50 ఓవర్లూ స్పిన్నర్లతోనే.. వెస్టిండీస్ వరల్డ్ రికార్డు.. రెండో వన్డేలో బంగ్లాపై సూపర్ ఓవర్లో గెలుపు

50 ఓవర్లూ స్పిన్నర్లతోనే.. వెస్టిండీస్ వరల్డ్ రికార్డు.. రెండో వన్డేలో బంగ్లాపై సూపర్ ఓవర్లో గెలుపు

మీర్పూర్‌‌‌‌‌‌‌‌: వన్డే క్రికెట్‌‌‌‌లో  వెస్టిండీస్ టీమ్ అరుదైన రికార్డు సృష్టించింది. ఒకప్పుడు  మాల్కమ్ మార్షల్, మైకేల్‌‌‌‌ హోల్డింగ్  వంటి భీకర పేసర్లకు పెట్టింది పేరైన విండీస్ మంగళవారం (అక్టోబర్ 22) బంగ్లాదేశ్‌‌‌‌తో జరిగిన రెండో వన్డే  మ్యాచ్‌‌‌‌లో 50 ఓవర్లనూ స్పిన్నర్లతోనే బౌలింగ్ చేయించి  చరిత్ర కెక్కింది. ఓ ఇంటర్నేషనల్ మ్యాచ్‌‌‌‌లో ఒక జట్టు పేసర్లను ఉపయోగించకుండా పూర్తి ఇన్నింగ్స్ బౌలింగ్ చేయడం ఇదే తొలిసారి.

 ఈ పోరులో విండీస్ సూపర్ ఓవర్లో గెలిచి విజయం అందుకుంది. తొలుత ఐదుగురు స్పిన్నర్లు రోస్టన్‌‌‌‌ చేజ్, అకీల్ హుస్సేన్, అలిక్ అథనాజ్, గుడకేశ్ మోతీ, ఖారీ పియర్‌‌‌‌ కరీబియన్   బౌలింగ్ భారాన్ని మోశారు. బంగ్లాదేశ్‌‌‌‌ను 50 ఓవర్లలో 213/7  స్కోరుకే కట్టడి చేశారు. ఆ తర్వాత ఛేజింగ్‌‌‌‌లో వెస్టిండీస్ కూడా ఓవర్లన్నీ ఆడి  213/9 స్కోరు చేసింది. 

కెప్టెన్ షై హోప్ (53) ఫిఫ్టీతో తమ జట్టును లక్ష్యం వైపు నడిపించాడు. అయితే, బంగ్లా స్పిన్నర్ రిషద్ హుస్సేన్ (3/42)  దెబ్బకొట్టడంతో మ్యాచ్ టై అయింది.  విన్నర్‌‌‌‌‌‌‌‌ను తేల్చేందుకు నిర్వహించిన సూపర్ ఓవర్‌‌‌‌లో ముస్తాఫిజుర్ బౌలింగ్‌‌‌‌లో విండీస్‌‌‌‌ 10 రన్స్ చేసింది. అనంతరం అకీల్ హుస్సేన్‌‌‌‌ అద్భుతమైన బౌలింగ్‌‌‌‌తో బంగ్లాదేశ్‌‌‌‌ను 9 రన్స్‌‌‌‌కే పరిమితం చేసి, వెస్టిండీస్‌‌‌‌కు పరుగు తేడాతో ఉత్కంఠ విజయాన్ని అందించాడు. ఈ విజయంతో విండీస్ మూడు వన్డేల సిరీస్‌‌‌‌ను 1–-1తో సమం చేసింది. షై హోప్‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.