అమెరికా అధ్యక్షుడు బైడెన్ కు అగ్ని పరీక్షగా మధ్యంతర ఎన్నికలు

అమెరికా అధ్యక్షుడు బైడెన్ కు అగ్ని పరీక్షగా మధ్యంతర ఎన్నికలు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నాలుగేళ్ల పదవీకాలంలో రెండేళ్లు పూర్తయ్యాయి. దీంతో ఇవాళ మధ్యంతర ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఇందులో వచ్చే ఫలితాలు అత్యంత కీలకంగా మారనున్నాయి. ఈ ఫలితాల ప్రభావం ప్రస్తుత అధ్యక్షుడు, డెమొక్రటిక్ పార్టీ నేత బైడెన్ మిగిలిన రెండేళ్ల పదవీ కాలంపై పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు మధ్యంతర ఎన్నికలను మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా సీరియస్ తీసుకున్నారు. 2024 అధ్యక్ష ఎన్నికలపై గంపెడు ఆశలు పెట్టుకున్న ట్రంప్.. మధ్యంతర ఎన్నికల కోసం జోరుగా ప్రచారం చేశారు. జో బైడెన్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు. దీంతో అమెరికా రాజకీయం రంజుగా మారింది. ఈ మధ్యంతర ఎన్నికలు అధ్యక్షుడు జో బైడెన్‌తో పాటు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అగ్ని పరీక్షగా మారాయి. ఈ ఎన్నికల ఫలితాలు 2024లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు అభ్యర్థిని నిర్ణయిస్తాయి.

 

మధ్యంతర ఎన్నిక.. ఎందుకు.. ఏమిటి ?  

అమెరికా అధ్యక్షుడి పదవీ కాలం నాలుగేళ్లు. పదవీ కాలంలో రెండేళ్లు (సగం) పూర్తి కాగానే.. అమెరికా కాంగ్రెస్‌ (పార్లమెంటు) కు ఎన్నికలు జరుగుతాయి. అందుకే వీటిని మధ్యంతర ఎన్నికలు అంటారు. అమెరికా కాంగ్రెస్‌లో 2 సభలు ఉంటాయి. అవి హౌజ్‌ ఆఫ్‌  రిప్రజెంటేటివ్స్, సెనేట్‌. ఈ రెండింటిలో కలుపుకొని దాదాపు 500 స్థానాలకు 1,200 మందికి పైగా అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 500 స్థానాల్లో 435 హౌజ్‌ ఆఫ్‌  రిప్రజెంటేటివ్స్, 35 అమెరికా సెనేట్, 36 అమెరికా గవర్నర్ షిప్ లకు సంబంధించినవి ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఈ రెండు సభల్లో డెమోక్రాట్‌లకే మెజారిటీ ఉంది. ఈ మధ్యంతర ఎన్నిక అనేది అమెరికా కాంగ్రెస్ ను ఏ పార్టీ శాసించాలనేది నిర్ణయిస్తుంది. కాంగ్రెస్ పై పట్టు సాధించే పార్టీయే అమెరికాలో  సమాఖ్య చట్టాలను రూపొందించడం, చర్చించడం, ఆమోదించడం వంటి బాధ్యతలను కలిగి ఉంటుంది. మధ్యంతర ఎన్నికను అమెరికా అధ్యక్షుడి మొదటి రెండు సంవత్సరాల పనితీరుపై ప్రజాభిప్రాయ సేకరణగా పరిగణిస్తుంటారు. 

ఫలితాలు ఎప్పుడంటే.. 

ఓట్లను ఎప్పుడు, ఎలా లెక్కించాలనే విషయంలో అమెరికాలో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కో నియమం ఉంటుంది. కొన్ని రాష్ట్రాల ఫలితాలు బుధవారం రాత్రి 11 గంటల్లోగా వచ్చే చాన్స్ ఉంది.  పెన్సిల్వేనియా, జార్జియా వంటి రాష్ట్రాల్లో రిజల్ట్ రావడానికి కొన్ని రోజుల టైం పట్టొచ్చు.  ఈ మధ్యంతర ఎన్నిక కోసం ఇప్పటికే దాదాపు 3.88 కోట్ల మంది అమెరికన్లు వ్యక్తిగతంగా లేదా మెయిల్ ద్వారా బ్యాలెట్‌లు వేశారు.

బైడెన్ ఓడిపోతే ?

ఈ మధ్యంతర ఎన్నికలలో అమెరికా ఆర్థిక వ్యవస్థను ఆవరించిన మందగమనం అనేది ముఖ్య అంశంగా మారింది. అమెరికాలో ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకోవడాన్ని ప్రజలు తీవ్రంగా  పరిగణిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతే.. అధ్యక్షుడు జో బైడెన్ పదవికి వచ్చిన ఇబ్బందేమీ లేదు. కానీ 2024 అధ్యక్ష ఎన్నికలపై ఈ ఫలితం నేరుగా ప్రభావం చూపుతుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థలోని మందగమనం తనకు ఈ మధ్యంతర ఎన్నికల్లో కలిసి వస్తుందని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  ధీమాగా ఉన్నారు.