ఇప్పుడేం చేద్దాం.. రంగంలోకి విండీస్ బోర్డు

ఇప్పుడేం చేద్దాం.. రంగంలోకి విండీస్ బోర్డు

సొంతగడ్డపై టెస్టు సిరీస్‌‌లో వెస్టిండీస్ అత్యంత దారుణంగా ఆడి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో  విండీస్ క్రికెట్‌‌‌‌ బోర్డు  రంగంలోకి దిగింది. కరీబియన్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ టీమ్‌‌ను మళ్లీ గాడిలో పెట్టేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో విండీస్‌‌‌‌లో క్రికెట్ భవిష్యత్‌‌‌‌ను పునరుద్ధరించేందుకు లెజెండరీ ప్లేయర్లు క్లైవ్‌‌‌‌ లాయిడ్‌‌‌‌, వివ్ రిచర్డ్స్‌‌‌‌, బ్రియాన్‌‌‌‌ లారాతో చర్చలు జరపనుంది. ‘విండీస్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ను బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ ముగ్గురితో చర్చలు జరుపుతాం. ఈ మేరకు ఆహ్వానాలు కూడా పంపాం. 

ఇప్పటికే కమిటీలో ఉన్న చందర్‌‌‌‌పాల్‌‌‌‌, డెస్మండ్‌‌‌‌ హేన్స్‌‌‌‌, ఇయాన్‌‌‌‌ బ్రాడ్‌‌‌‌షాతో కలిసి పని చేస్తారు. విండీస్ స్వర్ణయుగానికి వీళ్లందరూ కారకులు. అందుకే మన క్రికెట్‌‌‌‌ అభివృద్ధి తదుపరి దశను రూపొందించడంలో వాళ్ల ఆలోచనలు కూడా అమూల్యమైనవి. ఈ సమావేశం, స్పష్టమైన ఆచరణీయమైన సిఫారసులకు దారి తీయాలని మేం భావిస్తున్నాం. అందరం కలిసి పని చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఫ్యాన్స్‌‌‌‌, ప్లేయర్లు, కోచ్‌‌‌‌లు, లెజెండ్స్‌, అడ్మినిస్ట్రేటర్లు అడుగు ముందుకేయాల్సిన అవసరం చాలా ఉంది. చాలా పని చేయాల్సి ఉంది. అందరం కలిసి ఓ ఉద్దేశపూర్వకంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి’ అని విండీస్‌‌‌‌ బోర్డు ప్రెసిడెంట్‌‌‌‌ కిశోర్‌‌‌‌ షా వెల్లడించారు. భవిష్యత్‌‌‌‌లో రాబోయే ఫలవంతమైన ఫలితాల కోసం ప్రతి ఒక్కరూ ఓపిక పట్టాలన్నారు. విండీస్‌‌‌‌కు బౌలింగ్‌‌‌‌ గురించి పెద్దగా ఆందోళన లేదన్న షా.. బ్యాటింగ్‌‌‌‌ చాలా మెరుగుపడాలన్నారు.