మీ ఊరికి బస్సుందా?

మీ ఊరికి బస్సుందా?

స్సులు, రైళ్లు లేకుండా మన పనులు అయితయా?

పక్క ఊళ్లో ఉన్న బడికి, కాలేజీకి బస్‌‌లనే పోవాలి. ఆఫీస్‌‌కి బస్‌‌లనే పోవాలి. ఏదన్నా ఊరికి పోవాలన్నా బస్సే. మరీ దూరం పోవాల్నంటే రైల్లో పోవొచ్చు. కాకపోతే, తెలంగాణల రైలు ప్రయాణాలు తక్కువే, ఎంత దూరమైనా బస్సు ఎక్కుడే!

అవి ప్రైవేట్‌‌ బస్సులు కావు కాబట్టి, గవర్నమెంట్‌‌ సబ్సిడీ మీద నడిచే పబ్లిక్‌‌ ట్రాన్స్‌‌పోర్ట్‌‌ కాబట్టి టికెట్‌‌ రేట్లు తక్కువే ఉంటయ్‌‌. 

అసలు ఈ పబ్లిక్‌‌ ట్రాన్స్‌‌పోర్టే లేకుంటే మన పరిస్థితి ఏంది?

‘మీ ఊరికి బస్సున్నదా?’ అని ఇప్పటికీ అడుగుతుంటరు చాలామంది. మీ ఊరికి బస్సున్నదా అన్నదానికి వచ్చే సమాధానం వెనుక పెద్ద కథే ఉంది.

బస్సు ఉన్నదంటే.. ఆ ఊరికి రోడ్డు ఉన్నదని, అది అంతో ఇంతో డెవలప్‌‌ అయిందని అనుకోవచ్చు. ఒక ఊరిని అంచనా వేయడానికి చిన్న ప్రయోగంలా ఈ మాట వాడొచ్చు. ఇవాల్టికీ బస్సులు రాని ఊళ్లు ఎన్నో ఉన్నయి.

మన జీవితాలు, ముఖ్యంగా పల్లెల్లో రోజువారీ పనులు పబ్లిక్‌‌ ట్రాన్స్‌‌పోర్ట్‌‌తోటి ఏదో ఒకరకంగా కనెక్ట్‌‌ అయి ఉంటయి కాబట్టి.

అట్లాంటి పబ్లిక్‌‌ ట్రాన్స్‌‌పోర్ట్‌‌ ఇవ్వాళ ఏ పరిస్థితుల్లో ఉన్నది? గవర్నమెంట్‌‌ కాకుండా పబ్లిక్‌‌ ట్రాన్స్‌‌పోర్ట్‌‌ ప్రైవేట్‌‌ చేతుల్లోకి పోతే ఏమైతది?

తెలంగాణ రాష్ట్రమంతటా ఎక్కడ చూసినా ఆర్టీసీ సమ్మె ముచ్చట్లే. ‘పబ్లిక్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌’ ఎంత అవసరం అన్నది తప్పకుండా మాట్లాడుకోవాల్సిన సమయం ఇది. ముఖ్యంగా పేద, మధ్య తరగతి వాళ్లందరికీ చీపెస్ట్‌‌ ట్రాన్స్‌‌పోర్ట్‌‌ అయిన బస్సు ప్రయివేట్‌‌ కంపెనీల చేతుల్లోకి పోతుందన్నప్పుడు కచ్చితంగా మాట్లాడుకోవాల్సిన సమయం.

పబ్లిక్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌.. ప్రజా రవాణా.. గత రెండొందల ఏళ్ల కాలంలో ఏ దేశంలో ఎన్నికలు వచ్చినా రాజకీయ పార్టీలు వీటి గురించి మాట్లాడకుండా ఉండలేదు. ఈ రెండొందల ఏళ్ల కాలంలోనే పబ్లిక్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ ఒక్కో జనరేషన్‌‌‌‌లో ఒక్కో కొత్త ‘ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌’ని తీసుకొస్తూ ప్రజలకు దగ్గరైంది. ప్రజల జీవితాల్లో భాగమైంది. అన్నింటికీ మించి పబ్లిక్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ అంటే మనకు బస్సే. అందువల్ల బస్సులను ప్రభుత్వ కార్పొరేషన్లే నడిపిస్తుంటాయి.

అది ఊళ్లకు వెళ్లే బస్‌‌‌‌ అవ్వొచ్చు, సిటీ బస్‌‌‌‌ అవ్వొచ్చు, విమానం అవ్వొచ్చు, మెట్రో రైల్‌‌‌‌ అవ్వొచ్చు.. ఎక్కువగా ప్రభుత్వం నడిపించే సిస్టమ్‌‌‌‌ అది. ప్రైవేట్‌‌‌‌ కంపెనీలు కూడా ఇందులో భాగమైనా, మొత్తం నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ మాత్రం ప్రభుత్వాలే మానిటర్‌‌‌‌ చేస్తుంటాయి.  పబ్లిక్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌లో వీళ్లు పెద్ద, వాళ్లు చిన్న అని ఉండదు. అందరూ సమానమే. అందరికీ టికెట్‌‌‌‌ ఉంటుంది. ఎక్కువగా ప్రభుత్వం నడిపిస్తుంది. కాబట్టి సబ్సిడీ కింద ఆ టికెట్‌‌‌‌ రేట్లు తక్కువే ఉంటాయి. ఇది ఒక్క మనదేశం, మన రాష్ట్రమే కాదు, ప్రపంచమంతటా ఫాలో అవుతున్న కాన్సెప్ట్‌‌‌‌. ఏ దేశానికైనా పబ్లిక్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ అన్నది ప్రభుత్వం కల్పించాల్సిన కనీస అవసరం. అందుకే ఏ ఊరికైనా బస్సు, బస్టాండ్‌‌‌‌ ఉండటం అన్నది ఆ ఊరికి ఒక స్టేటస్‌‌‌‌. అది మొత్తం ఊళ్లను, వాటి రూపు రేఖలను మార్చిన ఒక శక్తివంతమైన రివల్యూషన్‌‌‌‌.

రెండొందల ఏళ్ల క్రితం నుంచే..

ఇవ్వాళ మనం ఎక్కడికెళ్లాలన్నా పబ్లిక్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ వాడుతున్నాం. పల్లెవెలుగు బస్సుల దగ్గర్నుంచి, లగ్జరీ స్లీపర్‌ బస్సుల వరకు ఎన్నో రకాలుగా పబ్లిక్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ అందుబాటులో ఉంది. ఈ పబ్లిక్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ ఐడియా 19వ శతాబ్దంలో ఫ్రాన్స్‌‌‌‌లో మొదలైంది. ఓమ్నీ బస్సులు, కేబుల్‌‌‌‌ కార్లు.. ఆ రోజుల్లో పబ్లిక్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌.

మనదేశంలో కూడా ఆ శతాబ్దంలోనే రైళ్ల రాకతో పబ్లిక్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ అన్నది మొదలైంది. ఇవ్వాళ బస్సుల కోసమే ప్రత్యేకంగా రోడ్లున్న సిటీలున్నాయి. ఫ్లై ఓవర్స్‌‌‌‌పై, అండర్‌‌‌‌గ్రౌండ్‌‌‌‌లో వెళ్తున్న మెట్రో రైళ్లు ఉన్నాయి. పబ్లిక్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ ఇంతలా డెవలప్‌‌‌‌ అయింది ఈ రెండొందల ఏళ్ల కాలంలోనే.

‘హైదరాబాద్‌‌‌‌కి నడుచుకుంటనే పోయేటోళ్లంట ఆ రోజుల్ల’ అని ఎవరైనా చెప్తే, నమ్మలేకుండా ఉండొచ్చు. కాకపోతే ఒకప్పుడు ఎక్కడికి వెళ్లాలన్నా నడకే. నడుస్తూనే కొన్ని వందల కిలోమీటర్లు వెళ్లినవాళ్లు ఉన్నారు. గుర్రాలు, గుర్రపు బండ్ల మీద దేశాలు తిరగడం అన్నదీ ఉన్నదే. వాటితో సంబంధమే లేనివాళ్లకు మాత్రం పబ్లిక్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ పరిచయమయ్యేవరకు వాళ్లకు దగ్గర్లో ఉన్నవే ఊళ్లు, అక్కడున్నవాళ్లే మనుషులు. తమ జీవితమంతా ఒకే ఊళ్లో బతికి, చనిపోయినవాళ్లు వందేళ్లు వెనక్కి వెళ్తే లెక్కలేనంతమంది ఉంటారు.

పబ్లిక్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ రివల్యూషన్‌‌‌‌

పందొమ్మిదో శతాబ్దం మొదట్లో గుర్రపు బండ్లే ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌. అది లేనివాళ్లకు నడకే. అదే శతాబ్దం చివర్లోకి వచ్చేసరికి రైళ్లు నడవడం మొదలుపెట్టాయి. ప్రపంచమంతా రైలే పబ్లిక్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌. ఆ సమయానికి మనదేశాన్ని పాలిస్తున్న బ్రిటీష్‌‌‌‌ ప్రభుత్వం కూడా రైల్వేను మన దగ్గరకు తీసుకొచ్చి, పబ్లిక్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌ను జనాలకు దగ్గరచేసింది. ఆ తర్వాత కొన్నాళ్లకు బస్సులు వచ్చాయి. రైలుతో పోల్చితే, ఎన్నో విధాలుగా బస్సులను నడపడం సులువైన పని.  మారుమూల ప్రాంతాలకు కూడా చేరుతుంది. తెలంగాణలో బస్సు.. ప్రజల జీవితాల్లో ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది. ఆ విప్లవం వాళ్ల జీవితాలను ఆర్థికంగా, సామాజికంగా, సంస్కృతి పరంగా పూర్తిగా మార్చేసింది. టెక్నాలజీ కంటే ముందే ప్రజలకు ప్రపంచంతో ఒక కనెక్షన్‌‌‌‌ తీసుకొచ్చింది. పబ్లిక్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ ఊళ్ల రూపురేఖలను మార్చిందని చెప్పుకోవాలి.

ఊరు మారింది!

పబ్లిక్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ ప్రజలకు చేరాలంటే అది అన్ని ఊళ్లకు పోవాలి. ఒక బస్సు ఊరికి పోవాలంటే రోడ్లు ఉండాలి. ఏ ఊరికైనా రోడ్డు ఉండటం ఎంత అవసరమో బీహార్‌‌‌‌లోని గెహ్లౌర్‌‌‌‌ అనే ఊరికి చెందిన దశరథ్‌‌‌‌ మాంజీ ఇరవై ఏళ్లు కష్టపడి చేసిన ఒక పని గురించి చెప్పుకుంటే సరిపోతుంది.

మాంజీ భార్య ఫాల్గుణి దేవి జబ్బు పడింది. టౌన్‌‌‌‌లో హాస్పిటల్‌‌‌‌కి ఆమెను తీసుకెళ్లాలి. ఆ టౌన్‌‌‌‌కి వెళ్లాలంటే ఊరి చివర్లో ఉన్న గుట్ట ఎక్కి పోతే చాలా దగ్గర. కానీ అది అయ్యే పనా? కాదు కాబట్టి చుట్టూ తిరిగి పోవాలి. అలా పోవాలంటే కనీసం 50 కిలోమీటర్లు నడవాలి. 1950,60ల కాలం అది. ఆ రోజుల్లో పబ్లిక్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ ఇంతలా లేదు. మాంజీ తన భార్యను బతికించుకోలేకపోయాడు.

ఈ కష్టం ఎవ్వరికీ రాకూడదని ఊరి చివరి గుట్టను తవ్వడం మొదలుపెట్టాడు. మొదట్లో అతడ్ని చూసి నవ్వుకున్నారందరూ. ఇరవై రెండేళ్లు కష్టపడి మొత్తానికి అనుకున్నది సాధించాడు. తన ఊరినుంచి టౌన్‌‌‌‌కి వెళ్లే దారిని తగ్గించేశాడు. 50 కిలోమీటర్లకు పైనే ఉన్న దారి.. గుట్టను తవ్వాక 15 కిలోమీటర్లకు వచ్చింది. మాంజీ ఈ రోడ్డును తవ్విన ఇరవై ఐదేళ్లకు చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాతే ఆ ఊరికి గవర్నమెంట్‌‌‌‌ రోడ్డు వేసింది.ఇది మనదేశంలో ఒకప్పటి పల్లెల పరిస్థితి. ఆ పల్లెలకు బస్సులు వెళ్లాలంటే, రోడ్లు కావాలి. రోడ్డు వేస్తే వాళ్లకు పక్క ఊళ్లతో కనెక్షన్‌‌‌‌ దొరుకుతుంది.

బస్సు వస్తే.. జబ్బు పడితే దగ్గర్లోని టౌన్‌‌‌‌కి వెళ్తే మంచి వైద్యం అందుతుంది. పొలంలో పండిన కూరగాయలను రోజూ మార్కెట్‌‌‌‌కి తీసుకెళ్లి అమ్మొచ్చు. కూలీ పనులకు పోవడం ఈజీ అవుతుంది. పండుగొస్తే సిటీలో చదువుకుంటున్న పిల్లలు ఇంటికి రావొచ్చు. బయటినుంచి టీచర్లు వస్తారు. ఊళ్లో బడి బాగుపడుతుంది. ఇవన్నీ ఆ ఊరికి అంతకుముందు పరిచయంలేని ప్రపంచాన్ని చూపిస్తాయి. అందుకే, మనదేశంలో పల్లెల్ని మార్చిన ఘనత పబ్లిక్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌కే దక్కుతుంది.

లాభాలెన్నో!

పబ్లిక్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ ప్రధాన లక్ష్యమే.. ప్రజల అవసరాలకు ఉపయోగపడటం. సొంతంగా ఒక టూవీలర్‌, కారు లేనివాళ్లు ఎక్కడికైనా వెళ్లాలంటే బస్సు కోసమే చూస్తారు. ఆ బస్సులో టికెట్‌‌‌‌ రేట్లు తక్కువే ఉంటాయి కాబట్టి ఎవ్వరైనా అందులో ప్రయాణించొచ్చు. అన్నివర్గాలను కలిపిన ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌ ఇది. గాలిలో పెరిగిపోతున్న కాలుష్యాన్ని కూడా తగ్గించినట్టవుతుంది. అనేకమందితో కలిసి ప్రయాణించడంలో కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. అన్నింటికీ మించి పబ్లిక్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ చాలావరకు సేఫ్‌‌‌‌. ఇంటి దగ్గర్నుంచి బస్టాప్‌‌‌‌ వరకు నడవడం, దిగిన తర్వాత కూడా కొంత నడవాల్సి రావడం వల్ల పబ్లిక్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌తో కొంత ఫిజికల్‌‌‌‌ యాక్టివిటీ ఉంటుంది. ఇవన్నీ పక్కనబెడితే ఊళ్లు బాగుపడతాయి. ఏదైనా అత్యవసరం ఉంటే పక్క ఊరికి వెళ్లడానికి కూడా నడిచివెళ్లాల్సిన ఊళ్లు మనదేశంలో ఇవ్వాళ్టికీ ఉన్నాయి. ఈ పరిస్థితులను మార్చగలిగేది పబ్లిక్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌, అందుకోసం వెయ్యాల్సిన రోడ్లే.

మాయమవుతున్నదా?

ఈమధ్య కాలంలో ఎకానమీ డెవలప్‌ అయిన తర్వాత అందరూ ఎవ్వరికి వాళ్లే సొంతంగా టూ వీలర్‌‌‌‌, ఫోర్‌‌‌‌ వీలర్‌‌‌‌ వాడుతూ యాభై, వంద కిలోమీటర్ల వరకైనా బండ్ల మీదే పోతున్నారు. కొన్ని ఊళ్లలో ఇలాగే సొంత బండ్లు పెరిగిపోయి ఆ ఊళ్లకు బస్సు బంద్‌‌‌‌ అవుతోంది. ప్రభుత్వం కూడా ఖర్చులు పెరుగుతున్నాయని బస్సులు తగ్గిస్తోంది. బస్సు బంద్‌‌‌‌ అయిందంటే మరి సొంతంగా బండ్లు లేనివాళ్ల పరిస్థితి? ఆ ఊరు మెల్లిగా మళ్లీ పాతకాలానికే పోతుంది. అందుకే ప్రపంచమంతటా పబ్లిక్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ని వాడాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తూ క్యాంపెయిన్స్‌‌‌‌ నడుస్తున్నాయి.

ప్రైవేట్‌‌‌‌ అయ్యిందంటే.. లెక్క ఉంటదా!

పబ్లిక్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ కాన్సెప్ట్‌‌‌‌నే ముంచేసే సమస్య ఒకటి ఇప్పుడు ఎక్కడ చూసినా కనిపిస్తోంది. అదే ప్రైవేటైజేషన్. పబ్లిక్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ దాదాపు ఎక్కడైనా గవర్నమెంట్‌‌‌‌ ఆధ్వర్యంలోనే నడుస్తోంది. లేదంటే పీపీపీ (పబ్లిక్‌‌‌‌ ప్రైవేట్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌). అయితే పూర్తిగా గవర్నమెంట్‌‌‌‌ చేతుల్లో ఉన్న ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ మాత్రమే ప్రజల్లోకి పూర్తిగా వెళ్లిందన్నది ఒప్పుకోవాల్సిన సత్యం. ప్రైవేట్‌‌‌‌ కంపెనీలు ఇందులోకి జొరబడితే రేట్లు పెరుగుతాయి. చిన్న చిన్న ఊళ్లకు బస్సులు బంద్‌‌‌‌ అవ్వొచ్చు. బస్సు నిండేవరకూ ఎఫిషియెన్సీ పేరుతో వాటిని బస్టాండ్‌‌‌‌లోనే ఉంచే పరిస్థితి రావొచ్చు. కొన్ని రూట్లకు బస్సులు పెరిగితే, కొన్ని రూట్లకు బస్సులు తగ్గిపోవచ్చు. కొన్ని పూర్తిగా మూతపడొచ్చు. ఇన్ని జరిగే అవకాశాలు ఉన్నప్పుడు ఏ పబ్లిక్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ అయినా ప్రైవేట్‌‌‌‌ కంపెనీల చేతుల్లోకి వెళ్తున్నదంటే, అది భయపడాల్సిన విషయమే.

పబ్లిక్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ ఉద్దేశాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే.. ఇది ప్రజల కోసం, వాళ్ల అవసరాల కోసం ఉన్నదని ఒప్పుకోవాల్సిందే. ప్రభుత్వానికి ఈ విషయంలో ఎంత ఖర్చయినా దాన్ని ఒక సంక్షేమ కార్యక్రమం లాగానే చూడాలి తప్ప, బిజినెస్‌‌‌‌‌‌‌‌లా కాదు.  ఒక రాష్ట్రానికి సంబంధించి డెవలప్‌‌మెంట్‌‌ పబ్లిక్‌‌ ట్రాన్స్‌‌పోర్ట్‌‌ మీద కూడా డిపెండ్‌‌ అయి ఉంటుంది. గుజరాత్‌, రాజస్తాన్‌, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు కార్పొరేట్‌‌ కంపెనీలను ఆకర్షిస్తున్నాయంటే మంచి పబ్లిక్‌‌ ట్రాన్స్‌‌పోర్ట్‌‌ ఉండటం వల్లనే.

ఏదైనా ఊళ్లోకి ఒక బస్సు ఉదయం ఏడు గంటలకు, సాయంత్రం ఐదు గంటలకు వెళ్తుందనుకుందాం. ఉదయం ఏడు గంటలకు కేవలం ఐదుగురే ఎక్కుతున్నారనుకుందాం. ఆ ఐదుగురిలో ఇద్దరు పక్క ఊళ్లో చదువుకుంటున్నవాళ్లు, ఇద్దరు కూలీలు, ఒకరు పక్క ఊళ్లో హాస్పిటల్‌‌‌‌కి పోవాల్సిన వాళ్లు. ఈ ఐదుగురి కోసం బస్సు ఆ ఊళ్లోకి పోవాలా అని ఆలోచిస్తే? అది పబ్లిక్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ అవుతుందా?

ఒకవేళ తెలంగాణలో అయినా, దేశంలో ఇంకెక్కడయినా ప్రజలకు చాలా ఇంపార్టెంట్‌‌‌‌ అయిన, కనీస అవసరాల్లో ఒకటయిన బస్సులు నడిపే ఆర్టీసీ (రోడ్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌) లాంటి సంస్థ ప్రైవేట్‌‌‌‌ కంపెనీల చేతుల్లోకి పోతే, మనం చెప్పుకున్న ఐదుగురే ఎక్కుతున్న ఊళ్లోకి బస్సు పోతుందా? ఇప్పటికే బస్సులు రాని ఊళ్లు ఎన్నో ఉన్నాయి. మరి వాటి పరిస్థితి. ఆర్టీసీ ప్రైవేట్‌అయితే ఆ ఊళ్లకు బస్సులు పోతాయా?

చీపెస్ట్‌‌ ట్రాన్స్‌‌పోర్ట్‌‌ 

పబ్లిక్‌‌ ట్రాన్స్‌‌పోర్ట్‌‌ని చీపెస్ట్‌‌ ట్రాన్స్‌‌పోర్ట్‌‌గా చెప్పుకోవచ్చు. బస్సు, రైలు కాకుండా క్యాబ్‌‌, సొంత కారు.. ఎలా వెళ్లినా ఎక్కువ ఖర్చే అవుతుంది. ఇది దాదాపు అన్ని దేశాల్లోని పరిస్థితి. మనదేశం ప్రపంచంలోనే చీపెస్ట్‌‌ పబ్లిక్‌‌ ట్రాన్స్‌‌పోర్ట్‌‌ అందిస్తున్న దేశాల్లో ఒకటి. యూకె, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో పబ్లిక్‌‌ ట్రాన్స్‌‌పోర్ట్‌‌ కొంత ఖర్చుతో కూడిన వ్యవహారమే. అయినప్పటికీ సొంత బండ్ల మీద వెళ్లడంతో పోల్చితే అక్కడ కూడా పబ్లిక్‌‌ ట్రాన్స్‌‌పోర్ట్‌‌ చీప్‌‌.