బయో వార్ భయం ఏంటీ? .. ఎందుకు భయం?

బయో వార్ భయం ఏంటీ? .. ఎందుకు భయం?

కొన్ని దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధాలు, కొన్ని దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధాలు..  పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేండ్ల నుంచి జరుగుతున్న ఈ ప్రాంతీయ యుద్ధాలు కాస్తా మూడో ప్రపంచ యుద్ధంగా మారితే.. ప్రపంచంలో శక్తిమంతమైన రష్యా, అమెరికా, చైనా లాంటి దేశాలు ఆ యుద్ధంలో పాల్గొంటే.. అప్పుడు ప్రపంచం పరిస్థితి ఏంటి? ప్రజలు ఎటువంటి విపరీతమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది? అసలు అలాంటి భీకర యుద్ధం జరిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? 

మూడో ప్రపంచ యుద్ధం జరిగితే.. అది బాంబులు, వెపన్‌‌‌‌లతోనే ఆగిపోదు. ‘బయోవార్‌‌‌‌’‌‌‌‌ జరిగే ప్రమాదం కూడా ఉంది. బయోవార్‌‌‌‌‌‌‌‌ అంటే.. బ్యాక్టీరియా, వైరస్‌‌‌‌లు, రికెట్సియా, శిలీంధ్రాలు, టాక్సిన్స్ లేదా ఇతర జీవసంబంధ ఏజెంట్లు, వ్యాధి కారకాలను ఒక దేశం మరో దేశం మీద ప్రయోగించి అక్కడి ప్రజలు లేదా మొక్కలు, జంతువులు లాంటి వాటికి హాని కలిగించడం. వాస్తవానికి నేరుగా సైనికులు తలపడి యుద్ధం చేసిన దాని కంటే.. బయోవార్ చాలా ప్రమాదకరం. దీనివల్లే ఎక్కువమంది చనిపోయే ప్రమాదం ఉంది. అణ్వాయుధాల్లా భవనాలు, ఆస్తులను నాశనం చేయలేకపోయినా.. ఎన్నో చావులకు కారణం అవుతాయి ఈ బయోవార్​లు. 

ఎప్పటినుంచో.. 

బయోలాజికల్ వార్‌‌‌‌‌‌‌‌ జరిగినట్టు మొట్టమొదటిసారిగా1347లో గుర్తించారు. మంగోల్ బలగాలను చంపేందుకు ప్లేగుతో చనిపోయిన కొందరి శవాలను ఓడల్లో తీసుకొచ్చి వాళ్ల సరిహద్దుల్లో విసిరేశారు. ఆ తర్వాత నాలుగేండ్లలో ప్లేగు విపరీతంగా వ్యాపించింది. అప్పట్లోనే లక్షల మంది చనిపోయారు. 1710లో ఎరివాల్‌‌‌‌లో స్వీడిష్ దళాలతో పోరాడుతున్న రష్యన్ సైన్యం కూడా ప్లేగు సోకిన శవాలను సిటీ గోడలపై నుంచి విసిరేసింది.

1763లో బ్రిటిష్ దళాలు ఫోర్ట్ పిట్ (ఇప్పుడు పిట్స్‌‌‌‌బర్గ్) దగ్గర పాంటియాక్ తిరుగుబాటుని అణచివేస్తున్నప్పుడు ఇండియన్స్‌‌‌‌కి మశూచి వైరస్ సోకిన దుప్పట్లు ఇచ్చారు.  పశ్చిమ, తూర్పు సరిహద్దుల్లో మిత్రరాజ్యాల సైన్యాల గుర్రాలు, పశువులకు సోకేలా చేయడానికి జర్మనీ అంటువ్యాధి ఏజెంట్ గ్లాండర్స్‌‌‌‌ని వాడింది. 1915లో రష్యాను దెబ్బతీయడానికి సెయింట్ పీటర్స్‌‌‌‌బర్గ్‌‌‌‌లో ప్లేగు వ్యాధి వ్యాప్తి చేయడానికి జర్మనీ ప్రయత్నం చేసిందని చెప్తుంటారు. రెండో ప్రపంచయుద్ధం టైంలో కూడా ఇలాంటి బయోవార్‌‌‌‌‌‌‌‌ జరిగిందట. అలా చూస్తే చరిత్రలో చాలాసార్లు బయోవార్స్ జరిగాయి. 


అందుకే యుద్ధాల్లో బయోలాజికల్‌‌‌‌ వెపన్స్‌‌‌‌ వాడకూడదని చాలా దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. ముఖ్యంగా 1925 జెనీవా ప్రొటోకాల్, అనేక అంతర్జాతీయ న్యాయ ఒప్పందాల ప్రకారం దీన్ని యుద్ధ నేరంగా గుర్తించారు. తర్వాత1972లో జరిగిన బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్ (బీడబ్ల్యూసీ)లో జీవాయుధాల అభివృద్ధి, ఉత్పత్తి, కొనుగోలు, బదిలీ, నిల్వలు, వినియోగాన్ని నిషేధించారు.  
నియంతలు పాలించే రాజ్యాలు పోయి ప్రజాస్వామ్య దేశాలు వచ్చాయి. టెక్నాలజీ పెరిగింది. దేశాల మధ్య ఒప్పందాలు కుదిరాయి. పరస్పర సహకారం, వాణిజ్యం పెరిగాయి. ఇలా దేశాల మధ్య సంబంధాలు ఎంతో బలపడ్డాయి. అయినా.. యుద్ధాల విషయంలో అంత మార్పులేదు. కొన్ని దేశాలు కయ్యాలను కొని తెచ్చుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితులు ఉన్నన్ని రోజులు ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయం ఉంటుంది.