ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

తూప్రాన్, వెలుగు: రాష్ట్రంలోని రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు అన్నారు. సోమవారం తూప్రాన్ శివారులో నిర్మించిన వ్యవసాయ గ్రైన్ మార్కెట్ యార్డును ఆయన  ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు పండించే పంట అమ్ముకునేందుకు మార్కెట్లు నిర్మించుకుంటున్నామన్నారు. రైతుల శ్రేయస్సుకు సర్కార్​అహర్నిశలు శ్రమిస్తోందని, ఉచిత కరెంటు, సాగునీరు అందిస్తున్నామన్నారు. 13 ఏండ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న జీడిపల్లి, కాళ్లకల్, కుచారం, ముప్పిరెడ్డి పల్లిలోని భూనిర్వాసితులకు 374 ఇళ్ల పట్టాలు అందజేశారు. అనంతరం తూప్రాన్ మున్సిపాలిటీలో రూ.22 కోట్లతో  నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మల్కాపూర్ లో నిర్మాణం పూర్తి చేసుకున్న గ్రామపంచాయతి,యూత్ ,మహిళ బిల్డింగులను ప్రారంబించారు. మనోహరాబాద్‌లో రెండో విడత కంటి వెలుగుపై నాయకులతో  మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, జడ్పీ చైర్‌‌పర్సన్​ హేమలతా, గడ స్పెషల్ ఆఫీసర్ ముత్యం రెడ్డి,  కలెక్టర్ హరీశ్, అడిషనల్ కలెక్టర్లు ప్రతిమ సింగ్, రమేశ్ , మున్సిపల్ చైర్మన్​ రవీందర్ గౌడ్, వైస్ చైర్మన్ శ్రీనివాస్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

రోడ్లకు రూ.14 కోట్ల 55 లక్షలు రిలీజ్​ 

సిద్దిపేట రూరల్, (నారాయణరావు పేట) వెలుగు: నారాయణరావుపేట మండలంలో బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.14 కోట్ల 55 లక్షలు మంజూరు చేసినట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు. నారాయణ రావుపేట– గోపులాపూర్ 4 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి  రూ.3కోట్ల 99 లక్షలు, మాటిండ్ల– జిల్లెల బార్డర్ వరకు 2 కిలోమీటర్లకు రూ.3 కోట్ల 73 లక్షలు,  మాల్యాల–నారాయణ రావుపేట రోడ్డుకు రూ.4కోట్ల 27 లక్షలతో రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. త్వరితగతిన టెండర్లు పూర్తి చేసి పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

కేంద్ర మంత్రిని కలిసిన దుబ్బాక ఎమ్మెల్యే 

దుబ్బాక, వెలుగు: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ను దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు సోమవారం ఢిల్లీలోని ఆమె నివాసంలో కలిశారు.  తెలంగాణ ఆర్థిక పరిస్థితులు, రానున్న కేంద్ర బడ్జెట్​లో రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలని,​ రాష్ట్రానికి రావాల్సిన ఫండ్స్​ వెంటనే విడుదల చేయాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఫండ్స్​ పెంచాలని కోరినట్లు చెప్పారు. తన విజ్ఞప్తికి  ఆర్థిక మంత్రి సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ప్రతి సంక్షేమ పథకంలో కేంద్ర ప్రభుత్వ వాటా ఉందని,  అందుకు మోడీ ప్రభుత్వం భారీగా ఫండ్స్ కేటాయిస్తోందన్నారు. 

ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజావాణి

సిద్దిపేట రూరల్, మెదక్ టౌన్, సంగారెడ్డి టౌన్, వెలుగు: ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా ఉన్నతాధికారులు పేర్కొన్నారు. సోమవారం సిద్దిపేట కలెక్టరేట్‌లో అడిషనల్​కలెక్టర్లు ముజామ్మిల్ ఖాన్, శ్రీనివాస్ రెడ్డి  అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూ సమస్యలు, డబుల్ బెడ్ రూం, ఆసరా పింఛన్లు తదితర సమస్యలపై  112 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ పైజాన్ అహ్మద్, కలెక్టరేట్ ఏవో అబ్దుల్ రహమాన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కాళేశ్వరం కాలువ నిర్మాణం దుద్దెడ దక్షిణం మీదుగా చేపట్టవద్దంటూ ఆ గ్రామ రైతులు ప్రజావాణిలో వినతిపత్రం ఇచ్చారు.  మెదక్ కలెక్టరేట్‌లో డీఎస్‌వో శ్రీనివాస్​, ఆర్డీవో సాయిరామ్​  ప్రజావాణి దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 49  ఫిర్యాదులు వచ్చినట్లు వారు తెలిపారు.  సంగారెడ్డి కలెక్టరేట్‌లో అడిషనల్​కలెక్టర్లు రాజర్షిషా, వీరారెడ్డి అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. జహీరాబాద్ నియోజకవర్గంలో 2019–20లో వేసవిలో నీటి ఎద్దడి ఉన్నప్పుడు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసిన బిల్లులను చెల్లించాలని వివిధ గ్రామాల సర్పంచులు పెద్దఎత్తున కలెక్టరేట్ కు తరలివచ్చారు. మూడేళ్లుగా బిల్లులు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఉన్నతాధికారులకు అర్జీలిచ్చారు. 

బాధితులకు తగిన న్యాయం చేయాలి

మెదక్​ టౌన్​, వెలుగు: మెదక్​ జిల్లా వ్యాప్తంగా తమ సమస్యలపై పోలీస్‌స్టేషన్లకు వచ్చే బాధితులకు న్యాయం చేయాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం వహించొద్దని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. సోమవారం జిల్లా ఎస్పీ ఆఫీసులో పోలీస్​ ప్రజావాణి నిర్వహించారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 

మైనింగ్ ఏర్పాటుపై  రైతుల ఫిర్యాదు

సంగారెడ్డి టౌన్, వెలుగు: పటాన్‌చెరు మండలం లక్డారం సర్వేనెంబర్ 747లో పెద్ద చెరువు సమీపంలో క్రషర్ , క్వారీని ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ రైతులు సోమవారం కలెక్టరేట్‌కు తరలివచ్చారు. అదనపు కలెక్టర్ రాజర్షి షాకు వినతి పత్రం ఇచ్చారు. రైతాంగానికి ముందస్తు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా చెరువు ప్రాంతంలో క్రషింగ్ ఏర్పాటు చేయడంతో జలాలు కలుషితంతోపాటు చెరువు కబ్జా అయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చెరువు కింద 500 ఎకరాల సాగు భూమి ఉందని, ఆ భూములన్ని బీడుగా మారే ప్రమాదం ఉందన్నారు. యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తే దౌర్జన్యానికి పాల్పడుతోందన్నారు. రైతులు చంద్రశేఖర్ గౌడ్, మహేందర్ రెడ్డి, మాణిక్య రెడ్డి, రామచంద్రారెడ్డి, మల్లేశం గౌడ్, నరసింహులు గౌడ్, అశోక్, జహంగీర్, ప్రభు, డాకయ్య, సాగర్ పాల్గొన్నారు. 

పేదల కోసమే సంక్షేమ పథకాలు

మునిపల్లి(న్యాల్‌కల్), వెలుగు: పేదల శ్రేయస్సు కోసమే బీఆర్ఎస్​ ప్రభుత్వం సంక్షేమ పథకాలు  అమలుచేస్తోందని జహీరాబాద్​ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు అన్నారు.  సోమవారం న్యాల్‌కల్‌ మండలకేంద్రంలో 119 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్  చెక్కులను  అందజేశారు.  ఈ సంరద్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా ఇస్తున్నాయని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని పేర్కొన్నారు.  కార్యక్రమంలో ఎంపీపీ అంజమ్మ,  జడ్పీటీసీ స్వప్న,  ఆత్మ కమిటీ  చైర్మన్ పెంటారెడ్డి, ఆర్డీవో రమేశ్​బాబు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవీందర్, వైస్ ఎంపీపీ గౌసోద్దీన్, లీడర్లు నర్సింహ రెడ్డి, రాజ్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్​ విజయలక్ష్మి పాల్గొన్నారు.