రోడ్ల నిర్మాణాలకు భూములియ్యం

రోడ్ల నిర్మాణాలకు భూములియ్యం
  • ఉన్న పొలం పోతే బతికేదెట్ల?
  • నాడు రైల్వే లైన్, కాళేశ్వరం కాల్వలకు తీసుకున్రు.. నేడు రోడ్ల కోసం అడుగుతున్రు.. 
  • మెదక్​ జిల్లాలో నేషనల్, హైవే బైపాస్​ రోడ్లకు భూసేకరణకు సర్వే 
  • ప్రభుత్వ పరిహారం చాలా తక్కువని రైతుల అభ్యంతరం

‘ఇంతకుముందు రైల్వే లైన్​కు, కాళేశ్వరం కాల్వలకు భూములిచ్చే మస్తు లాసయినం. మళ్లీ ఇప్పుడు రోడ్డుకు భూములు ఇయ్యల్నా.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇయ్యం.. మాకు ఈ భూములతోనే బతుకుదెరువు. ఇవి తీసుకుంటే బతికేదెట్ల?’ అని మెదక్​ జిల్లాలోని బాధిత రైతులు ఆందోళ చెందుతున్నారు. మార్కెట్​ రేట్​కంటే ప్రభుత్వం ఇచ్చే పరిహారం చాలా తక్కువగా ఉంటుందని, దాంతో తాము నష్టపోతామమని వాపోతున్నారు. ప్రస్తుతం సర్వే చేస్తున్న మెదక్​– సిద్దిపేట హైవే రోడ్డుకు భూములిచ్చేం దుకు ససేమీరా అంటున్నారు. 

మెదక్/ రామాయంపేట, వెలుగు : మెదక్​ నుంచి సిద్దిపేట వరకు కొత్తగా నేషనల్ హైవే శాంక్షన్​ అయ్యింది. 67 కిలోమీటర్ల హైవే నిర్మాణానికి  కేంద్ర ప్రభుత్వం రూ.881 కోట్లు శాంక్షన్​ చేసింది. దీనికి సంబంధించి డీపీఆర్ రెడీ కాగా సంబంధిత అధికారులు సర్వే చేస్తున్నారు. పట్టణాలు, గ్రామాలు ఉన్నచోట నాలుగు లైన్ల రోడ్డు నిర్మించనున్నారు. అలాగే రామాయంపేట మండలం అక్కన్నపేట వద్ద ప్రస్తుతం ఉన్న రోడ్డు మీద రైల్వే గేట్ ఉండటంతో అక్కడ హైవే రోడ్డును డైవర్ట్​ చేసి బైపాస్​ రోడ్డు నిర్మించాలని నిర్ణయించారు. అలాగే రామాయంపేట పట్టణం వద్ద బైపాస్​ రోడ్డు నిర్మించాలని ప్లాన్​ చేశారు. ఇందుకుగాను ఆయా చోట్ల భూమి సేకరించాల్సి ఉంది. రామాయంపేట  మండలం తొనిగండ్ల గ్రామ పరిధిలో 5 ఎకరాలు, అక్కన్నపేటలో 11 ఎకరాలు, రామాయంపేట పట్టణ పరిధిలో 35 ఎకరాలు, కోనాపూర్​ పరిధిలో 3 ఎకరాలు సేకరించాల్సి ఉంటుందని అధికారులు గుర్తించారు. 

తీవ్రంగా నష్టపోతం..
నేషనల్ హైవే నిర్మాణానికి సేకరించే భూమికి పరిహారం ఎంతిస్తారనేది ఇంకా ప్రకటించలేదు. కానీ ఇటీవల రామాయంపేట మండల పరిధిలో కాళేశ్వరం కాల్వల నిర్మాణానికి తీసుకున్న భూములకు ఎకరాకు రూ.7.20 లక్షల చొప్పున చెల్లించారు. అలాగే అక్కన్నపేట–మెదక్ రైల్వే లైన్​ నిర్మాణానికి సేకరించిన భూములకు ఎకరాకు రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు మాత్రమే చెల్లించారు. ఇప్పుడు నేషనల్​ హైవేకు సేకరించే భూములకు సైతం ఇదే లెక్కన చెల్లించే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు. కొంత పెంచినా ఎకరాకు రూ.10 లక్షల కంటే ఎక్కువ ఇవ్వకపోవచ్చంటున్నారు. తొనిగండ్ల, అక్కన్నపేట, కోనాపూర్​ గ్రామాలు మెయిన్ రోడ్డు మీద ఉండటంతో అక్కడ ప్రస్తుతం భూముల ధర ఎకరాకు రూ.40 -నుంచి రూ.50 లక్షల వరకు ఉంది. ఇక హైదరాబాద్ –నాగపూర్​ నేషనల్​ హైవే మీద ఉన్న రామాయంపేట పట్టణ పరిధిలో అయితే ఎకర భూమి రూ.కోటి వరకు పలుకుతోంది. ప్లాట్ల జాగలు అయితే గజం రూ.20 వేల వరకు ఉంది. ఈ నేపథ్యంలో నేషనల్​ హైవేకు భూములు తీసుకుంటే తాము తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

బైపాస్​ వద్దని ఆందోళన
రామాయంపేట పట్టణ పరిధిలో బైపాస్ రోడ్డు నిర్మించొద్దంటూ రైతులు, ప్లాట్ల యజమానులు డిమాండ్ చేస్తున్నారు. గత ఫిబ్రవరిలో అధికారులు సర్వే నిర్వహించేందుకు రాగా, అడ్డుకుని రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. తాజాగా ఈ నెల 25న  మరోమారు అధికారులు సర్వేకు రాగా రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సర్వేను అడ్డుకుని తహసీల్దార్​ ఆఫీస్​కు వెళ్లి ఆందోళన నిర్వహించారు. బైపాస్​ రోడ్డు నిర్మిస్తే తమకు కోలుకోలేని నష్టం జరుగుతుందని, అందువల్ల ఆ ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు.