
టీ20 వరల్డ్ కప్ ముంగిట టీమిండియా ఘోరంగా ఓడిపోయింది. వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో జరిగిన రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత జట్టు పరాజయం చవిచూసింది. 169 పరుగుల టార్గెట్ను ఛేదించలేక..36 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మొదటి ప్రాక్టీస్ మ్యాచ్లో గెలిచిన..టీమిండియా..రెండో ప్రాక్టీస్ మ్యాచ్లో మాత్రం ఓటమిచెందింది.
ఉతికారేసిన నిక్ హబ్సన్
ముందు బ్యాటింగ్ చేసిన వెస్ట్రన్ ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 168 పరుగులు చేసింది. 15 పరుగుల వద్ద ఓపెనర్ జోస్ ఫిలిప్‌ను అర్షదీప్ ఔట్ చేశాడు. అయితే ఆ తర్వాత వచ్చిన నిక్ హబ్సన్, డీఆర్సీ షార్ట్ భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఇద్దరు రెండో వికెట్కు 110 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. 125 వద్ద హబ్సన్‌ను హర్షల్ పెవీలియన్ చేర్చగా..127 పరుగల వద్ద డీఆర్సీ షార్ట్ రనౌట్‌గా వెనుదిరిగాడు. భారత బౌలర్లలో అశ్విన్ 3 వికెట్లు పడగొట్టాడు.
తడబడిన భారత్..
169 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన భారత బ్యాట్స్మన్ విఫలమయ్యారు. కెప్టెన్ కేఎల్ రాహుల్ ఒక్కడే 55 బంతుల్లో 74 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్య 17పరుగులతో పర్వాలేదనిపించాడు. రిషభ్ పంత్ 9 పరుగులు, దీపక్ హుడా 6 పరుగులు, అక్షర్ పటేల్ 2 పరుగులు మాత్రమే చేశాడు. దినేశ్ కార్తీక్ (10), హర్షల్ పటేల్ (2) సైతం విఫలమయ్యారు. దీంతో టీమిండియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 138 పరుగులే చేసి ఓడిపోయింది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ చేసినప్పటికీ బ్యాటింగ్‌కు రాలేదు.