IND vs WI 2nd Test: తొలి ఇన్నింగ్స్ లో 248 పరుగులకు వెస్టిండీస్ ఆలౌట్.. ఫాలో ఆన్‌కు ఆహ్వానించిన టీమిండియా

IND vs WI 2nd Test: తొలి ఇన్నింగ్స్ లో 248 పరుగులకు వెస్టిండీస్ ఆలౌట్.. ఫాలో ఆన్‌కు ఆహ్వానించిన టీమిండియా

ఢిల్లీ వేదికగా వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో ఇండియా బౌలర్లు విజృంభించారు. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ ను 248 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో తొలి ఇన్నింగ్స్ లో ఇండియాకు 270 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. 41 పరుగులు చేసిన అలిక్ అథనాజ్ విండీస్ ఇన్నింగ్స్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లతో సత్తా చాటాడు. జడేజా మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, బుమ్రా తలో వికెట్ తీసుకున్నారు. ఈ టెస్ట్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్ల నష్టానికి 518 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. 

కుల్దీప్ స్పిన్ మ్యాజిక్:

నాలుగు వికెట్ల నష్టానికి 141 పరుగులతో ఓవర్ నైట్ స్కోర్ తో మూడో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ చివరి ఆరు వికెట్లను 80 పరుగుల వ్యవధిలో చేజార్చుకుంది. మ్యాచ్ ప్రారంభమైన కొద్ది సేపటికే కుల్దీప్ ఒక మ్యాజిక్ డెలివరీతో హోప్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు.  ఇదే ఊపులో క్రీజ్ లో పాతుకు పోయిన టెవిన్ ఇమ్లాచ్ తో పాటు జస్టిన్ గ్రీవ్స్ ను ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనక్కి పంపాడు. వారికన్ ను సిరాజ్ ఔట్ చేయడంతో విండీస్ 8 వ వికెట్ కోల్పోయింది. 175 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన విండీస్ జట్టును లోయర్ ఆర్డర్ ఆడుకుంది. ఖారీ పియరీ, ఆండర్సన్ ఫిలిప్ భారత బౌలర్లను అడ్డుకున్నారు. 

9 వికెట్ కు 46 పరుగులు జోడించి జట్టు వికెట్ల పతనాన్ని ఆపే ప్రయత్నం చేశారు. లంచ్ తర్వాత బుమ్రా ఒక పదునైన యార్కర్ తో పియరీని బౌల్డ్ చేశాడు. చివరి వికెట్ కు కూడా విండీస్ పోరాడుతూ 27 పరుగులు చేసి ఆధిక్యాన్ని తగ్గించింది. కుల్దీప్ చివరి వికెట్ తీసుకొని విండీస్ కథని ముగించాడు. తొలి ఇన్నింగ్స్ 270 పరుగుల భారీ ఆధిక్యం దక్కడంతో విండీస్ ను టీమిండియా ఫాలో ఆన్ కు ఆహ్వానించింది.   

తొలి రోజు ఓవర్ నైట్ స్కోర్ 318/2తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఇండియా సెకండ్ డే కూడా పూర్తిగా అధిపత్యం చెలాయించింది. రెండో రోజు మరో 200 పరుగులు చేసి రెండో సెషన్‌లో 518/5 స్కోరు వద్ద ఫస్ట్ ఇన్నింగ్స్ డిక్లేర్‌ చేసింది ఇండియా. ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ (175), కెప్టెన్ గిల్ (129 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కగా.. సాయి సుదర్శన్ (87), కేఎల్ రాహుల్ (38), నితీశ్‌కుమార్‌ రెడ్డి (43) రాణించారు. వెస్టిండీస్ బౌలర్లలలో వారికన్‌ 3, రోస్టన్ ఛేజ్ ఒక వికెట్ తీశారు.