వెలుగు ఓపెన్ పేజీ: వికసిత్ భారత్ అంటే ఏంది?

వెలుగు ఓపెన్ పేజీ:  వికసిత్ భారత్ అంటే ఏంది?

ఈ మధ్యకాలంలో  కేంద్ర ప్రభుత్వం ఏ పథకం పేరుపెట్టినా దాని మొదలు వికసిత్​ భారత్​ అని హిందీలో తగిలిస్తోంది. అలా అంటే  ఏందో ప్రజలకు, ముఖ్యంగా సౌత్​ ఇండియా ప్రజలకు అర్థమౌతుందా లేదా అనేది వాళ్లకి అనవసరం.  ఒక్క తమిళనాడు  ప్రభుత్వం తప్ప మరే  సౌత్​ ఇండియా ప్రభుత్వంగాని,  బెంగాల్,  అస్సాం,  ఒరిస్సా,  నార్త్​ ఈస్ట్​  ప్రభుత్వాలుకాని  ప్రొటెస్ట్​ చేస్తున్న దాఖలాలు లేవు.  

కేంద్ర ప్రభుత్వం ఇంగ్లిష్​ వ్యతిరేకత ఒక అంశమైతే,  వాళ్లు  చేస్తున్న  ప్రతి చట్టానికి  వికసిత్​ భారత్​ తగిలిస్తుండటం మరో అంశం.  ఈ మధ్యకాలంలో  ‘మనరేగా’ చట్టాన్ని మార్చి వికసిత్​ భారత్​ రోజ్​గార్​ అండ్​ అజీవిక మిషన్​ గ్రామీణ్​ అని పెట్టారు. షార్ట్​ఫామ్​లో  ‘వీబీ జీ రామ్​జీ’ చట్టం అంటున్నారు.  వికసిత్​ అంటే ఏఐ మీనింగ్  డెవలప్డ్,  అడ్వాన్స్డ్,  గ్రోన్​ ఆర్ ​ఫ్లోరిష్డ్​.  కేంద్ర ప్రభుత్వం ఇదే  మీనింగ్​తో  వాడుతుందా  లేక  వాజ్ పేయి ప్రభుత్వం 2004  ఎన్నికల్లో  ఇచ్చిన నినాదం ‘ఇండియా షైనింగ్’.  

మోదీ ప్రభుత్వం కూడా ఇండియా షైనింగ్​ అర్థంలో వాడుతోందా? 

మనం ఏఐ ఇచ్చే అర్థాలనే తీసుకుంటే భారత్​ అభివృద్ధి అయి ఉంటే  ఉపాధిని  ప్రజలకు ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం ఏంటి?  అజీవిక అంటే  ఏఐ  మీనింగ్​  లైవిలీహుడ్,  సస్టైనన్స్.. అంటే ప్రజలు జీవించడానికి ప్రభుత్వం ఇచ్చే సహాయం.  ఈ సహాయం లేకపోతే  వేలాది  లేదా లక్షలాది ప్రజలు చనిపోవచ్చు. ఈ స్థితి వికసిత్​ ప్రతిబింబిస్తుందా లేదా వెనుకబాటుతనాన్ని,  అభివృద్ధి చెందని లక్షణాన్ని సూచిస్తుందా?

బీజేపీ, ఆర్ఎస్ఎస్ అధికారంలో ఉంటేనే వికసితా?

అబద్ధ సిద్ధాంతాలు చెప్పడానికి కూడా ఒక పరిమితి ఉండాలి.  ప్రపంచం ఇలా మాట్లాడడాన్ని ఏమనుకుంటుందనే ఆలోచన కూడా ఉండకపోతే  దేశం నవ్వులపాలు కాకపోతే ఏమౌతుంది? 2004లో ఇండియా షైన్​ అవుతుందంటే   ప్రజలు  నవ్వారు.  ఓట్లు వేశారా?  వేయలేదా  అనేది  వేరే అంశం.  బీదరికంలో  కోట్లకొద్దీ జనం తలకిందులవుతుంటే వారికి ఉచితంగా  బతుకుతెరువు కలిపించే  చట్టానికి  వికసిత్ ​భారత్​ అని పేరుపెడితే ప్రపంచం  మనల్ని ఏమనుకోవాలి?  వికసితానికి ఇంకో అర్థం కూడా ఉంది. 

అభివృద్ధి చెందిందని  చెప్పి  దానిలోని వనరులన్నీ ఇప్పటికే విపరీతంగా అభివృద్ధి చెందిన పెట్టుబడిదారులకు దేశ వనరులను కట్టబెట్టడం. కేంద్ర బడ్జెట్లో ఎక్కువ శాతం ఆ పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టి  మీరే లాభాలు సంపాదించుకోండి, మీరే అభివృద్ధికండి అని చెప్పడం, దేశంలోని అతి బీద ప్రజలకు కొంత భిక్ష వేయండి అని చెప్పడం. ఇప్పుడు జరుగుతున్నది అదే.  వ్యవసాయం రంగంలో పనిచేసే కూలీల జీవితం గడవడం లేదని వారికి ఒక 100 రోజులు అతి కొద్ది కూలీతో  పనిఇస్తే  దాన్ని  వికసిత్​  అంటారా?

నాలుగు ట్రిలియన్​ డాలర్ల​ ఎకానమీ ఎప్పడయ్యాం

వికసిత్​ భారత్​ నినాదంలో  భాగంగా రోజువారీ  బీజేపీ నాయకులు భారత్​ నాలుగు ట్రిలియన్​ డాలర్ల​ ఎకానమీ అయిందని,  ప్రపంచ దేశాల్లో  మనది  మూడో  అతిపెద్ద  ఎకానమీ  అని  పదేపదే  చెబుతున్నారు.  మరోవైపు  ఆర్థిక శాస్త్రవేత్తలు  భారత్​ ఆర్థిక వ్యవస్థ అంత ఆరోగ్యకరంగా లేదని,  నిరుద్యోగం ఎప్పుడూ  లేనంత  ఎక్కువగా ఉన్నదని  చెబుతున్నారు.  అమెరికా  విధిస్తున్న టారిఫ్​ల వల్ల  ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుందని,  అందువల్లే  ట్రంప్​ను  భారత ప్రభుత్వం  నిలదీయలేకపోతున్నదని  చెబుతున్నారు.  ఒక దేశ  ఆర్థిక వ్యవస్థ పట్ల ఎవరు అధికారంలో ఉన్నా కచ్చితమైన  అంచనా అవసరం.  

ఏ రంగం అభివృద్ధి చెందుతుంది?  ఏ రంగం కుంటుపడి ఉంది? ఏ రంగంలో  ఇన్వెస్ట్​మెంట్​  పెంచితే  వ్యవస్థ  కుంటుబాటుతనం  మారుతుంది?  ఈ మొత్తం  అంచనాలో  అతి బీదరికంలో  కొట్టుమిట్టాడుతున్న  కోట్లాది ప్రజల జీవితాలను  మార్చడానికి  ప్రజాస్వామ్యంలో  వెల్ఫేర్​ వ్యవస్థ ఉనికిలోకి వచ్చింది.  ప్రపంచ దేశాలన్నిటిలో వెల్ఫేర్​ ఎకానమీ ఉనికిలో ఉన్నది.  అయితే,  అభివృద్ధి చెందిన దేశాల్లో అది సౌకర్యాలను పెంచడానికి ఉపయోగిస్తారు. ​ వెనుకబడిన దేశాల్లో  ప్రజలకి తిండి, గుడ్డ, ఇల్లు, తాగునీరు, కనీస మెడికల్​  ఫెసిలిటీస్, ఉచిత విద్య మీద ఖర్చుచేసేది  మేం అభివృద్ధి చెందామని చెప్పడానికి కాదు.  

ముఖ్యంగా ప్రజల అవసరాలను తీర్చడానికి.  ఈ రంగాల్లో ఖర్చుపెట్టే పథకాల పేర్లు గొప్పలు చెప్పుకోవడానికి వాడుకుంటే బయట దేశాల నుంచి  మనకు అందాల్సిన  అన్నిరకాల  సహాయాలను ఆపుకోవడమే.  మనదేశం  విదేశాల  నుంచి  విమానాలు  కొనుగోలు చేస్తూ  వాటికి  పుష్పక  విమానాలని  పేరుపెట్టి  మనం విమానాలు  తయారుచేసే స్థాయికి ఎదిగామంటే ఎట్లా?   కట్టుకథను  చరిత్ర  చేస్తే ఎట్లా?

ఈ పేర్లు,  ప్రోపగాండా చేసేది  మంత్రులు కాదు 

ఇవన్నీ   ప్రభుత్వం బయట ఉన్న  ఆర్ఎస్ఎస్​ మేధావుల నుంచి వస్తున్న పాలసీలు.  ఇవన్నీ నరేంద్ర మోదీ స్వయంగా పెడతాడనే ప్రచారం ఉంది.  కానీ, ఈ ప్రభుత్వం మోదీనే  అంటున్నట్లు డబుల్​ ఇంజిన్​ ప్రభుత్వం.  ఒక ఇంజిన్​ ఆర్ఎస్ఎస్​ నడుపుతోంది.  రెండో  ఇంజిన్ ​ప్రభుత్వం నడుపుతోంది.  అయితే,  ఆర్ఎస్ఎస్​దే  అసలు నిర్ణయం.  వీరుచేసే  నిర్ణయాలు కేబినెట్​కు, సెక్రటేరియట్ బయట జరుగుతాయి.  అందుకే  ప్రతిదానికి ఒక సనాతన, సంస్కృత  సంబంధిత పేరు.  ఆ పేరుకు తగ్గ  కార్యక్రమం ఉంటుంది.  

అయితే,  వీటిపైన  ప్రజలకు  అనుమానాలు  వస్తలేవా  అంటే  అసలు అనుమానాలకు తావిచ్చే ఆలోచనే  ప్రజల్లో ఉండకూడదనేది వారి సిద్ధాంతం.  దాన్నే సనాతన ధర్మం అంటారు.  దాన్ని మతంతో ముడివేసి  హేతుబద్ధత లేని  మత గ్రంథాలతో  ముడి వేస్తారు.  ఉత్పత్తి  జరిగేది  సైన్సుతో  ముడిపడి ఉన్న ఆలోచనతో  కనుక  వీరి  సిద్ధాంతాల్లో  మనం ఎక్కడా ఉత్పత్తికి  ప్రాధాన్యత ఇచ్చే ఆలోచనలు, పాలసీలు చూడలేం.  

‘మనరేగా’ మార్పుపై  తిరగబడితే ఈ పద్ధతి మారుతుంది

‘మనరేగా’ చట్టాన్ని మార్చి  మన  ప్రజల  జీవన ,ధార..దాని పేరుతోపాటు ఆ  వ్యవస్థనంతా  మార్చారు.  బీజేపీ, ఆర్ఎస్ఎస్​ ప్రభుత్వానికి  గ్రామీణ ప్రజలపై ఎప్పుడూ అభిమానం లేదు.  ఆ  నిర్మాణాలు దశాబ్దాలుగా  పట్టణ ప్రాంతాల్లో  మాత్రమే  పనిచేశాయి.  ఇప్పుడు  ఉత్తర  భారతదేశంలో  గ్రామాలకు  విస్తరించాయి.  కానీ,  అవగాహనరీత్యా వాళ్లు.. మతం, బిజినెస్​  చుట్టే తిరుగుతారు.  

అక్కడి నుంచే ఆ సంస్థలకు ఆదాయం కూడా వస్తుంది. అందువల్ల  కరోనా  కాలంలో  ప్రజలు  ముఖ్యంగా  గ్రామీణ  ప్రజలకు ఆక్సిజన్​లాగ  పనిచేసిన  పథకాన్ని  పేరు,  రూపం మారి  క్రమంగా  దాన్ని  మూసేయాలనేది  వారి  ఆలోచన.  గ్రామాలు ఏమైనా వారికి పట్టింపు ఉండదు.  దేశంలోని  ప్రతిపక్ష  పార్టీలన్నీ,  ముఖ్యంగా  కాంగ్రెస్​ ఇదే అంశంపై  ఒక  జాతీయస్థాయి ఉద్యమాన్ని  నిర్మించాల్సి ఉంది. 

 గ్రామీణ బీద ప్రజలు  దీని  అవసరాన్ని గుర్తించి ఉన్నారు  కనుక వారి జీవిత  వనరు  పోతే  ప్రజలు కదిలే అవకాశం ఉంది.   ప్రాంతీయ పార్టీలు ఈ అంశంపైన పెద్ద శ్రద్ధ  చూపిన  స్థితి  కనిపించడం లేదు.  కానీ,  ఇది  ప్రజాజీవనానికి  సంబంధించిన  అంశం.  ఇది  ప్రతిపక్ష  పార్టీల  ఐక్యతకు  బలాన్ని కూడా ఇస్తుంది. 

మతపర సెంటిమెంటు

ప్రతిదాన్ని  మతపర సెంటిమెంటు చుట్టూ తిప్పుతారు  కనుక  ప్రజలు బానిసత్వంలోకి జారిపోతారు.  దీనికి వారు  జోడించే  మరో  అంశం ఏ పేరును  ఇంగ్లిషులో ఉండనీయకూడదని.  ఇంగ్లిషులో ఉంటే  చట్టాలపైన  అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది.  విమర్శలు వస్తాయి.  కానీ,  సంస్కృతం  లేదా  హిందీలో  పేర్లు పెడితే  అదొక  భారతీయత అని  ప్రజలు భ్రమిస్తారు.  కొన్ని భాషలకు  మనుషుల్ని  భ్రమల్లోకి  నెట్టే శక్తి  ఎక్కువ ఉంటుంది.  కొన్ని భాషలకు  సైన్సుపర  ఆలోచనలను  
పెంచే శక్తి  ఎక్కువ ఉంటుంది.  

సంస్కృతం,  హిందీ  భాషలకు భ్రమలోకి  నెట్టే శక్తి ఉంటే ఇంగ్లిషుకి  సైన్సును  అభివృద్ధి చేసే  శక్తి  ఎక్కువ ఉంటుంది.  అందుకే సైన్స్​ ఇంగ్లిషు భాష మాట  విదేశాల్లో  ఎక్కువ  అభివృద్ధి  అవుతుంది.  ఇది  ఆర్ఎస్ఎస్​  మేధావులకు  తెలవదా  అంటే  తెలుసు.  కానీ,  వారి లక్ష్యం సైన్స్​ అభివృద్ధి కాకుండా  దేశాన్ని  భ్రమలో ఉంచడమే.  ఈ  రెండు  ఇంజిన్ల  ప్రభుత్వం  ప్రజాస్వామిక  వ్యవస్థను  ప్రజాస్వామ్యంగా  నడువనివ్వదు.  అది మతరూపంలోకి  మారుస్తుంది. కొంతకాలం  ప్రజలు  ఇటువంటి  మాయలో ఉండొచ్చు. 

- ప్రొ. కంచ ఐలయ్య షఫర్డ్​