క్లౌడ్‌‌ బరస్ట్ లకు వాతావరణ మార్పులే కారణమా.. ? అసలు క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటి.. ?

క్లౌడ్‌‌ బరస్ట్ లకు వాతావరణ మార్పులే కారణమా.. ? అసలు క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటి.. ?

ఎలాంటి  సూచనలు లేదా హెచ్చరికలు లేకుండా మేఘాలు గర్జించి, విస్ఫోటనాలై పేలిపోతూ  ‘మేఘ విస్ఫోటనాలు’  లేదా  ‘క్లౌడ్‌‌ బరస్ట్‌‌’ రూపంలో ప్రళయం సృష్టించడం మన ఉత్తర  భారత  పర్వత శ్రేణుల్లో  సర్వసాధారణమైంది. గత వారంలో  కాశ్మీర్‌‌ లోయలోని  కిశ్త్‌‌నాడ్‌‌ ప్రాంతంలో సంభవించిన క్లౌడ్ బరస్ట్‌‌ విపత్తులో కనీసం 60 మంది ప్రాణాలు కొల్పోవడం,  500 మందికి పైగా అమాయకుల ఆచూకీ లభించకపోవడం,  వేలమంది గాయపడటం, లోయలో  కొండ చరియలు విరిగిపడి నివాసగృహాలు పేకమేడల్లా కూలిపోవడం,  ఆకస్మిక  ప్రమాదకర వరదల్లో  సర్వం కోల్పోవడం చూసి చలించిపోయాం. 

ఈ ప్రకృతి ప్రకోప దుర్ఘటనలో  వెయ్యిమందికిపైగా మరణించినట్లు అధికారులు అంచనా వేశారు.  అదేవిధంగా 2013లో ఉత్తరాఖండ్‌‌ పర్వత లోయల్లో సంభవించిన మేఘ విస్ఫోటనంలో కనీసం 6,000 మంది  మరణించడం ఒక అతి భయంకర చీకటి అధ్యాయంగా నమోదు అయ్యింది. ఆకస్మికంగా,  వాయు వేగంగా, అతి కొద్ది సమయంలో (గంటలోపు), వాతావరణశాఖ ముందస్తు అంచనాలకు దొరక్కుండా, కొద్ది ప్రాంతంలోనే ఉరుములు మెరుపుల ఘర్షణల నడుమ భయంకర కుండపోతతో తీవ్ర వరదలతో కొండచరియలు విరిగిపడడం, ఊర్లన్నీ ఊడ్చి పెట్టుకుపోవడం, అపార ఆస్తి, ప్రాణ నష్టాలు నమోదు కావడం ఒక  సహజ ప్రకృతి ప్రకోపంగా మేఘ విస్ఫోటనాలను వర్ణిస్తున్నారు. 

క్లౌడ్‌‌ బరస్ట్‌‌ అంటే ఏమిటి?

అతి కొద్ది ప్రాంతంలో అపారమైన కుండపోత వర్షం ఆకస్మికంగా,  ప్రమాదకర స్థాయిలో కురవడాన్ని మేఘ విస్ఫోటనంగా అర్థం చేసుకోవాలి.  కేవలం ఒక గంట లోపు 10 సెం.మీ కుండపోత వర్షం 30 ఘనపు కి.మీ వైశాల్యంలో మాత్రమే కురవడాన్ని  క్లౌడ్‌‌ బరస్ట్‌‌ ప్రక్రియగా వాతావరణశాఖ పేర్కొన్నది.  గాలి స్వల్పంగా వేడెక్కడం, గాలిలో  తేమ పెరిగి ఆకాశంవైపు ప్రయాణించి,  మేఘాలు అవక్షేపం చెంది కుండపోత వర్షానికి కారణం అవుతున్నట్లు తేల్చారు.  మేఘ విస్ఫోటనం ఆకస్మికంగా విధ్వంసంగా మారడం సర్వసాధారణం. మేఘ విస్ఫోటనాలను వాతావరణ శాఖ ముందస్తుగా గుర్తించడానికి అవకాశం లేనందున భారీగా ప్రాణ, ఆస్తి నష్టాలు అత్యధికంగా నమోదు అవుతున్నాయి.  

ఆకస్మికంగా అతిపెద్ద స్థాయిలో వర్షం కురవడంతో ఆ తీవ్రమైన వరదలకు కొండచరియలు కూడా విరిగిపడడం వల్ల అపార నష్టాలను చవిచూడాల్సి వస్తున్నది. అతి ఎత్తైన పర్వతాలకు వీస్తున్న గాలి తాకడంతో ఆ శీతల గాలి పైకి ప్రయాణించి, అవక్షేపం ఏర్పడి కుండపోత వానలకు కారణం అవుతున్నది. ఎత్తైన పర్వతాలు మేఘాలకు అడ్డుపడి, అవి కదలకుండా బంధించడంతో కుండపోత అవకాశాలు పెరుగుతున్నాయి. వేడి, తేమ కలిగిన గాలి పైకి ప్రయాణించడం, చల్లబడడం, అవక్షేపం అయిన వెంటనే వేగంగా కుండపోతగా వర్షం కురవడాన్ని క్లౌడ్ బరస్ట్‌‌ అని స్పష్టం అవుతున్నది.

ప్రతికూల వాతావరణ మార్పులు

ఎత్తైన పర్వతశ్రేణులు మేఘ విస్ఫోటనాలకు అనువైన ప్రదేశాలుగా మారుతున్నాయి.  వాతావరణ సగటు ఉష్ణోగ్రత ఒక డిగ్రీ పెరిగినపుడు.. గాలి 7 శాతం అధికంగా తేమను కలిగి ఉండడంతో భారీ వర్షాలు కురిసే అవకాశం పెరుగుతుంది.  పర్వత ప్రాంతాల్లో అభివృద్ధి పేరుతో అస్తవ్యస్త పట్టణీకరణ, అడవులను విచక్షణారహితంగా  నరికివేయడం, చిత్తడి నేలలు తగ్గిపోవడం,  భూమిలో నీరు ఇంకిపోవడాన్ని నిరోధించడం లాంటి కారణాలు క్లౌడ్‌‌ బరస్ట్‌‌లకు ఊతం ఇస్తున్నాయి.  

వేడెక్కిన సముద్ర జలాలు అధిక తేమను విడుదల చేయడం, స్థానిక వాతావరణ పీడనాలు తగ్గడం, అస్థిర వాతావరణం,  అధికంగా మంచుకొండలు కరగడంతో మేఘ విస్ఫోటనాలకు అవకాశం పెరుగుతుంది.  పలు కారణాలతో వాతావరణ ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల అనేక అనర్థాలు, అందులో మేఘ విస్ఫోటనాలు లాంటివి తరచుగా జరగడం చూస్తున్నాం. 

ముందస్తు జాగ్రత్తలు 

వాతావరణ శాఖ మేఘ విస్ఫోటనాలను ముందస్తుగా కచ్చితమైన అంచనా వేయడం సాధ్యం కావడం లేదు. కాబట్టి,  దీనికి ప్రతిగా మేఘ విస్ఫోటనాలను తట్టుకోవడం,  మేఘ విస్ఫోటనాల వల్ల ఎదురయ్యే నష్టాలను నివారించే చర్యలను తీసుకోవడం,  గృహాలను నదీ తీరాల్లో నిర్మించకుండా తగిన చర్యలు తీసుకోవడం,  నదీ తీరాల వైశాల్యాలను పెంచడం చేయాలి.   ఏటవాలు కొండ ప్రదేశాల్లో నిర్మాణాలు జరగకుండా నివారించాలి.  చెట్లు నాటి నేల కోతను తగ్గించడమే కాకుండా నీరు ఇంకడాన్ని పెంచాలి.  అత్యవసర వైద్య కిట్లను సిద్ధంగా ఉంచుకోవాలి.

- డా. బుర్ర మధుసూదన్ రెడ్డి