ఏం సాధించారని దీక్షాదివస్‌‌ ?..తెలంగాణ రాకుంటే కేసీఆర్‌‌, కేటీఆర్‌‌, హరీశ్‌‌కు పదవులు దక్కేవా ?

ఏం సాధించారని దీక్షాదివస్‌‌ ?..తెలంగాణ రాకుంటే కేసీఆర్‌‌, కేటీఆర్‌‌, హరీశ్‌‌కు పదవులు దక్కేవా ?
  •     టీపీసీసీ చీఫ్​ మహేశ్‌‌కుమార్‌‌ గౌడ్‌‌

నిజామాబాద్, వెలుగు : బీఆర్‌‌ఎస్‌‌ నాయకులు ఏం సాధించారని దీక్షా దివస్‌‌ నిర్వహిస్తున్నారని టీపీసీసీ చీఫ్‌‌ మహేశ్‌‌కుమార్‌‌గౌడ్‌‌ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సాధన పేరుతో కేసీఆర్‌‌ చేసిన ఆమరణ దీక్ష అనేక అనుమానాలు రేకెత్తించిందన్నారు. 

విద్యార్థులు, యువత అందరూ కలిసి తెలంగాణ కోసం ఉద్యమించగా.. ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని గుర్తు చేశారు. నిజామాబాద్‌‌ డీసీసీ ప్రెసిడెంట్‌‌గా కాటిపల్లి నగేశ్‌‌రెడ్డి, నగర అధ్యక్షుడిగా బొబ్బలి రామకృష్ణ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి మహేశ్‌‌కుమార్‌‌గౌడ్‌‌ హాజరై మాట్లాడారు. 

సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే... కేసీఆర్‌‌ సీఎం, కేటీఆర్​, హరీశ్‌‌రావు మంత్రులు అయ్యేవారా ? అంబాసిడర్‌‌ కార్లలో తిరిగే వారు.. ఇంపోర్టెడ్‌‌ కార్లలోకి మారేవారా ? అని ప్రశ్నించారు. బీఆర్‌‌ఎస్‌‌ పని అయిపోయిందని, ఈ విషయం జూబ్లీహిల్స్‌‌ ఎన్నికల్లోనే తేలిపోయిందన్నారు. కులాలు, మతాలతో రాజకీయాలు చేసే బీజేపీకి డిపాజిట్‌‌ కూడా దక్కలేదన్నారు. 

కాంగ్రెస్‌‌ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో దేశమంతా తెలంగాణ వైపు చూస్తోందన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్‌‌రెడ్డి, షబ్బీర్​అలీ, కార్పొరేషన్‌‌ చైర్మన్లు మానాల మోహన్‌‌రెడ్డి, తాహెర్, మాజీమంత్రి మండవ వెంకటేశ్వర్‌‌రావు, మాజీ ఎమ్మెల్సీలు ఆకుల లలిత, అరికెల నర్సారెడ్డి, అంతిరెడ్డి రాజిరెడ్డి, మాజీ మేయర్‌‌ ధర్మపురి సంజయ్‌‌ పాల్గొన్నారు.