వెస్టిండీస్ హెడ్ కోచ్ ఫిల్ సిమన్స్ రాజీనామా

వెస్టిండీస్ హెడ్ కోచ్  ఫిల్ సిమన్స్ రాజీనామా

ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ జట్టు క్వాలిఫయింగ్ దశలోనే వెనుదిరగడం పై అభిమానులు ఆగ్రహంతో ఉన్నారు.  ఈ క్రమంలో ఆ జట్టు హెడ్ కోచ్ ఫిల్ సిమన్స్ తన పదవికి రాజీనామా చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయాన్ని విండీస్‌ క్రికెట్‌ బోర్డు కూడా తెలిపింది.  నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 వరకు ఆస్ట్రేలియాతో జరగబోయే రెండు- టెస్టుల సిరీస్ అనంతరం కోచ్ పదవి నుంచి సిమన్స్ తప్పుకోనున్నాడు. 

"ఈ ఓటమి కేవలం జట్టును  మాత్రమే కాదు..దేశాన్ని కూడా బాధపెడుతుందని భావిస్తున్నాను. మేము ఈ టోర్నీలో మా స్థాయికి తగ్గట్టు రాణించలేదు. ఇందుకు కరీబియన్‌ అభిమానులకు, మద్దతుదారులకు క్షమాపణలు కోరుతున్నాను" అని ఫిల్ సిమన్స్ ఒక ప్రకటనలో వెల్లడించాడు. జట్టు కెప్టెన్ నికోలస్ పూరన్‌ను కూడా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  

ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ జట్టు దారుణంగా విఫలమైంది.ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌ లాంటి పసికూనల చేతిలో ఓటమిపాలైంది. జింబాబ్వే  పై 31 పరుగుల తేడాతో  గెలిచి గ్రూప్ Bలో నాలుగో స్థానంలో నిలిచింది.