ఐస్​బాత్​.. బరువు తగ్గిస్తదంట

ఐస్​బాత్​.. బరువు తగ్గిస్తదంట

ఈ మధ్య కాలంలో ఎక్కువ బరువు పెద్ద త​లనొప్పిగా మారింది. బరువుని కంట్రోల్​ చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కొందరు ఫెయిల్​ అవుతూనే ఉన్నారు. మరికొందరైతే  తినడానికి కూడా భయపడుతున్నారు . జిమ్​లో గంటలు గంటలు ఉంటున్న వాళ్లూ లేకపోలేదు. ఇక పై ఆ కష్టాలకు చెక్​. ఐస్​బాత్​తో బరువు తగ్గించుకోవచ్చు అంటున్నారు పరిశోధకులు. చలికాలంలో కాస్త కష్టమే అయినా… బరువు తగ్గుతారు కదా ఒకసారి ట్రై చేయండి.

ఐస్​బాత్​ బరువు తగ్గడానికి సాయం చేస్తుంది. కండరాలను కూడా దృఢంగా మారుస్తుంది. అదేంటి?  ఐస్​​బాత్​కి.. అధిక బరువు, కండరాల దృఢత్వానికి సంబంధం ఏంటి? ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే ఇది చదవాల్సిందే.

ఎన్ని లాభాలో

వ్యాయామం అనగానే మొదట అందరికీ గుర్తొచ్చేది జిమ్​. శరీరాన్ని ఫిట్​గా ఉంచడం జిమ్​లో ఎక్సర్​సైజ్​ చేస్తేనే సాధ్యమవుతుందని చాలామంది అనుకుంటారు. కానీ శరీరాన్ని హెల్దీగా , ఫిట్​గా ఉంచడానికి జిమ్, వాకింగ్​ తో పాటు ఐస్​బాత్ కూడా సాయపడుతుంది అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్​ మాస్ట్రిచ్​​ ప్రొఫెసర్స్​. బరువు తగ్గడానికి, చర్మం బిగుతుగా మారడానికి , కండరాలు బలంగా అవడానికి ఐస్​బాత్ సాయం చేస్తుందని నిరూపించారు కూడా.

బరువు తగ్గుతారా!

ఐస్​బాత్​తో కొవ్వు కరిగించొచ్చా లేదా అని చాలా ఏళ్ల నుంచి పరిశోధనలు జరుగుతున్నాయ్​. 2000 సంవత్సరంలో ‘ఐస్​ థెరపీ’ పేరుతో బరువు ఎక్కువగా ఉన్న, చర్మం సాగినట్టుగా ఉన్న ప్రాంతాల్లో ఐస్‌‌‌‌క్యూబ్స్​తో మృదువుగా మసాజ్​ చేసేవాళ్లు. మసాజ్​ వల్ల సాగినట్టుగా ఉండే చర్మం సాధారణ స్థితికి వచ్చి శరీరంలో రక్త ప్రసరణ కూడా మెరుగుపడేది. కానీ ఇదెలా సాధ్యమైందనే విషయంపై ఖచ్చితమైన వివరణ లేదు. దాంతో 2014లో గర్వన్​ ఇని​స్టిట్యూట్ ఆఫ్​ మెడికల్ రీసెర్చ్​ ఈ విషయంపై పరిశోధన చేసింది. పూర్తిగా తెలియకపోయినా 90 శాతం మంది బరువు తగ్గుతున్నారని అందులో తేలింది. దాన్ని ఆధారం​ చేసుకుని యూనివర్సిటీ ఆఫ్​ మాస్ట్రిట్చ్ ప్రొఫెసర్​ డాక్టర్​ జొనంతన్​ ఎం. పీకే బృందం స్టడీ చేపట్టింది. ఇందులో బరువు తగ్గడంతో పాటు కండరాలు కూడా దృఢంగా తయారవుతాయని వెల్లడైంది.

ఎలా సాధ్యం

మనిషి శరీరంలో బ్రౌన్, వైట్​ కలర్స్​లో రెండు రకాల కొవ్వు కణజాలాలు ఉంటాయి. వాటిల్లో తెలుపు రంగు కణజాలం శక్తిని నిల్వ​ చేసి ఛాతి, తొడ భాగాలకు పంపించి బరువు పెరిగేలా చేస్తుంది. బ్రౌన్ రంగు​ కొవ్వు కణజాలం మెడ భాగంలో ఉండి తెల్ల కొవ్వు కణజాలం పనికి ఆటంకం కలిగిస్తుంటుంది. ఐస్​క్యూబ్​ లేదా నీళ్లతో స్నానం చేయడం వల్ల బ్రౌన్​ కణజాలం పని వేగవంతం అవుతుంది. ఈ బాత్ వల్ల బ్రౌన్​ కణజాలం ఐరిష్​, ఎఫ్​జిఎఫ్​21 లనే రెండు హార్మోన్లు విడుదల చేసి ​ తెల్ల కణజాలాన్ని వేగంగా కరిగిస్తుంది. ప్రతిరోజు 10 నుంచి పదిహేను నిమిషాల పాటు ఐస్​బాత్ చేస్తే 50 గ్రాముల తెలుపు రంగు కణజాలం అంటే 300 కిలో కెలొరీల ఎనర్జీ కరుగుతుంది. దాంతో బరువు సమస్య నుంచి తేలికగా బయటపడొచ్చు. అంతేకాదు ఐస్​బాత్ వల్ల రిలీజ్​ అయిన ఐరిష్​, తెల్ల కణజాలాన్ని బ్రౌన్​ కణజాలంగా మార్చేస్తుంది. అలా మార్చడం వల్ల డయాబెటిస్​, కొలెస్ట్రాల్ సమస్యల నుంచి బయటపడొచ్చు.

కండరాలు బలంగా…

ఐస్​బాత్ వల్ల కేవలం బరువే కాదు కండరాలు కూడా బలంగా మారతాయి అంటున్నారు పరిశోధకులు. 21 సంవత్సరాలున్న 12 మంది యువకులు పాల్గొన్న ఈ స్టడీలో. మొదట వాళ్లతో రెండు వారాల పాటు లెగ్ ఎక్సర్​సైజ్​లు చేయించారు. తర్వాత ఆ కాళ్లలో ఒకదాన్ని ఐస్​నీళ్లలో, మరొకదాన్ని మామూలు నీళ్లలో ఇరవై నిమిషాలు ఉంచి బయటకు తీశారు. రెండు కాళ్ల ప్రొటీన్​ శాంపిల్స్​ తీసి టెస్ట్ చేస్తే ఎక్సర్​సైజ్ తర్వాత ఐస్​బాత్​లో పెట్టిన కాలు ఆరోగ్యంగా, బలంగా ఉందని తేలింది.

లెక్క ఉంది

ఐస్​బాత్​తో లాభాలే కాదు కొన్ని ఇబ్బందులూ లేకపోలేదు. ఐస్​క్యూబ్స్​ మధ్య అంతసేపు ఉంటే జలుబు వంటి సమస్యలొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గుండెనాళ సమస్యలు, హై బీపీ,  టైప్​1 , టైప్​ 2 డయాబెటిస్​ ఉన్నవాళ్లు కూడా ఐస్​బాత్​కి దూరంగా ఉండాలి.

ఇలా చేయాలి

ఐస్​క్యూబ్స్​తో బాత్ చేసేటప్పుడు సరైన పద్ధతిలో చేయకపోతే లేనిపోని సమస్యలొచ్చే అవకాశాలే ఎక్కువని సర్వేలో తేలింది. బరువు తొందరగా తగ్గాలని పావుగంట కన్నా ఎక్కువసేపు ఈ స్నానం చేయడానికి వీల్లేదు. అలాగే ఐస్​బాత్ టెంపరేచర్​ 10 నుంచి 15 డిగ్రీల సెల్సియస్​ మాత్రమే ఉండాలి. అంతకన్నా ఎక్కువగా ఉంటే గోరువెచ్చని నీళ్లని కలపాలి. ఒకేసారి శరీరాన్ని ఐస్​నీళ్లలో తడపకుండా మొదట కాలివేళ్లు, కాళ్లు పెట్టి ఆ టెంపరేచర్​ని అవి తట్టుకోగలిగితే శరీరమంతా తడపాలి. ఐస్​బాత్ మంచి ఫలితాన్ని చూపించాలంటే ఉదయం వర్కవుట్​ తర్వాత చేయడం బెస్ట్​.