అఫ్గాన్​​ తాలిబాన్లు, పాకిస్తాన్ కలిసి అఫ్కిస్తాన్ అయితే ఎట్ల?

V6 Velugu Posted on Sep 02, 2021

తాలిబాన్ల కీలక నాయకులు ఇంతకాలం పాకిస్తాన్ భూభాగం నుంచే కార్యకలాపాలు నడుపుతూ వచ్చారు. ఆ దేశ సైన్యంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. తాలిబాన్ల చేతుల్లోకి వెళ్లిన అఫ్గానిస్తాన్​పాకిస్తాన్​తో కలిసి ‘అఫ్కిస్తాన్’ గా మారి అంతర్జాతీయంగా నూతన సమీకరణలకు కేంద్రంగా నిలిచే అవకాశం ఉంది. నూతన అంతర్జాతీయ వ్యవస్థ ఏర్పాటులో ‘అఫ్కిస్తాన్’ కీలకంగా మారే అవకాశం ఉంది. ఈ పరిణామాల పట్ల ఇండియా ఇప్పుడే అలర్ట్ కాకుంటే  భవిష్యత్ లో ఆ ముప్పును తట్టుకొనే చాన్స్ ఉండకపోవచ్చు.

అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా సేనలు వెళ్లిపోవడంతో ఇప్పుడక్కడ తాలిబాన్లను ఎదిరించే వారే లేకుండా పోయారు. సమీప భవిష్యత్ లో ఆ దేశంపై సైనిక చర్యకు సాహసం చేసే వారు కూడా కనిపించడం లేదు. రష్యా, చైనా వంటి దేశాలు వాణిజ్య, రాజకీయ ప్రయోజనాలకు ఆ దేశాన్ని ఉపయోగించేసుకొనే ప్రయత్నం చేయడం తప్ప, తాలిబాన్లపై చర్యలకు పాల్పడే ప్రయత్నం చేసేలా లేరు. అయితే  ఇష్టం ఉన్నా, లేకపోయినా ఇప్పుడు తాలిబాన్లు తమ రాజకీయ మనుగడకు చైనా, పాకిస్థాన్, రష్యాలతో పాటు సౌదీ అరేబియా నియంత్రణలో ఉండక తప్పదు. తాలిబాన్ల కీలక నాయకులు ఇప్పటి వరకు పాకిస్థాన్ భూభాగంలో నుంచి కార్యకలాపాలు నడుపుతూ వస్తున్నారు. ఆ దేశపు సైన్యంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుత అఫ్గానిస్తాన్ పాకిస్థాన్​ కలిసి ‘అఫ్కిస్తాన్’ గా మారే చాన్స్​ ఉందని రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ డాక్టర్ పి దయాచారి అంటున్నారు. అఫ్కిస్తాన్​గా మారితే అంతర్జాతీయ సమాజానికి ముప్పు తప్పదు.

తాలిబాన్ల వైఖరిలో మార్పు తప్పదు 

తాలిబాన్లు ఇప్పుడు దేశ పాలన పట్ల దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే మొదటి నుంచి ‘శాంతియుతంగా అధికార మార్పిడి’ అనే పదజాలం వాడుతూ వస్తున్నారు. అన్ని దేశాలతో మంచి సంబంధాలు కోరుకొంటున్నట్లు మాట్లాడుతున్నారు. ఇప్పుడక్కడ ఎంతో మంది ప్రజలు కడు పేదరికంలో ఉన్నారు. 20 ఏండ్లుగా అమెరికా ప్రాబల్యంతో స్వేచ్ఛ ప్రపంచం వాసనలు, ఆధునిక నాగరికత సొగసులు చూసిన యువత, ముఖ్యంగా మహిళలు ఉన్నారు. వారందరినీ అణచి వేయడం సాధ్యం కాదు. మరోవైపు అంతర్జాతీయ సమాజం సాయం లేకుండా అక్కడ అభివృద్ధి సాధ్యం కాదు. ఈ పరిస్థితుల్లో తాలిబాన్లు నడవడికను మార్చుకోక తప్పదు. క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తున్న వారు కటువుగా, కరకుగా కనిపిస్తున్నా అంతర్జాతీయ వ్యవహారాలు చూస్తున్న వారు ఆధునిక విద్యతో, ఆధునిక పాలన పద్ధతులకు ప్రాధాన్యత ఇవ్వక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. మిగిలిన ఉగ్రవాద సంస్థల లాగా తాలిబాన్లు తమ దేశ పరిధి దాటి ఎప్పుడూ ఉగ్రరూపం చూపలేదు. అయితే ఐఎస్, ఆల్ ఖైదా వంటి సంస్థలకు ఆశ్రయం ఇస్తూ వచ్చారు. అమెరికా సైన్యంపై పోరాటంలో వారి సహాయ, సహకారాలు తీసుకున్నారు. అందుకే ఐఎస్-కె వంటి దళాలతో సంబంధాలు అంతా సానుకూలంగా లేకపోయినా, వారితో సహజీవనం సాగించక తప్పదు.  ఒక వంక ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కొనసాగిస్తూ.. వారికి ఆశ్రయం ఇస్తూనే, ఆధునిక పాలన పద్ధతులు చేపట్టడం ప్రస్తుతం తాలిబాన్ల ముందు ఉన్న పెద్ద సవాల్. 

దౌత్యంలో ఆరి తేరారు 

20 ఏండ్లుగా ఒక దేశంతో సంబంధం లేకుండా మరో దేశం నుంచి సహాయ సహకారాలు పొందడంలో అసాధారణమైన దౌత్య నీతిని తాలిబాన్లు అనుసరిస్తూ వస్తున్నారు. అమెరికాకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఆ దేశంతో స్నేహంగా ఉంటున్న సౌదీ అరేబియా నుంచి భారీగా ఆర్థిక వనరులు పొందుతూ వచ్చారు. అమెరికాతో ‘ఉగ్రవాద వ్యతిరేక పోరాటం’లో భాగస్వామిగా ఉంటున్న పాకిస్థాన్ సైన్యం, ఐఎస్ఐ ల నుంచి ఆయుధాలు, సైనిక శిక్షణ పొందుతూ వస్తున్నారు. అఫ్గాన్ – పాక్ సరిహద్దులో ఇటువంటి శిక్షణా కేంద్రాలున్నాయి. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదం కోసం పాక్ పంపుతున్న జేఈఎం, ఎల్ఈటీ వంటి ఉగ్రవాద సంస్థలను తాలిబాన్లకు శిక్షణ ఇవ్వడంతో పాటు, ఉగ్రవాద చర్యలకు సహకరించేందుకు పంపారు. అయితే ఇక్కడ పాకిస్థాన్ వివిధ ఉగ్రవాద సంస్థలు నేరుగా సంబంధాలు ఏర్పాటు చేసుకోకుండా, అవన్నీ తమ కనుసన్నల్లో, తమ ఆదేశాలతోనే పనిచేసేటట్లు జాగ్రత్త పడుతూ వస్తోంది. అందుకే జమ్మూ కాశ్మీర్ లో పోరాటానికి సహకరించమని జేఈఎం వంటి ఉగ్రవాద సంస్థలు కోరుతున్నా తాలిబాన్లు స్పందించడం లేదు. భారత్ లో అస్థిరత్వానికి గురిచేసే చర్యలకు తాలిబాన్లు మద్దతు ఇవ్వకపోయినా, భారత్‌ వ్యతిరేక శక్తులు తమ భూభాగాన్ని ఉపయోగించుకోకుండా కట్టడి చేయడం కూడా సాధ్యం కాకపోవచ్చు. అందుకే వివిధ దేశాల్లో కరడుగట్టిన ఉగ్రవాద సంస్థలకు కేంద్రంగా అఫ్గాన్​ మారుతుందని నేడు అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

సోవియట్ యూనియన్, అమెరికా

ప్రస్తుత అఫ్గానిస్తాన్ సమస్య అప్పటి సోవియట్ యూనియన్ ద్వారా ఉద్భవించిందేనని డాక్టర్ దయాచారి  చెబుతున్నారు. కమ్యూనిజం క్షీణిస్తున్న సమయంలో శక్తిమంతమైన సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అంచున ఉన్న సమయంలో పీపుల్ డెమోక్రటిక్ పార్టీ ఆధ్వర్యంలో కమ్యూనిస్ట్ పాలనని తీసుకు వచ్చే ప్రయత్నం జరిగింది. ఈ చర్యతో అఫ్గానిస్తాన్ లో తీవ్రమైన ప్రాణ నష్టం జరిగింది. ప్రజలు, దేశం స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను కోల్పోయింది. భారీగా వనరులు సమీకరించినా ఇస్లామిక్ జనాలను కమ్యూనిస్ట్ ఆలోచనలోకి తీసుకురావడం కష్టమైంది. వారు తీసుకు వచ్చిన వ్యవస్థీకృత మార్పులను ఇస్లామిక్ ఛాందసవాదులు స్వీకరించలేదు. అధికారంలో ఉన్నవారికి, అఫ్గాన్ గ్రామీణ ప్రజల మధ్య ఏర్పడిన ఈ సాంస్కృతిక వైరుధ్యాల ఫలితంగా ప్రభుత్వ వ్యతిరేకత  కమ్యూనిస్ట్ వ్యతిరేకతగా తీవ్రరూపం దాల్చింది. ఆ సమయంలో అమెరికా, నాటో దేశాలు ముజాహిద్దీన్ దళాలను ప్రోత్సహించడం ద్వారా అవి అక్కడ అశాంతికి ఆజ్యం పోశాయి. తర్వాత ముజాహిద్దీన్లు తాలిబాన్ల రూపం దాల్చారు. సోవియట్ యూనియన్ గానీ, అమెరికా గానీ ‘పాముకు పాలు పోస్తే..’ అనే సామెతను గ్రహించకుండా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. సోవియట్ యూనియన్  భారీ వ్యయంతో అఫ్గాన్ సైన్యానికి శిక్షణ ఇచ్చి, ఆయుధాలు సమకూర్చినా అత్యంత క్లిష్ట సమయంలో ముజాహిద్దీన్ దళాలు తిరుగుబాటు చేశాయి. 20 ఏండ్లుగా శక్తినంతా ఉపయోగించి అత్యాధునిక సైనిక దళాన్ని అమెరికా తయారు చేసినా కీలక సమయంలో తాలిబాన్ల ముందు ఆ సేనలు చేతులెత్తేశాయి. అందువల్లే మొత్తం ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా జెట్ వేగంతో తాలిబాన్లు అఫ్గానిస్తాన్‌ను స్వాధీనం చేసుకోగలిగారు.

చిక్కుల్లో భారత దౌత్యనీతి 

అఫ్గానిస్తాన్​ విషయంలో అమెరికాను అనుసరిస్తూ వచ్చిన భారత్ ఇప్పుడు చిక్కుల్లో పడింది. అఫ్గాన్ ప్రభుత్వంతో సంబంధం లేకుండా, మూడేండ్లుగా తాలిబన్లతో అమెరికా ప్రభుత్వం నేరుగా సంప్రదింపులు జరుపుతూ, ఆ దేశాన్ని వారికి అప్పజెప్పడానికి ఒప్పుకున్నప్పటికీ భారత్ జాగ్రత్త పడలేదు. అస్థిరతకు మారుపేరుగా ఉన్న ఆ దేశంలో ఇండియా 3 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి భారీ నిర్మాణాలు చేపట్టింది. ఇప్పుడు అక్కడి రాజకీయ పరిణామాల్లో భారత్‌కు ఎలాంటి పాత్ర లేకుండా పోయింది.

- చలసాని నరేంద్ర,

పొలిటికల్​ ఎనలిస్ట్​

Tagged pakisthan, Taliban, Afghan, Friendly nations, Afkisthan

Latest Videos

Subscribe Now

More News