పరిహారం లెక్క తేల్చాకే భూముల్లో అడుగుపెట్టాలె

పరిహారం లెక్క తేల్చాకే భూముల్లో అడుగుపెట్టాలె

ఆఫీసర్లతో నిర్వాసితుల వాగ్వాదం

వెల్గటూర్​లో కాళేశ్వరం పంప్ హౌస్ భూ సర్వేకు వచ్చిన ఆడిషినల్ కలెక్టర్

వెల్గటూర్, వెలుగు: పరిహారం ఎంతో నిర్ణయించకుండా  భూములు ఎలా సర్వే చేస్తారని కాళేశ్వరం లింక్ 2 భూ నిర్వాసితులు ఆఫీసర్లతో వాగ్వాదానికి దిగారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం లో నిర్మిస్తున్న లింక్ 2 పంప్ హౌస్ కోసం చేపట్టిన భూ సేకరణ సర్వేలో సోమవారం ఆడిషనల్ కలెక్టర్ రాజేశం, ఆర్డీవో మాధురి, మేఘ ఇంజనీర్లు.. అవార్డ్ ఇన్స్ పెక్షన్ కి రావడంతో రైతులు వాగ్వాదానికి దిగారు. తిరిగి వెళ్లిపోవాలంటూ అధికారులపై మండిపడ్డారు. ప్రాజెక్టు కింద భూములు పోతే తాము బతుకుడెట్ల అని ప్రశ్నించారు. అడిషనల్ కలెక్టర్ నచ్చజెప్పినా వినిపించుకోలేదు. ఇప్పటికే ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద భూములు కోల్పోయి నష్టపోయామని, మరోసారి కోల్పోతే మా కుటుంబాలు రోడ్డున పడుతాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. భూమికి బదులు భూమివ్వాలని, లేదంటే ఎకరానికి రూ.30 లక్షలు పరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.