కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఓట్ల శాతం ఎంత..?

కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఓట్ల శాతం ఎంత..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ దాటి 65 స్థానాల్లో అభ్యర్థులు గెలుపొందారు. దీంతో తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్, మాణిక్ రావ్ ఠాక్రే, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర నేతలు గవర్నర్  తమిళిసై కలిశారు. అభ్యర్థులు జాబితాను గవర్నర్ కు అందజేశారు. ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కాంగ్రెస్ నేతలు గవర్నర్ ను కోరారు. రేపు (డిసెంబర్ 4) తెలంగాణ సీఎంగా  రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఇప్పుడు అందరి దృష్టి పార్టీల ఓటింగ్ శాతంపైనే.. 

ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది..ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఇప్పటివరకు ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటడంతో  ఈ ఉత్కంఠకు తెరపడింది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి.. ఎంత శాతం ఓట్లు వచ్చాయనే అంశంపై చర్చ సాగుతోంది. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 నియోజకవర్గాలుండగా.. కాంగ్రెస్ -64 స్థానాలు, బీఆర్ఎస్ -39, బీజేపీ -8, ఎంఐఎం -7, సీపీఐ 1 స్థానాలను గెలుచుకున్నాయి. ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన కాంగ్రెస్ సీట్లతోపాటు  ఓటింగ్ శాతం కూడా పెంచుకుంది.  పోలైన మొత్తం ఓట్లలో 39.4 శాతం ఓట్లను సాధించింది. బీఆర్ఎస్  ఓటింగ్ 37.35 శాతం, బీజేపీ 13.90 శాతం సాధించాయి. 

2018 ఎన్నికల్లో విజయం 46.9 శాతం ఓట్లతో 88 సీట్లు, కాంగ్రెస్ 28.4శాతం ఓట్లతో 25, టీడీపీ రెండు సీట్లు సాధించింది. అయితే ఈసారి ( 2023) ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటింగి అనూహ్యంగా పుంజుకుంది.  39.4శాతం ఓట్లను సాధించింది. బీఆర్ ఎస్ ఓటింగ్ శాతం తగ్గి 37.35 శాతానికి పడిపోయింది. బీజేపీ కూడా ఈ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు, ఓటింగ్ శాతం సాధించింది.  2018లో 6.98 శాతం ఓట్లతో కేవలం ఒక్క సీటు సాధించిన బీజేపీ..13.90 శాతం ఓటింగ్ తో 8 స్థానాల్లో గెలుపొందింది.