కరోనా వైరస్ వల్ల అమెరికాలో 75 వేల నుంచి 1లక్షమంది వరకు ప్రాణాలు కోల్పోతారనిపిస్తోందని వ్యాఖ్యానించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.
ఫాక్స్ న్యూస్ ప్రసారం చేసిన రెండు గంటల వర్చువల్ టౌన్ హాల్ సందర్భంగా ట్రంప్ మాట్లాడారు. ఈ సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ కరోనా అంటే భయమేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికి తాము కరోనా వైరస్ చైనా బయోవార్ కుట్రలో భాగమేనని నమ్ముతున్నట్లు చెప్పారు.
11లక్షలకు పైగా పాజిటీవ్ కేసులు
అమెరికా 11 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 67 వేలకు పైగా మృతిచెందారు. ఇలాంటి పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ కరోనా మరణాల సంఖ్య లక్ష వరకు ఉంటుందని వ్యాఖ్యలు చేయడం ఆందోళన కలిగిస్తుంది.మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్నా ఈ ఏడాది లోపు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు.
ట్రంప్ పై విమర్శలు
కరోనా వైరస్ వ్యాప్తిపై ట్రంప్ సరైన నిర్ణయాలు తీసుకోలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లాక్ డౌన్ ప్రకటిస్తే దేశ ఆర్ధిక వ్యవస్థ పతనమవుతుందని భావించిన ట్రంప్..లాక్ డౌన్ లా కఠిన మైన నిర్ణయాలు తీసుకునేందుకు అలసత్వం ప్రదర్శించినట్లు తెలుస్తోంది. దీని వల్లే అమెరికాలో కరోనా మరణాలు పెరుగుతున్నాయని, సరైన సమయంలో లాక్ డౌన్ ప్రకటించి..ఇంత ప్రాణ నష్టం జరిగేది కాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
