గోండా: స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్, ఇండియా రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) మధ్య వివాదం మరోసారి ముదిరింది. సమాఖ్య నిషేధాన్ని ధిక్కరిస్తూ సోమవారం ప్రారంభమైన నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నీలో బరిలోకి దిగేందుకు వినేశ్ గ్రౌండ్‌కు చేరుకుంది. కానీ ఆమెను బరిలోకి దిగకుండా డబ్ల్యూఎఫ్‌ఐ అడ్డుకోవడం వివాదం మళ్లీ మొదలైంది. తాను రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్నానని, పోటీల్లో పాల్గొనేందుకు తనకు అర్హత ఉందని వినేశ్ స్పష్టం చేసినా.. డబ్ల్యూఎఫ్‌ఐ వెనక్కి తగ్గలేదు. క్రమశిక్షణా చర్యలు పూర్తయ్యేవరకు వినేశ్‌ను బరిలోకి దిగనిచ్చే ప్రసక్తే లేదని సమాఖ్య స్పష్టం చేసింది.
దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపిన వినేశ్.. సన్యాసం తీసుకుని ఆటకు దూరంగా ఉండాలా? అంటూ డబ్ల్యూఎఫ్‌ఐ అధికారులపై విరుచుకుపడింది. ‘నేను ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారు. సన్యాసం తీసుకోవాలా? ఓటమిని అంగీకరించాలా? నాపై జరుగుతున్న కుట్రలు విజయవంతం కావాలని మీరు ఆశిస్తున్నారా’ అని వినేశ్ ప్రశ్నించింది.
తాను రీ ఎంట్రీ ఇస్తున్నట్లు గత డిసెంబర్‌లోనే సమాఖ్యకు సమాచారం ఇచ్చానని, పోటీలకు రెండు రోజుల ముందర నోటీసులు ఇవ్వడం వెనక ఆంతర్యమేమిటని నిలదీసింది. దీనిపై స్పందించిన సమాఖ్య అధికారులు.. వినేశ్ ఇచ్చిన ప్రాథమిక సమాచారం సరిగా లేదని వెల్లడించారు. కేవలం అర్హత గురించి మాత్రమే కాకుండా క్రమశిక్షణారాహిత్యం, డోపింగ్ రూల్స్ ఉల్లంఘన వంటి అంశాలపై పూర్తి వివరణ ఇవ్వాలని కోరారు.
