ఉత్తరాదిని వదలని వర్షాలు.. వీధులన్నీ జలమయం

ఉత్తరాదిని వదలని వర్షాలు.. వీధులన్నీ జలమయం

ఉత్తరాదిని వర్షాలు, వరదలు వదలడం లేదు. అస్సోంలోని పలు జిల్లాల్లో వరద పరిస్థితులు కొనసాగుతున్నాయి. తాజాగా బొంగాయ్ గావ్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. వీధులన్నీ జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదల కారణంగా అస్సోంలో మృతి చెందిన వారి సంఖ్య 67కు చేరగా…సుమారు 30 లక్షల మందికి పైగా వరదలతో ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని జిల్లాల్లో వరదలు తగ్గుముఖం పడుతుండటంతో.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

మహారాష్ట్రలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబైలో కుండపోత వానతో నగరంలోని పలు ప్రాంతాలను వరద ముంచెత్తింది. ప్రధాన రోడ్లు చెరువులుగా మారాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. ముంబై సైన్ రైల్వే స్టేషన్ లో.. ట్రాక్ పైకి వాటర్ రావడంతో రైలు సర్వీసులకు ఆటంకం కలుగుతోంది. సైన్ ప్రాంతంలోనే వరద రోడ్డుపైకి చేరడంతో .. రోడ్డు సరిగ్గా కనిపించక వేగంగా వెళుతున్న మూడు కార్లు ఢీకొన్నాయి.  ప్రమాదంలో ఎనిమిది మంది గాయపడ్డారు. ముంపు ప్రాంతాలు బీఎంసీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. రోడ్లపై చేరిన నీటిని ఎత్తిపోస్తున్నారు. మరో 48 గంటల పాటు భారీ వర్షాలుంటాయని… ఐఎండీ హెచ్చరికలతో అలర్టయ్యారు అధికారులు. ముంపు ప్రాంతవాసులను ఖాళీ చేయిస్తున్నారు.

ఇక పశ్చిమ బెంగాల్లోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. సిలిగూరులో వర్షపు నీరు ఇళ్లల్లోకి చేరి జనం ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు జనం. దీంతో నిత్యావసరాలు కూడా తెచ్చుకోలేని పరిస్థితి. పాలు, కూరగాయలు దొరక్క జనం ఇబ్బంది పడుతున్నారు.

మరోవైపు గుజరాత్ రాష్ట్రంలోని దాహోద్ లో వర్షం కోసం నిర్వహించే సంప్రదాయ వేడుకను ఘనంగా నిర్వహించారు. మహిళలంతా మగ వేషం వేసుకుని.. చేతిలో ఆయుధాలు పట్టుకుని ర్యాలీ తీశారు. కత్తులు, బరిసెలతో స్థానిక హనుమాన్ ఆలయం చుట్టూ ప్రదర్శన చేశారు. తర్వాత వర్షాలు బాగా కురవాలంటూ ప్రత్యేక పూజలు చేశారు. ఏటా వర్షాల కోసం ఇలా పూజ చేయడం ఆచారంగా వస్తుందని స్థానికులు చెబుతున్నారు.