ఆర్టీసీలో వెల్ఫేర్ కమిటీలను రద్దు చేయాలె

ఆర్టీసీలో వెల్ఫేర్ కమిటీలను రద్దు చేయాలె
  • తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి

ముషీరాబాద్,వెలుగు: ఆర్టీసీలో యూనియన్ల వ్యవస్థను పునరుద్ధరించాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. థామస్ రెడ్డి కోరారు. వెల్ఫేర్ కమిటీలు బాగా పని చేస్తున్నాయని ఎండీ మాట్లాడడం ఎంతో బాధ కలిగించిందన్నారు. యూనియన్ లేక కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర జనరల్ బాడీ మీటింగ్​ బుధవారం బాగ్​లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  యూనియన్ల ద్వారానే ఆర్టీసీ ప్రగతి అని, ఎన్నో ఏండ్లుగా కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. ఆర్టీసీ సమస్యలు పరిష్కరించుకోవడానికి సమ్మె కాదు సంధి మార్గమే చేయాలని తెలిపారు.  ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి, 30 శాతం పీఆర్సీ ఇచ్చి బకాయిలను విడుదల చేయాలని కోరారు. ఉద్యోగ భద్రత పై జారీ చేసిన సర్క్యూలర్ ను వెంటనే రద్దు చేసి, ఆర్టీసీని కాపాడేందుకు వచ్చే బడ్జెట్ లో ఆరు వేల కోట్లు కేటాయించాలని  డిమాండ్ చేశారు. యూనియన్ కు గౌరవాధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ కవితను నియమించుకున్నామని, జేఏసీని నమ్మితే  కార్మికులకు నష్టం జరుగుతుందని తెలిపారు.    సమావేశంలో అధ్యక్షుడు కమలాకర్ గౌడ్, సలహాదారు మారయ్య, జిల్లాల నుంచి ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.