IND vs WI 1st Test: సిరాజ్ విజృంభణ.. తొలి సెషన్‌లోనే సగం విండీస్ జట్టు పెవిలియన్‌కు

IND vs WI 1st Test: సిరాజ్ విజృంభణ.. తొలి సెషన్‌లోనే సగం విండీస్ జట్టు పెవిలియన్‌కు

వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో ఇండియా పై చేయి సాధించింది. తొలి రోజు తొలి సెషన్ లో నాలుగు వికెట్లు తీసి పూర్తి ఆధిపత్యం చూపించింది. గురువారం (అక్టోబర్ 2) అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రారంభమైన ఈ మ్యాచ్ లో సిరాజ్ విజృంభించడంతో పాటు బుమ్రా, కుల్దీప్ రాణించడంతో తొలి సెషన్ లో వెస్టిండీస్ 5 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. క్రీజ్ లో కెప్టెన్ రోస్టన్ చేజ్ (22) ఉన్నాడు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ మూడు వికెట్లు తీసుకున్నాడు. బుమ్రా, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసుకున్నారు. 

సిరాజ్ దూకుడు: 

టాస్ గెలిచిన వెస్టిండీస్ మొదట బ్యాటింగ్ తీసుకోవాలనే నిర్ణయం బెడిసి కొట్టింది. గ్రీన్ వికెట్ పై టీమిండియా పేసర్లు సిరాజ్, బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశారు. టాగెనరైన్ చంద్రపాల్ వికెట్ తీసుకొని సిరాజ్ టీమిండియాకు తొలి వికెట్ అందించాడు. 20 పరుగుల వద్ద జాన్ కాంప్‌బెల్ ను బుమ్రా ఔట్ చేయడంతో విండీస్ రెండో వికెట్ కోల్పోయింది. ఈ దశలో కొన్ని ఓవర్ల పాటు విండీస్ జట్టు సహనంగా ఆడింది. అయితే మహమ్మద్ సిరాజ్ ఈ సారి విండీస్ కు ఊహించని షాక్ ఇచ్చాడు. వరుస ఓవర్లలో బ్రాండన్ కింగ్, అలిక్ అథనాజ్ లను పెవిలియన్ కు పంపి విండీస్ జట్టును కష్టాల్లో పడేశాడు. 

ఆదుకున్న హోప్, ఛేజ్:

39 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన వెస్టిండీస్ జట్టును కెప్టెన్ రోస్టన్ ఛేజ్, షాప్ హోప్ ఆదుకున్నారు. భారత బౌలర్లను సమర్ధవంతంగా అడ్డుకుంటూ పరుగులు రాబట్టారు. 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి పర్వాలేదనిపించారు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లంచ్ బ్రేక్ కు ముందు బిగ్ షాక్ ఇచ్చాడు. మంచి టచ్ లో కనిపించిన షాయ్ హోప్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 90 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది.