5.72 లక్షల ఇండ్లు ఇస్తామన్న కేసీఆర్ హామీ ఏమైంది: సల్మాన్ ఖుర్షీద్

5.72 లక్షల ఇండ్లు ఇస్తామన్న కేసీఆర్ హామీ ఏమైంది: సల్మాన్ ఖుర్షీద్
  • కట్టినవి కూడా సక్కగ లేక ఉరుస్తున్నయ్
  • కాళేశ్వరం అవినీతి ప్రాజెక్ట్ అని విమర్శ

హైదరాబాద్, వెలుగు :  డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో బీఆర్ఎస్ లీడర్లు ప్రజల సొమ్మును లూటీ చేశారని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) మెంబర్ సల్మాన్ ఖుర్షీద్ ఆరోపించారు. 2017 నుంచి ఇప్పటి దాకా డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం ప్రభుత్వం.. రూ.23,679 కోట్లు కేటాయిస్తే.. అందులో కేవలం రూ.388 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని విమర్శించారు. 5.72 లక్షల ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్.. దాన్ని మరిచిపోయారన్నారు. 9 నెలల్లోనే ప్రగతిభవన్ కట్టి.. సామాన్యుడి ఇండ్లు ఎందుకు కట్టలేకపోతున్నారని ప్రశ్నించారు. బుధవారం గాంధీభవన్​లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్​ మహేశ్ కుమార్ గౌడ్, మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఇందిరమ్మ ఇండ్లు ఇరుకుగా ఉంటాయని కేసీఆర్ ఎక్కిరించారు. అల్లుడు వస్తే ఎక్కడ ఉంటాడని అన్నరు. ఇందిరమ్మ ఇండ్ల కంటే మంచివి కట్టిస్తామన్నారు. మరి, ఎంత మందికి ఇండ్లిచ్చారో కేసీఆర్ చెప్పాలి. ఇప్పటిదాకా కట్టిన ఇండ్లు కూడా సరిగ్గా లేవు. చిన్న వర్షానికే ఉరుస్తున్నాయి. గోడలకు క్రాక్స్ వస్తున్నాయి. పెచ్చులూడి పడుతున్నాయి..” అని సల్మాన్ ఖుర్షిద్ మండిపడ్డారు.

ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం

కాళేశ్వరం ప్రాజెక్ట్​ను అవినీతిమయంగా మార్చేశారని, నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా కట్టారని ఖుర్షిద్ ఆరోపించారు. రాష్ట్రంలో 65 లక్షల మందికి ఇండ్లు లేవని, అలాంటి వారికి కాంగ్రెస్ భూమిచ్చి ఇండ్లు కట్టిస్తుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలు అమలు చేస్తుందన్నారు. కామారెడ్డిలో కట్టిన ఇండ్లు నాణ్యతగా లేకపోవడంతో ప్రజలు తీసుకోవడానికి ఇష్టపడడం లేదని, అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్నారు. హైదరాబాద్​తో తనకు ఎంతో అనుబంధం ఉందన్నారు. తాను ఓయూలో చదువుకున్నట్లు చెప్పారు. ఇక్కడకు వస్తే సొంతింటికి వచ్చినట్టు అనిపిస్తుందన్నారు.  తెలంగాణతో ఇందిరా గాంధీ, సోనియా గాంధీలది విడదీయరాని బంధమన్నారు. రాష్ట్ర ఏర్పాటులో వారిది కీలకపాత్ర అని చెప్పారు.