
ఎగ్జామ్స్ టైం వచ్చేస్తోంది. ఈ టైంలో స్టూడెంట్స్ దృష్టి మొత్తం చదువుపైనే ఉంటుంది. ఇలాంటప్పుడు వాళ్లు తినే వాటి విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పరీక్షల టైంలో వచ్చే టెన్షన్‌తో కొందరు పిల్లలు సరిగ్గా తినరు. దాంతో శారీరకంగా, మానసికంగా నీరసంగా తయారవుతారు. ఇంకొందరు టైం దొరకదని ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినేస్తుంటారు. దాంతో అనారోగ్యం పాలయ్యే సందర్భాలు చాలానే ఉంటాయి.
చదువుకోవడంలో పడి సరైన ఫుడ్ తీసుకోకపోతే సమస్యలు కొని తెచ్చుకున్నట్టే అంటున్నారు న్యూట్రిషనిస్ట్‌లు. సరైన వ్యాయామం, బ్యాలెన్స్‌డ్ ఫుడ్ ఉంటే ఎగ్జామ్స్ హాయిగా రాసేయొచ్చు అంటున్నారు వాళ్లు. అందుకు ఏం చేయాలంటే... ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రొటీన్ , క్యాల్షియం, ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ తినాలి. ఒక గ్లాస్ పాలు, సీజనల్‌గా దొరికే పండ్లు తీసుకోవాలి. చాలామంది స్టూడెంట్స్ పరీక్షలకు ప్రిపేరయ్యే మూడ్‌లో ఉండి బ్రేక్ ఫాస్ట్ మానేస్తుంటారు. ఇలా చేయటం ఏమాత్రం మంచిది కాదు. ఇడ్లీ, దోస, ఉప్మా లాంటివి ఏవైనా తినొచ్చు. బయటి వాటి కంటే ఇంట్లో తయారుచేసినవి తినటం మంచిది.
శ్నాక్స్‌కి చాక్లెట్స్, పిజ్జా, బర్గర్స్ తింటుంటారు. వీటి బదులు కర్జూర, బాదం, వాల్‌నట్స్ లాంటి డ్రై ఫ్రూట్స్ తీసుకోవటం మంచిది. క్యారెట్ ముక్కలు, కీరదోసల్ని శ్నాక్స్‌గా తింటే ఇంకా మంచిది. పెరుగు, మజ్జిగ తాగేందుకు చాలామంది పిల్లలు ఇష్టపడరు. అలాంటి వాళ్లు వేసవి కాలంలో పండ్లను పెరుగుతో కలపి సలాడ్‌లా తినాలి.
పరీక్షలు రాసేవాళ్లు హెల్త్ పాడుకాకుండా చూసుకోవాలి. అలా ఉండాలంటే ఇమ్యూనిటీ చాలా అవసరం. అది రావాలంటే విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ తినాలి. విటమిన్–సి ఉండే ఆరెంజ్, జామ, బత్తాయి వంటి పండ్లను తినాలి. జంక్ ఫుడ్, ఫ్యాట్ ఎక్కువ ఉండే ఫుడ్ జోలికి అస్సలు వెళ్ళొద్దు. ఒత్తిడి పోయి రిలాక్స్ అయ్యేందుకు కొంచెంసేపు ఎక్సర్‌సైజ్, వాకింగ్ చేయాలి.
చదువుకునే పిల్లలు కాఫీ, టీకి దూరంగా ఉండాలి. వాటి బదులుగా గ్రీన్ టీ తాగొచ్చు. ఒకేసారి ఎక్కువ ఫుడ్ తినడం వల్ల నిద్ర వస్తుంది. ఎక్కువసేపు కూర్చొనే ఉంటారు కాబట్టి తిన్న ఫుడ్ సరిగ్గా జీర్ణం కాదు. అందుకే కొంచెం కొంచెం తినాలి. కొందరేమో ఎగ్జామ్స్ ఒత్తిడితో ఉండి సరిపడా నిద్రపోరు. అలాంటి వాళ్లు పడుకునే ముందు వేడి పాలు తాగితే ఒత్తిడి తగ్గి మంచి నిద్ర పడుతుంది.