాచలం జగదీశ్కాలనీకి చెందిన లక్ష్మీ శరణ్యతో ఆగస్టు 3న పెండ్లి ముహూర్తం ఖరారు చేశారు. వీరి పెండ్లి వేడుక ఆహ్వానపత్రికను పూర్తిగా కోయభాషలోనే ప్రింట్ చేయించారు.
“ పందిర్ముహూర్తం, పెళ్లి మూర్తం, మా సొంతనార్, కబూర్, కరంగానూర్ఇయాల్.. ’’ అంటూ కల్యాణ పత్రికపై భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్ప్రేరణతో కోయభాషలో పెండ్లి శుభలేఖ అంటూ ముద్రించారు. శుభగడియలు, వేదిక, విందు, ఆహ్వానించువారు వంటి పదాలతో భళా...ఆదివాసీ శుభ కల్యాణ పత్రిక అనేలా రూపొందించారు.
కోయభాష దినోత్సవం రోజునే ఆయనకు అందజేశారు. తమ మాతృభాషపై కన్నరాజు చూపించిన మమకారం అభినందనీయమని పీవో అభినందించారు. పీవో రాహుల్ సైతం కోయభాషా దినోత్సవం సందర్భంగా అదే భాషలో శుభాకాంక్షలు తెలుపుతూ వీడియో రిలీజ్ చేయగా సోషల్మీడియాలో వైరల్గా మారింది.