ప్రత్యర్థి పార్టీ లీడర్లను మయన్మార్ ప్రభుత్వం ఏం చేసిందంటే..

ప్రత్యర్థి పార్టీ లీడర్లను మయన్మార్ ప్రభుత్వం ఏం చేసిందంటే..
  • మరో ముగ్గురు ప్రత్యర్థి పార్టీల నేతలకూ ఉరి శిక్ష
  • టెర్రరిస్టు చర్యలకు పాల్పడినందుకే శిక్షించామని ఆ దేశ ప్రభుత్వ మీడియా వెల్లడి
  • గత 50 ఏళ్లలో ఇంతమందిని ఉరితీయడం ఇదే మొదటిసారి

బ్యాంకాక్​: మయన్మార్​లో నేషనల్​ లీగ్​ ఫర్​ డెమోక్రసీ(ఎన్​ఎల్డీ) మాజీ నేత, సామాజిక కార్యకర్త పయో జియాతో పాటు మరో ముగ్గురు సామాజిక కార్యకర్తలను మయన్మార్​ప్రభుత్వం ఉరితీసింది. ఈ విషయాన్ని ఆ దేశ ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. వారు చట్టవ్యతిరేక కార్యకలాపాలతో పాటు టెర్రరిస్టు చర్యలకు పాల్పడ్డారని, అందుకే వారిని ఉరితీశామని పేర్కొంది. గత 50 ఏళ్లలో ఇంతమంది సామాజిక కార్యకర్తలను ఉరితీయడం ఇదే మొదటిసారి.

ఆంగ్ సాన్​సూకీ పార్టీ ఎన్​ఎల్డీకి చెందిన పయో జియా వివిధ పేలుడు పదార్థాలను కలిగి ఉన్నారని, అంతేకాకుండా యంగూన్​లో ప్రజలను రెచ్చగొట్టి హింసాత్మక చర్యలకు పాల్పడ్డారని మయన్మార్​ మిలిటరీ ప్రభుత్వం పేర్కొంది. హిప్​ హాప్​ మ్యూజిషియన్​ అయిన జియా.. విదేశీ కరెన్సీని కలిగి ఉన్నారన్న ఆరోపణలపై 2008లో జైలుకు వెళ్లారు. ఇక మిలిటరీ ప్రభుత్వం ఉరితీసిన మిగతా వారిలో క్యావ్​మిన్​యు(53), లా మయో ఆంగ్​, ఆంగ్​థురా జా ఉన్నారు.

క్యావ్​మిన్​యు కూడా సామాజిక కార్యకర్త. మిలిటరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1988లో ‘88 జనరేషన్ ​స్టూడెంట్స్​గ్రూప్’ లేవదీసిన ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. ఆ గ్రూప్​లోని ప్రధాన లీడర్లలో ఆయన ఒకరు. వివిధ ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు ఆయన 12 ఏళ్లు జైలుశిక్ష అనుభవించారు. మళ్లీ నిరుడు అక్టోబరులో కూడా అరెస్టయ్యారు.

అర్బన్ ​గెరిల్లా దాడులు నిర్వహించేందుకు మూన్​లైట్​ ఆపరేషన్ ​అనే గ్రూప్​కు నాయకత్వం వహించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఇక మిగిలిన ఇద్దరు లా మయో ఆంగ్, ఆంగ్​థురా జా 2021 మార్చిలో ఓ మహిళను మిలిటరీ ఇన్ఫార్మర్​గా అనుమానించి చంపేశారు. ఈ కేసులో వారు దోషులుగా తేలారు. అయితే ఆ నలుగురినీ ఎప్పుడు ఉరితీశారో మయన్మార్​ మిలిటరీ ప్రభుత్వం వెల్లడించలేదు.