సీక్రెట్ కెమెరాలపై ఏం చర్యలు తీసుకున్నరు?..ప్రభుత్వాన్ని వివరణ కోరిన హైకోర్టు

సీక్రెట్ కెమెరాలపై ఏం చర్యలు తీసుకున్నరు?..ప్రభుత్వాన్ని వివరణ కోరిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: హోటళ్లు, టాయిలెట్స్, లేడీస్​హాస్టల్స్‌‌‌‌, షాపుల్లో రహస్య కెమెరాలు ఏర్పాటు చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రహస్య కెమెరాలు వారి గోప్యతకు భంగం కలిగిస్తున్నాయని పేర్కొంది. మహిళా భద్రతా విభాగం రహస్య కెమెరాల విషయంలో గత మార్చి 29న జారీ చేసిన సర్క్యులర్‌‌‌‌ అమలుకు తీసుకున్న చర్యలను వివరించాలని సూచించింది. సర్క్యులర్‌‌‌‌ అమలుకు చర్యలు తీసుకోవాలంటూ జులై 10న ఇచ్చిన వినతిపత్రంపై మహిళా భద్రతా విభాగం అదనపు డీజీపీ చర్యలు తీసుకోలేదని హైదరాబాద్​ హెవెన్ హోం సొసైటీ అధ్యక్షురాలు జి. వరలక్ష్మి వేసిన పిటిషన్‌‌‌‌ను హైకోర్టు సోమవారం విచారించింది. 

న్యాయవాది పి శ్రీరమ్య వాదిస్తూ, రహస్య కెమెరాల విచ్చలవిడి వినియోగం వల్ల దుర్వినియోగం అవుతున్నాయన్నారు. కెమెరాలను విక్రయించే డీలర్లు దుకాణాల్లో హెచ్చరిక బోర్డులు పెట్టాలని సర్క్యులర్‌‌‌‌ ఉన్నా.. అమలు కావడం లేదన్నారు. షాపులు, మాల్స్‌‌‌‌లో దుస్తులు మార్చుకునే గదులు, వాష్‌‌‌‌రూమ్స్, టాయిలెట్స్‌‌‌‌లో కెమెరాలు ఏర్పాటు చేస్తే.. మూడేండ్ల జైలు శిక్ష, రూ.2 లక్షల వరకు జరిమానా విధించేందుకు వీలుందన్నారు. దుకాణాలు, మాల్స్​ను తనిఖీ చేసి నిర్దేశిత ఫారంలో ఎలాంటి రహస్య కెమెరాలు లేవని అధికారులు ఆరు నెలలకోసారి ధ్రువీకరణ చేయాలన్న నిబంధన కూడా అమలు కావడం లేదన్నారు.