
- ఫాలో ఆన్‌లో వెస్టిండీస్
- తొలి ఇన్నింగ్స్‌లో 248కే ఆలౌట్
- రెండో ఇన్నింగ్స్‌లో 173/2
- పోరాడుతున్న క్యాంప్‌బెల్, హోప్
న్యూఢిల్లీ: ఇండియాతో రెండో టెస్ట్‌లో వెస్టిండీస్ ఫాలో ఆన్‌లో పడింది. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (5/82) టర్నింగ్ మ్యాజిక్ చేయడంతో.. 140/4 ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం మూడో రోజు ఆట కొనసాగించిన విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 81.5 ఓవర్లలో 248 రన్స్‌కే ఆలౌటైంది. ఫలితంగా 270 రన్స్ లోటుతో ఫాలో ఆన్ మొదలుపెట్టిన కరీబియన్లు ఆట ముగిసే టైమ్‌కు రెండో ఇన్నింగ్స్‌లో 49 ఓవర్లలో 173/2 స్కోరు చేశారు.
జాన్ క్యాంప్‌బెల్ (87 బ్యాటింగ్), షై హోప్ (66 బ్యాటింగ్) దీటుగా పోరాడుతున్నారు. చివరి సెషన్‌లో ఈ ఇద్దరు మూడో వికెట్‌కు 138 రన్స్ జోడించడంతో ఆట నాలుగో రోజుకు వెళ్లింది. ఇన్నింగ్స్ ఓటమిని తప్పించుకోవాలంటే విండీస్ ఇంకా 97 రన్స్ చేయాల్సి ఉంది. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తున్న నేపథ్యంలో నాలుగో రోజే టీమిండియా ఇన్నింగ్స్ విజయం లాంఛనం కానుంది.
పెవిలియన్‌కు క్యూ..
తొలి రెండు సెషన్లలో కుల్దీప్ బంతితో మ్యాజిక్ చేశాడు. స్టార్టింగ్‌లో ఓవర్‌నైట్ బ్యాటర్లు హోప్ (36), ఇమ్లాచ్ (21) చకచకా బౌండ్రీలు బాది ఆధిపత్యం చూపెట్టినా.. తర్వాత కుల్దీప్ టర్నింగ్‌ను అర్థం చేసుకోలేకపోయారు. బౌలింగ్‌కు దిగిన తొలి గంటలోనే కుల్దీప్ డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. వరుస ఓవర్లలో హోప్, ఇమ్లాచ్‌ను ఔట్ చేశాడు. జస్టిన్ గ్రీవ్స్ (17) ఫెయిలయ్యాడు. పియరీ (23) నెమ్మదిగా ఆడినా.. రెండో ఎండ్‌లో సహకారం కరువైంది.
సిరాజ్ (1/16) బాల్‌ను వారికన్ (1) వికెట్ల మీదకు ఆడుకున్నాడు. పియరీకి తోడైన అండర్సన్ ఫిలిప్ (24) కాసేపు పోరాడినా లంచ్ బ్రేక్ తర్వాత బుమ్రా (1/40) అతడిని బౌల్డ్ చేశాడు. జైడెన్ సీల్స్ (13)ను కుల్దీప్ ఎల్బీ చేయడంతో విండీస్‌కు ఫాలో ఆన్ తప్పలేదు.
కీలక భాగస్వామ్యం..
270 రన్స్ లోటుతో విండీస్ ఫాలో ఆన్ మొదలుపెట్టింది. ఓ ఎండ్‌లో క్యాంప్‌బెల్ నిలకడగా ఆడినా.. సిరాజ్ (1/10) బౌలింగ్‌లో తేజ్‌నరైన్ చందర్‌పాల్ (10).. సుందర్ (1/44) ఓవర్లో అథనేజ్ (7)పెవిలియన్ చేరారు. 35/2తో కష్టాల్లో పడిన ఇన్నింగ్స్‌ను క్యాంప్‌బెల్, హోప్ ఆదుకున్నారు. తొలుత డెడ్ డిఫెన్స్‌కు ప్రాధాన్యం ఇచ్చిన వీరిద్దరు తర్వాత బౌండ్రీల వైపు మళ్లారు. ఈ ఇద్దరు 138 రన్స్ జోడించి మరో వికెట్ పడకుండా రోజును ముగించారు.
సంక్షిప్త స్కోర్లు
ఇండియా తొలి ఇన్నింగ్స్: 518/5 డిక్లేర్డ్.
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 81.5 ఓవర్లలో 248 ఆలౌట్ (హోప్ 36, కుల్దీప్ 5/82).
వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్ (ఫాలోఆన్): 49 ఓవర్లలో 173/2 (క్యాంప్‌బెల్ 87*, హోప్ 66*, సిరాజ్ 1/10, సుందర్ 1/44).
దీప్తికి గోల్డ్ మెడల్
పర్వతగిరి, వెలుగు: తెలంగాణ పారా అథ్లెట్ జీవంజి దీప్తి ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో జరుగుతున్న విర్చస్ వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. 400మీటర్ల టి20 కేటగిరీలో ఈ పతకం అందుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో దీప్తి 55.92సెకండ్లతో టాప్ ప్లేస్‌తో పోడియం ఫినిష్ చేసింది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడకు చెందిన దీప్తి వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, మాజీ మంత్రి దయాకర్‌రావు అభినందించారు.