ద్వితీయశ్రేణి నగరాల అభివృద్ధి మాటేంటి?

ద్వితీయశ్రేణి నగరాల  అభివృద్ధి మాటేంటి?

దేశంలో అభివృద్ధి చెందిన కీలక నగరాల్లో  హైదరాబాద్ ఒకటి.   ప్రభుత్వాలు మారుతున్నా అభివృద్ధి మాత్రం ఇంకా హైదరాబాద్ మహానగరం చుట్టూనే తిరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణలోని అన్ని జిల్లాలలో నగరాలు అభివృద్ధితో  సంతులిత వృద్ధి జరుగుతుందని ఆశించడం జరిగింది. రాష్ట్రం ఏర్పడిన కొంతకాలం తర్వాత జిల్లాల పునర్విభజన పేరుతో కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. కానీ, ఆ నగరాలు నేటికీ అభివృద్ధికి నోచుకోకపోవడం శోచనీయం. గత ప్రభుత్వం సైతం కేవలం హైదరాబాద్​ కేంద్రంగా.. భాగ్యనగరాన్ని విస్తరించే క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగరాన్ని నలుమూలల పెంచే ప్రయత్నం కొంత జరిగింది. హైదరాబాద్ నగర అభివృద్ధి ఆహ్వానించదగినదే.  అయినప్పటికీ అభివృద్ధి అంతా కూడా హైదరాబాద్ నగరం చుట్టూ కేంద్రీకృతం అవ్వటంతో తెలంగాణలోని జిల్లా కేంద్రాలు/ నగరాలు నేటికీ   వెనకబడి పోతున్నాయి. తెలంగాణ పల్లెల నుంచి నేడు హైదరాబాద్ నగరానికి వలసలు వస్తూనే ఉన్నారు. 

ప్రతికూల పరిణామాలు

పట్టణీకరణ కేవలం ఒక నగరానికే పరిమితమైనప్పుడు ఉపప్రాంతీయ అసమానతలు ఏర్పడడానికి అవకాశం ఉంది. చిన్న పట్టణాల అభివృద్ధిని విస్మరించడం వల్ల అనేక రకాల ప్రతికూల పరిణామాలు ఏర్పడనున్నాయి. చిన్న పట్టణాలలో అవసరమైన మౌలిక సదుపాయాలు కానీ, విద్యాసంస్థలు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు ఏర్పాటులో వెనకబడి ఉంటాయి.  ఫలితంగా పట్టణ, గ్రామీణ విభజన తీవ్రంగా ఉంటుంది. ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జాతీయ జనాభా కమిషన్ ప్రకారం..దేశవ్యాప్తంగా పట్టణ నివాసుల శాతం 2023లో 35.1% నుంచి 2036లో 39.1%కి పెరుగుతుందని అంచనా. దీని ప్రకారం, తెలంగాణ పట్టణ జనాభా దేశం కంటే 12.5% ఎక్కువగా ఉంటుందని అంచనా వేయబడింది. 2036 నాటికి  ఈ వ్యత్యాసం 18.3%కి పెరుగుతుందని అంచనా వేయడమైంది. అందువల్ల భారతదేశంలోని మిగిలిన ప్రాంతాల కంటే తెలంగాణ మరింత పట్టణీకరణ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం 11 ఏండ్ల తర్వాత కీలకమైన గృహ వినియోగ వ్యయ సర్వే- హెచ్​సీఈఎస్​ 2022-–23 రిపోర్టు తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణలో పట్టణాలలో నెలవారీ సగటు వినియోగ వ్యయం- 8,158, గ్రామీణ ప్రాంతాలలో 4,802 వ్యయం ఉన్నట్టు పేర్కొనడం జరిగింది. ఈ నివేదిక ద్వారా తెలంగాణ ప్రాంతంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య తీవ్రమైన అసమానతలు ఉన్నట్లుగా భావించవచ్చు. ఉపప్రాంతీయ అసమానతలు కొనసాగినట్లయితే రాష్ట్ర అభివృద్ధిపైన కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.

అంకుర పరిశ్రమలకు ప్రోత్సాహం

అంకుర పరిశ్రమల ప్రోత్సాహానికి, స్వయం ఉపాధి పొందడానికి హైదరాబాద్ కేంద్రంగా వివిధ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతున్నది. పల్లెల్లో ఉన్న యువకులు నేడు వ్యవస్థాపకులుగా ఎదగడానికి కావలసిన శిక్షణ, ప్రోత్సహం కరువు అవుతున్నది.  సహజంగానే వ్యవస్థాపకులుగా మారడానికి నష్టభయం, సరైన ఆర్థిక వనరులు లేకపోవడంతో యువత వ్యవస్థాపకులుగా మారడానికి ఆసక్తి కనబరచడం ఉండదు. హైదరాబాద్ లాంటి మహానగరాలలో అంకుర పరిశ్రమలను, వ్యవస్థాపకులను ప్రోత్సహించడం కోసం టీ హబ్,  మహిళలను ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా వి హబ్ లాంటి సంస్థల ద్వారా యువతకు స్వయం ఉపాధి పొందడానికి అవసరమైన శిక్షణ, వివిధ రకాల ఆర్థిక వనరులను సమకూర్చుకోవడానికి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తూ ఉన్నాయి. చిన్న పట్టణాలు, గ్రామాలకు చెందినవారు పారిశ్రామికవేత్తలుగా మారేందుకు  అవకాశాలు లేకుండా పోయాయి. తెలంగాణ యువతకు అవసరమైన నైపుణ్య శిక్షణా కేంద్రాల కోసం తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ సెంటర్లను పెంచి.. యువతలో నైపుణ్యాలను పెంచి ఆయా ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలి. గత ప్రభుత్వం జిల్లా కేంద్రాలకు ఐటీ పార్కులను తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపించినా వాటిని విస్తరించి అభివృద్ధి చేయడంలో విఫలమైంది. ఐటీ పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు సాంకేతిక ఫలాలు ప్రజలకు అందాలంటే డిజిటల్ సౌకర్యాలను వేగవంతం చేయాలి

జిల్లా కేంద్రాలు, చిన్న పట్టణాలపై దృష్టి పెట్టాలి

తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తామని గత ప్రభుత్వం ప్రకటించినా అమలుకాలేదు. 10 ఏండ్లుగా పాలనలో తెలంగాణను నిర్లక్ష్యానికి గురిచేసినట్లే నేడు అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల బడ్జెట్ 2024-–25లో ద్వితీయ శ్రేణి నగరాల అభివృద్ధికి ఎలాంటి ప్రత్యేక ప్రణాళికలు, ఆలోచనలు చేయలేదు. ఐటీ పరిశ్రమ పెరగాలన్నా, సాంకేతిక పరిజ్ఞాన ఫలాలు ప్రజలకి అందాలన్నా కూడా డిజిటల్ సౌకర్యాలను వేగంగా పెంచాలి. గత ప్రభుత్వం తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పిస్తామని ప్రకటనలు చేసినప్పటికీ అది ఆచరణలో పెట్టలేకపోయింది. ప్రభుత్వం బడ్జెట్లో ద్వితీయ శ్రేణి నగరాల అభివృద్ధికి ఎటువంటి ప్రత్యేక ప్రణాళిక గాని, ఇటీవల బడ్జెట్లో కేటాయింపులుగానీ జరగలేదు. కావున నేటి ప్రభుత్వం ద్వితీయ శ్రేణి నగరాలలో ఐటీ పార్కులతో పాటు, లఘు కుటీర పరిశ్రమలను స్థాపించాల్సిన అవసరం ఉంది. 

ALSO READ : కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్​ శక్తులకు కొమ్ము కాస్తోంది : రామకృష్ణ

ఉపాధి వికేంద్రీకరణ జరగాలి

ఒక నగరంపై అతిగా ఆధారపడటం శ్రేయస్కరం కాదు. అది ఒక ప్రధాన ఆర్థిక కేంద్రంగా ఉన్నప్పటికీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల  విభిన్న అవసరాలు, సామర్థ్యాలను పరిష్కరించకపోవచ్చు.  హైదరాబాద్ పెట్టుబడులను ఆకర్షించింది, ఉద్యోగాలను సృష్టించింది. ఇతర ప్రాంతాలపై దృష్టి  కేంద్రీకరించడం వలన ఉపాధి అవకాశాలను చిన్న పట్టణాలు అందుకోగలుగుతాయి.అభివృద్ధి కోసం పూర్తిగా హైదరాబాద్‌‌‌‌పై ఆధారపడటం వలన దాని మౌలిక సదుపాయాలపై విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ట్రాఫిక్ రద్దీ, గృహాల కొరత, పర్యావరణ సవాళ్లు వంటి సమస్యలకు దారి తీస్తుంది. వైవిధ్యభరితమైన అభివృద్ధి ఈ ఒత్తిళ్లను కొంతవరకు తగ్గించగలదు. ఆర్థికమాంద్యం లేదా ఊహించని సవాళ్ల విషయంలో ఒకే ఆర్థిక కేంద్రంపై ఆధారపడటం వలన నష్టాలు ఎదురవుతాయి.  విభిన్న రంగాలు,  ప్రాంతాలలో ఆర్థిక కార్యకలాపాలను విస్తరించడం ద్వారా వైవిధ్యభరితమైన అభివృద్ధి వ్యూహం ఈ ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడుతుంది. 


- చిట్టెడ్డి కృష్ణారెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్,
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ