ఇంటర్నెట్ లో ఒక్క నిమిషంలో ఏం జరుగుతుందో తెలుసా..?

ఇంటర్నెట్ లో ఒక్క నిమిషంలో ఏం జరుగుతుందో తెలుసా..?

ఒక్క నిమిషం. అంటే 60 సెకన్లే. చాలా చిన్న టైమ్. కానీ… ఇంటర్నెట్ ప్రపంచంలో మాత్రం.. ఈ టైమ్ లో చాలా జరిగిపోతుంటుంది. ఈ ఒక్క నిమిషంలో సోషల్ ప్రపంచం ఎంత బిజీగా మారిపోతుందో తెలిస్తే షాకవుతారు. ఇంటర్నెట్ వరల్డ్ లో ఒక్క నిమిషంలో ఏం జరుగుతుందో అనేదానిపై ఆసక్తికరమైన ఓ రిపోర్ట్ బయటకొచ్చింది. ఆ వివరాలు చూద్దాం.

గూగుల్

ప్రపంచంలోనే టాప్ సర్చ్ ఇంజిన్ గూగుల్. ఏటికేడు గూగుల్ లో వెతుకులాట పెరిగిపోతూనే ఉంది. 2019 ఏడాదిలో ఒక్క నిమిషంలో ఏదో ఒక విషయం గురించి గూగుల్ లో సర్చ్ చేసిన వారి సంఖ్య సగటున 38 లక్షలకు పెరిగింది. అది 2018లో 37 లక్షలుగా ఉండేది.

ఫేస్ బుక్

ఖాళీ దొరికితే ఫేస్ బుక్ లో దూరిపోవడం అందరికీ అలవాటే. న్యూస్ ఫీడ్ ఏముంది… ఎవరేం పోస్ట్ చేశారో అనేది చూస్తుంటారు. అలా.. ఈ ఏడాదిలో ఒక్క నిమిషంలో ఫేస్ బుక్ లాగ్ చేసి చెక్ చేసేవారి సంఖ్య 10లక్షలకు పెరిగింది. 2018లో ఇది 9.73లక్షలుండేది.

యూ ట్యూబ్

యూట్యూబ్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో ప్లాట్ ఫామ్. ప్రతి నిమిషం యూట్యూబ్ లో 45 లక్షల వీడియోలను చూస్తున్నారు. ఇది గతేడాది ఒక్క నిమిషంలో చూసే వీడియోల సంఖ్య 43లక్షలుగా ఉండేది.

ఇన్ స్టాగ్రామ్

ఇన్ స్టాగ్రామ్ యూజర్స్… 2018 నుంచి… 2019కి భారీగా పెరిగిపోయింది. 2018లో ఒక్క నిమిషంలో ప్రపంచవ్యాప్తంగా 1లక్ష 74వేల ఫొటోలు, వీడియోలు అప్ లోడ్ అవుతుండేవి. కానీ.. ఏడాది గడిచేసరికి.. ఈ సంఖ్య 3లక్షల 47 వేల 22కు పెరిగింది. ఇన్ స్టాగ్రామ్ యూజర్స్ భారీగా పెరిగారనదానికి ఇదో ఉదాహరణ అంటోంది రిపోర్ట్. ఇది ఫేస్ బుక్ వారి అనుబంధ సంస్థ. సెలబ్రిటీలు దీనిని బాగా ప్రమోట్ చేస్తున్నారు.

ట్విట్టర్

ట్విట్టర్ అనేది ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ అంత పాపులర్ కాకపోయినా… ఇందులో హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్స్ ఇప్పటికీ చాలా పాపులర్.  ట్విట్టర్ లో ఒక నిమిషంలో 87, 500 ట్వీట్లు పడుతుంటాయి. ఇది కూడా గతంలో కంటే ఎక్కువే.

యాప్ స్టోర్… గూగుల్ ప్లే

యాపిల్ యాప్ స్టోర్, ఆండ్రాయిడ్ గూగుల్ ప్లేల నుంచి సంయుక్తంగా… ఒక నిమిషంలో 3లక్షల 90వేల యాప్స్ ను యూజర్స్ డౌన్ లోడ్ చేసుకుంటున్నట్టుగా తేలింది. 2018లో కంటే డౌన్ లోడ్ల సంఖ్య 15వేలు పెరిగింది.

ఈ మెయిల్

జీమెయిల్, ఔట్ లుక్, యాహూ, ఏఓఎల్ మెయిల్ సర్వీసులు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ యూజర్లు విరివిగా వాడుతున్నవే.  ప్రపంచవ్యాప్తంగా ఒక నిమిషంలో 18 కోట్ల ప్రైవేట్, ఫార్మల్ మెయిల్స్ పంపిస్తున్నారు యూజర్స్.