విండీస్పై ఐర్లాండ్ సూపర్ విక్టరీ

విండీస్పై ఐర్లాండ్ సూపర్ విక్టరీ

టీ20 వరల్డ్ కప్ నుంచి వెస్టిండీస్ నిష్క్రమించింది. సూపర్ 12కు వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో విండీస్ పసికూన ఐర్లాండ్ చేతిలో ఓడి..ఇంటిదారి పట్టింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో ఐర్లాండ్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించి..సూపర్ 12కు దూసుకెళ్లింది. 

విండీస్ విఫలం..
ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్...20 ఓవర్లలో 5 వికెట్లకు 146 పరుగులే చేసింది. వెస్టిండీస్ ఆటగాళ్లలో బ్రాండన్ కింగ్ 48 బంతుల్లో ఒక సిక్స్, 6 ఫోర్లతో 62 పరుగులు చేయగా...ఓపెనర్  జన్సన్ చార్లెస్ 18 బంతుల్లో సిక్స్, 3 ఫోర్లతో 24 పరుగులు కొట్టాడు. చివరల్లో ఒడియన్ స్మిత్ 12 బంతుల్లో  19 పరుగులు చేశాడు. మిగతా వారు తక్కువ స్కోర్లకే పెవీలియన్ చేరారు. ఐర్లాండ్ బౌలర్లలో గారెత్ డెలానీ 3 వికెట్లు పడగొట్టాడు. సిమి సింగ్, బారీ మెక్‌కార్తీ ఒక్కో వికెట్ తీశారు.

సూపర్ స్టిర్లింగ్..
147 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఐర్లాండ్..17 ఓవర్లలో కేవలం 1 వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ 48 బంతుల్లో 2 సిక్సులు, 6 ఫోర్లతో 66 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతనికి వికెట్ కీపర్ లోర్కాన్ టక్కర్ 35 బంతుల్లో 2 సిక్సులు, 2 ఫోర్లతో 44 పరుగులు చేసి సహకరించాడు. వీరికి తోడు..కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీ 23 బంతుల్లో 3 సిక్స్ లు, 3 ఫోర్లతో 37 పరుగులు చేశాడు. అకెల్ హుస్సేన్ ఒక వికెట్ పడగొట్టాడు.

విండీస్ ఇంటికి..ఐర్లాండ్ సూపర్ 12కు...
టీ20 వరల్డ్ కప్ గ్రూప్ దశలో భాగంగా..గ్రూప్ ఏ నుంచి..ఇప్పటికే శ్రీలంక, నెదర్లాండ్స్ సూపర్ 12కు వెళ్లాయి. ఇక గ్రూప్ బీ నుంచి..విండీస్పై గెలిచిన ఐర్లాండ్ సూపర్ 12కు చేరుకుంది.  స్కాట్లాండ్, జింబాబ్వే మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుందో..ఆ జట్టు సూపర్ 12కు వెళ్తుంది.